Green Card PERM process: అమెరికాలో స్థిరపడాలన్న ఆశలపై నీళ్లు చల్లింది ట్రంప్ సర్కార్. ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాకిచ్చింది. గ్రీన్ కార్డు మంజూరు ప్రక్రియలో ఎంతో కీలకమైన పెర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ దాఖలు చేయకుండా 8 ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థలపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించింది.
ఈ జాబితాలో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి భారతీయ దిగ్గజాలతోపాటు మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, హెచ్ సీఎల్, క్యాప్ జెమినీ వంటి అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు విదేశీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటూ అమెరికన్లకు అవకాశాలు లేకుండా చేస్తున్నాయంటూ ఆరోపిస్తూ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది అగ్రరాజ్యం. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. ఇక నుంచి ఈ 8 కంపెనీల నుంచి ఎలాంటి కొత్త పీఈఆర్ఎం దరఖాస్తులను స్వీకరించమని.. ఇప్పటికే పెండింగ్ లో ఉన్నవాటిని కూడా ప్రాసెస్ చేయమని.. అమెరికా సర్కార్ స్పష్టం చేసింది. అయితే హెచ్ 1 బీ వీసాలపై అమెరికా వెళ్లే భారతీయ నిపుణులు, యజమాని స్పాన్సర్ షిప్ తో గ్రీన్ కార్డు కోసం ఈ PERM ప్రక్రియపైనే ఆధారపడుతారు. అయితే తాజా నిర్ణయంతో వారి శాశ్వత నివాస ఆశలకు గండిపడినట్లయ్యిందని చెప్పవచ్చు.
PERM VS H-1B VISA మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం:
హెచ్ 1 బి వీసా అనేది విదేశీ నిపుణులు అమెరికాలో తాత్కాలికంగా పనిచేసేందుకు వీలు కల్పించే ఒక నాన్ ఇమ్మిగ్రేంట్ వీసా. అయితే పీఈఆర్ఎం అనేది శాశ్వత నివాసం గ్రీన్ కార్డు కోసం యజమాని చేపట్టే ప్రక్రియలో మొదటి అడుగు అవుతుంది.
ఈ విధానం కింద ఒక ఉద్యోగానికి తగిన నైపుణ్యం, అర్హతలు ఉన్నా కూడా అమెరికన్ ఉద్యోగులు అందుబాటులో లేరని.. విదేశీ ఉద్యోగి నియామకం వల్ల స్థానికుల వేతనాలు, పని పరిస్థితులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని సదరు కంపెనీ కార్మిక శాఖకు నిరూపించాల్సి ఉంటుంది. కార్మిక శాఖ ఆమోదం తెలిపిన అనంతరం గ్రీన్ కార్డ్ కోసం తర్వాత దశకకు వెళ్లుతుంది.
ప్రస్తుత నిషేధం H-1B వీసాదారుల హోదాను నేరుగా ప్రభావితం చేయనప్పటికీ.. వారు శాశ్వత నివాసులుగా మారడానికి వీలు కల్పించే ఒక కీలకమైన ప్రక్రియకు ఇది అంతరాయం కలిగిస్తుంది. PERM లేకుండా, విదేశీ నిపుణులు అసాధారణ ప్రతిభ ఉన్న వ్యక్తులకు జాతీయ ప్రయోజన మినహాయింపు కింద మంజూరు చేయబడే EB-1A లేదా EB-2 వీసాలలో ఒకదాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. అయితే, దరఖాస్తుల పెండింగ్ కారణంగా ఈ ప్రక్రియలు క్లిష్టంగా ఉంటాయి. పూర్తి కావడానికి సంవత్సరాలు పట్టవచ్చు.
ఇది ట్రంప్ పరిపాలన వాదన:
అమెరికన్ ఉద్యోగాలను పరిరక్షించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ పరిపాలన వాదిస్తోంది. ఈ కంపెనీలు PERM కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, విదేశీయులను తక్కువ వేతనాలకు నియమించుకుంటున్నాయని, దీనివల్ల అమెరికన్లకు నిరుద్యోగం ఏర్పడుతోందని ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ ఒక గొప్ప అమెరికన్ కంపెనీ కావచ్చు. కానీ వారు గొప్ప అమెరికన్ ఉద్యోగులను నియమించుకోవాలి అని అన్నారు. ఈ కొత్త నిషేధాన్ని, విదేశీ ఉపాధిపై ట్రంప్ పరిపాలన చేపట్టిన కఠిన చర్యలలో భాగంగా చూడాలి.