మనం బంగారం కొనకపోతే రేట్లు దిగొస్తాయా? అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలను శాసించే అసలు శక్తులు ఏవో తెలిస్తే షాకవుతారు..!!
Gold Market Analysis: భారతీయులు బంగారం కొనుగోళ్లను ఆపేస్తే బంగారం ధరలు నిజంగానే దిగొస్తాయా అంటే..నిపుణులు అవుననే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ ప్రభావం పాక్షికంగా మాత్రమే ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Gold Market Analysis: భారతీయులు బంగారం కొనుగోళ్లను ఆపేస్తే బంగారం ధరలు నిజంగానే దిగొస్తాయా అంటే..నిపుణులు అవుననే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ ప్రభావం పాక్షికంగా మాత్రమే ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నగల మార్కెట్లో సేల్స్ తగ్గినంత మాత్రాన బంగారం ధరలు పూర్తిగా దిగిరావని స్పష్టం చేస్తున్నారు. దేశీయ నగల షాపింగ్ ప్రభావం బంగారం ధరలపై కొంత మేర మాత్రమే పనిచేస్తుందని.. అసలు ధరల గమనాన్ని నిర్దేశించేవి అంతర్జాతీయ ఆర్థిక అంశాలేనని వివరిస్తున్నారు.
వాస్తవానికి ప్రపంచ బంగారం వినియోగంలో భారతదేశం వాట సుమారు 20 నుంచి 25శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి భారతీయులు కొనుగోళ్లు తగ్గించినట్లయితే మార్కెట్ సెంటిమెంట్ కొంతమేర బలహీనపడి ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. కానీ భారీ పతనం మాత్రం జరగదని చెబుతున్నారు. ఎందుకంటే బంగారం మార్కెట్ ను శాసించేది అమెరికా ఆర్ధిక వ్యవస్థ. నిజానికి డాలర్ విలువను బలోపేతం చేసేందుకు ప్రస్తుతం అమెరికా పసిడి ధరలను పడేస్తోందని ప్రముఖ జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ నిపుణులు శరద్ కోహ్లీ తెలిపారు.
ముఖ్యంగా.. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు సాధారణంగా లండన్ బులియన్ మార్కెట్.. న్యూయార్క్ కామెక్స్ వంటి ఎక్స్ఛేంజీలలో జరిగే భారీ ఫ్యూచర్స్ ట్రేడింగ్, అలాగే గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడుల ద్వారా నిర్ణయిస్తారు. ఈ రంగంలో రోజువారీ ట్రేడింగ్ పరిమాణాలు, రిటైల్ మార్కెట్‌లోని భౌతిక బంగారం కంటే వందల రెట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారు నిల్వలు రిటైల్ బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయని కూడా నిపుణులు అంటున్నారు.
అంతర్జాతీయ బంగారు వాణిజ్యం అమెరికన్ డాలర్లలో జరుగుతుంది. డాలర్ బలపడితే బంగారం ధర తగ్గుతుంది. డాలర్ బలహీనపడితే బంగారం ధర పెరుగుతుంది. డాలర్ బలపడి, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, పెట్టుబడిదారులు యూఎస్ ట్రెజరీ బాండ్ల వైపు మళ్లుతారు. దీనివల్ల బంగారం ధర తగ్గుతుంది. వడ్డీ రేట్లు తగ్గితే, బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.
భారతదేశం, చైనా, రష్యా వంటి దేశాల రిజర్వ్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల కోసం టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. సాధారణ ప్రజలు చేసే ఆభరణాల కొనుగోళ్ల కంటే ఈ సంస్థాగత కొనుగోళ్లే ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి, భౌతిక బంగారం కంటే, అంతర్జాతీయ ఫండ్ మేనేజర్లు గోల్డ్ ఈటీఎఫ్‌లలో చేసే భారీ పెట్టుబడులు, ఉపసంహరణలే ధరలలో వేగవంతమైన హెచ్చుతగ్గులకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ, డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతే, దేశంలోకి బంగారం దిగుమతి చేసుకునే ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల బంగారం ధర పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు, బంగారం ధరలను ప్రభావితం చేసే దేశీయ అంశాలలో భారత ప్రభుత్వం విధించే దిగుమతి సుంకాలు, జీఎస్టీ వంటివి ఉన్నాయి. ఇవి దేశీయ ధరలపై ప్రభావం చూపుతాయి. పన్నులు తగ్గితే, స్థానిక ధర తగ్గుతుంది.
భారతీయుల షాపింగ్ వల్ల ఏం జరుగుతుంది?
భారతీయులు బంగారం కొనడం తగ్గిస్తే అంతర్జాతీయ బంగారం ధరలు పడిపోవు. కాకపోతే, మన దేశంలో బంగారం దిగుమతులు తగ్గి విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. అలాగే దేశీయ జ్యువెలరీ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వల్ల వ్యాపారులు ఇచ్చే ప్రీమియం తగ్గి కొంత డిస్కౌంట్ లభించే అవకాశం మాత్రమే ఉంటుంది.
Also Read: