Rice Price Hike In India: దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతుండటంతో సామాన్య వినియోగదారులపై ఆర్థిక భారం పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగించే సోనా మసూరి, సాంబా మసూరి, పొన్ని, ఆర్‌ఎన్‌ఆర్ వంటి బియ్యం రకాల ధరలు గణనీయంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణపై దృష్టి సారించింది. బియ్యం ఎగుమతులను నియంత్రించి దేశీయ మార్కెట్లో సరఫరా పెంచే మార్గాలను పరిశీలిస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బియ్యం సగటు రిటైల్ ధర కిలోకు రూ. 48.10కి చేరినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ధర సుమారు 11 శాతం పెరిగింది. అక్టోబర్‌లో బియ్యం ద్రవ్యోల్బణం 12.51 శాతానికి చేరినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని బ్రాండెడ్ బియ్యం రకాల ధరలు కిలోకు రూ. 100 వరకు ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.
2026-27 ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, వరి సాగు విస్తీర్ణం క్షీణించడం ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశముంది. దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే నాలుగు శాతం తగ్గినట్లు సమాచారం. ఈ పరిణామాలు బియ్యం సరఫరా, ధరలపై ప్రభావం చూపవచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ధరల నియంత్రణ కోసం నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులపై 20 నుంచి 30 శాతం వరకు ఎగుమతి సుంకం విధించడం, కనీస ఎగుమతి ధర నిర్ణయించడం వంటి ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పరిస్థితి మరింత దిగజారితే తాత్కాలిక ఎగుమతి నిషేధాన్ని కూడా చివరి ప్రత్యామ్నాయంగా పరిగణించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వీటిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.
అదే సమయంలో బియ్యం నిల్వల వివరాలను వ్యాపారులు, మిల్లర్లు, హోల్‌సేలర్లు వెల్లడించేలా చర్యలు చేపడుతున్నారు. ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద బియ్యం విక్రయాలను పెంచడం ద్వారా అందుబాటును మెరుగుపరచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే విదేశీ మార్కెట్లు, ఎగుమతిదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే వినియోగదారులకు ధరల ఉపశమనం కల్పించడం, రైతుల ప్రయోజనాలు కాపాడటం, ఎగుమతి వాణిజ్యాన్ని కొనసాగించడం మధ్య సమతుల్యం సాధించడం కేంద్రానికి కీలకంగా మారింది. కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలు బియ్యం ధరలు, మార్కెట్ సరఫరా, రైతులు, వినియోగదారులపై ఎలా ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.