Telangana Digital Governance: తెలంగాణ రాష్ట్ర పాలనా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా.. పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో.. పూర్తిస్థాయి డిజిటల్ గవర్నెన్స్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇకపై ఫైళ్ల కదలికలు, అధికారిక ఆమోదాలు అన్నీ కాగిత రహితంగా, ఆన్‌లైన్ వేదికగానే సాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ కీలక ప్రకటన చేశారు. ఆన్‌లైన్ అప్రూవల్స్.. ఇ-హెచ్‌ఆర్‌ఎమ్ఎస్ (e-HRMS) వ్యవస్థల అమలును ఖరారు చేశారు. ఈ డిజిటల్ విప్లవం ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సౌలభ్యాన్ని చేకూర్చనుందో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో పాలనను మరింత వేగవంతం చేయడంతోపాటుగా పారదర్శకత పెంచేందుకు పరిపాలనా వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ శాఖ డిజిటలైజేషన్, ఉద్యోగుల ఎలక్ట్రానిక్ హ్యుమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్ అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరి సర్వీస్ రికార్డులు.. సర్వీస్ వివరాలను ఈ నెల 15వ తేదీలోకా ఈహెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ప్రభుత్వ అనుమతులు, అధికారిక ఉత్తర్వులు, అభివ్రుద్ధి పనుల సాంకేతిక అనుమతులు డిజిటల్ రూపంలోనే జారీ చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక శాఖకు సంబంధించిన నిధుల మంజూరు, చెల్లింపులను ఆన్ లైన్ లోనే చేపట్టాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల లబ్దిదారులకు డీబీటీ నిధులను ఆధార్ ఆధారిత ధ్రువీకరణతో చెల్లించాలని సీఎస్ ఆదేశాలు చేశారు.
ఈహెచ్ఆర్ఎంఎస్ సజావుగా అమలు అయ్యేందుకు డిజిటల్ విధానం పూర్తి స్థాయిలో పట్టాలెక్కేందుకు ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ఈ డిజిటల్ మార్పుల ద్వారా పరిపాలనలో ఆలస్యానికి ఎలాంటి తావులేకుండా పనులన్నీ వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.