• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /IDBI Deal: ఐడీబీఐ కొనుగోలులో ట్విస్ట్.. బ్యాంక్ డబ్బుతోనే ఫెయిర్‌ఫ్యాక్స్ ప్లాన్.. పూర్తి వివరాలు ఇలా..!

IDBI Deal: ఐడీబీఐ కొనుగోలులో ట్విస్ట్.. బ్యాంక్ డబ్బుతోనే ఫెయిర్‌ఫ్యాక్స్ ప్లాన్.. పూర్తి వివరాలు ఇలా..!

IDBI Bank Privatization: ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలులో ఊహించని ఆర్థిక లెక్కలు తెరపైకి వచ్చాయి. బ్యాంక్ వద్ద ఉన్న మిగులు మూలధనంతోనే ఫెయిర్‌ఫ్యాక్స్‌కు చెందిన గో డిజిట్ వాటాలను కొనుగోలు చేస్తామని ప్రేమ్ వత్స వెల్లడించారు. మరోవైపు ఈ కంపెనీల బదిలీ ద్వారా వచ్చే సుమారు 3 బిలియన్ డాలర్లను ఐడీబీఐ కొనుగోలుకు నిధుల వనరుగా పేర్కొన్నారు. అసలు ఈ డీల్ వెనుక ఉన్న నగదు లెక్కలేంటి..? పూర్తి వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Nov 02, 2026, 12:19 PM IST|Updated: Nov 02, 2026, 12:36 PM IST
joinshare
IDBI Deal: ఐడీబీఐ కొనుగోలులో ట్విస్ట్.. బ్యాంక్ డబ్బుతోనే ఫెయిర్‌ఫ్యాక్స్ ప్లాన్.. పూర్తి వివరాలు ఇలా..!

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Gurnoor Brar: టీమ్ ఇండియా పేసర్ ప్రైవేట్ ఫొటోలు లీక్..? నెట్టింట స్క్రీన్‌షాట్స్ వైరల్..!

Gurnoor Brar: టీమ్ ఇండియా పేసర్ ప్రైవేట్ ఫొటోలు లీక్..? నెట్టింట స్క్రీన్‌షాట్స్ వైరల్..!

2

Jailer 2 Movie Collection: రూ.800 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన 'జైలర్ 2' మూవీ..సినీ చరిత్రలో రజనీకాంత్ సరికొత్త రికార్డు!

3

Dhana trayodashi: ధనత్రయోదశి వేళ మరో అద్భుతం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కల సాకారం.!.

4

అమిత్ షాతో చిరంజీవి, రామ్‌చరణ్ భేటి.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు..

5

Anirudh Blushes: 'కావ్య.. కావ్య..' నినాదాలతో హోరెత్తించిన ఫ్యాన్స్..స్టేజ్‌పై సిగ్గుపడుతూ పాడిన అనిరుధ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IDBI Bank Privatization: ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలు వ్యవహారంలో ఆసక్తికరమైన ఆర్థిక లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.52,878 కోట్లకు బ్యాంకులో 60.72 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన కెనడాకు చెందిన ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్.. అదే సమయంలో తన ఆధీనంలోని గో డిజిట్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సంస్థల్లోని వాటాలను కూడా ఐడీబీఐలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే ఈ రెండు వ్యవహారాల మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐడీబీఐ బ్యాంక్ వద్ద ఉన్న మిగులు మూలధనంతోనే ఫెయిర్‌ఫ్యాక్స్‌కు చెందిన కంపెనీల వాటాలను కొనుగోలు చేయనున్నట్లు ఆ సంస్థ అధినేత ప్రేమ్ వత్స స్వయంగా వెల్లడించారు. మరోవైపు ఈ కంపెనీల బదిలీ ద్వారా సమకూరే మొత్తాన్ని ఐడీబీఐ కొనుగోలుకు అవసరమైన నిధుల వనరుల్లో ఒకటిగా ఫెయిర్‌ఫ్యాక్స్ పేర్కొనడం మరిన్ని ప్రశ్నలకు లెవనేత్తుతోంది. అసలు ఈ డీల్‌లో డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది..? ఎవరి చేతుల్లోకి వెళ్తోంది..? మొత్తం వ్యవహారంలో ఉన్న ఆర్థిక లెక్కలేంటి..?

ఐడీబీఐలో 60.72 శాతం వాటా

ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) తమ వాటాలను విక్రయించేందుకు నిర్ణయించాయి. 2026 అక్టోబర్ 14న జరిగిన కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (CCEA) మీటింగ్‌లో ఫెయిర్‌ఫ్యాక్స్ అనుబంధ సంస్థ 10955230 Canada Incను వ్యూహాత్మక కొనుగోలుదారుగా ఆమోదించారు. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో షేరుకు రూ.81 చొప్పున మొత్తం రూ.52,878.08 కోట్లకు 60.72 శాతం వాటా విక్రయించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం, ఎల్ఐసీకి చెందిన 30.24 శాతం వాటాలు ఉన్నాయి. లావాదేవీ పూర్తయిన తర్వాత కేంద్రం వద్ద 15 శాతం, ఎల్ఐసీ వద్ద 19 శాతం వాటా మిగులుతుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రూ.52,878 కోట్లను ఐడీబీఐ బ్యాంక్‌కు కొత్త పెట్టుబడిగా అందించడం లేదు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ, ఎల్ఐసీ షేర్లను ఫెయిర్‌ఫ్యాక్స్ కొనుగోలు చేస్తోంది. అంటే ఈ వాటాల విక్రయం ద్వారా వచ్చే డబ్బు వాటాలను విక్రయిస్తున్న కేంద్రం, ఎల్ఐసీకి చేరుతుంది. అదే సమయంలో తన సొంత కంపెనీలను ఐడీబీఐలోకి తీసుకొచ్చే మరో లావాదేవీని ఫెయిర్‌ఫ్యాక్స్ ప్రతిపాదించింది. ఈ రెండు లావాదేవీలను కలిపి పరిశీలించినప్పుడే అసలు ఆర్థిక సమీకరణ అర్థమవుతుంది.

ఒకే ఆర్థిక సంస్థ పరిధిలోకి..

ఫెయిర్‌ఫ్యాక్స్ ప్రణాళిక కేవలం ఒక బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలుతో ఆగిపోవడం లేదు. బ్యాంకింగ్‌తో పాటు బీమా, పెట్టుబడుల నిర్వహణ, క్యాపిటల్ మార్కెట్ సేవలను ఒకే ఆర్థిక సంస్థ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తనకున్న గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లోని వాటాలతో పాటు, ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్ ఆధీనంలో ఉన్న ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ వాటాలను కూడా ఐడీబీఐ బ్యాంక్‌కు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. గో డిజిట్ ద్వారా జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవలను బ్యాంకు ఖాతాదారులకు అందించవచ్చు. ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ చేరికతో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, వెల్త్ మేనేజ్‌మెంట్, అసెట్ మేనేజ్‌మెంట్ వంటి సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు.

ఒకవైపు ఐడీబీఐకి ఇప్పటికే ఉన్న బ్రాంచ్‌లు, ఖాతాదారులు, డిపాజిట్ల వ్యవస్థ ఉంటే.. మరోవైపు ఈ రెండు సంస్థలకు ప్రత్యేక వ్యాపార నైపుణ్యం ఉంది. వీటన్నింటినీ కలిపి ఒక సమగ్ర ఆర్థిక సేవల సంస్థగా తీర్చిదిద్దాలన్నది ఫెయిర్‌ఫ్యాక్స్ ఆలోచన. వినియోగదారులకు ఒకే చోట బ్యాంకింగ్, బీమా, పెట్టుబడుల సేవలు అందించడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించవచ్చని సంస్థ భావిస్తోంది.

ప్రేమ్ వత్స చెప్పిన విషయం ఇదే..

ఈ వ్యవహారంలో అసలు చర్చకు కారణమైన అంశం అక్టోబర్ 15న జరిగిన ఫెయిర్‌ఫ్యాక్స్ ఇన్వెస్టర్ల, విశ్లేషకుల సమావేశంలో బయటపడింది. ఆ మీటింగ్‌లో రేమండ్ జేమ్స్ సంస్థకు చెందిన విశ్లేషకుడు స్టీఫెన్ బోలాండ్ ఒక కీలక ప్రశ్న అడిగారు. గో డిజిట్ వాటాలను ఐడీబీఐ బ్యాంక్‌లోకి తీసుకొచ్చే ప్రక్రియలో, ఆ బ్యాంక్ వద్ద ఉన్న మిగులు నగదును ఉపయోగించి మార్కెట్ ధరకు వాటాలను కొనుగోలు చేస్తారా..? లేక వేరే విధానం అనుసరిస్తారా..? అని ప్రశ్నించారు.

దీనికి ఫెయిర్‌ఫ్యాక్స్ అధినేత ప్రేమ్ వత్స సమాధానమిస్తూ.. ఐడీబీఐ బ్యాంక్ వద్ద మిగులు మూలధనం ఉందని, గో డిజిట్ వాటాలను మార్కెట్ ధరల ప్రకారం కొనుగోలు చేసేందుకు బ్యాంక్ నగదు చెల్లిస్తుందని స్పష్టం చేశారు. అంటే గో డిజిట్ వాటాలను ఐడీబీఐకి బదిలీ చేసినప్పుడు, వాటికి సంబంధించిన ప్రతిఫలాన్ని ఐడీబీఐ బ్యాంకే నగదు రూపంలో చెల్లించే విధానం ఉందని వత్స వివరించారు. ఈ సమాధానం ఈ డీల్‌లో అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఎందుకంటే ఒకవైపు ఫెయిర్‌ఫ్యాక్స్ ఐడీబీఐ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తోంది. మరోవైపు, అదే ఫెయిర్‌ఫ్యాక్స్‌కు చెందిన సంస్థల వాటాలను కొనుగోలు చేసేందుకు ఐడీబీఐ తన మిగులు మూలధనాన్ని వినియోగించనుంది. దీంతో బ్యాంకు కొనుగోలుకు అవసరమైన నిధుల సమీకరణలో బ్యాంకు నుంచే వచ్చే నగదు కూడా భాగం కానుందా..? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.

5.6 బిలియన్ డాలర్లు అవసరం..

ఇదే సమావేశంలో ఫెయిర్‌ఫ్యాక్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పీటర్ క్లార్క్ మరింత ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. ఐడీబీఐ బ్యాంక్‌లో 60 శాతం వాటా కొనుగోలుకు అవసరమైన మొత్తం సుమారు 5.6 బిలియన్ డాలర్లని ఆయన చెప్పారు. ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు ఫెయిర్‌ఫ్యాక్స్ పలు మార్గాలను అనుసరించనుంది. ఇందులో సంస్థ వద్ద ఇప్పటికే ఉన్న నగదు, అనుబంధ బీమా సంస్థల నుంచి వచ్చే డివిడెండ్లు, ఆస్తుల విక్రయం, గో డిజిట్ బీమా వ్యాపారంలోని జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలు, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ వాటాల బదిలీ ఉన్నాయి.

ఈ మూడు వ్యాపార విభాగాల నుంచి వచ్చే వాటాల బదిలీల విలువ కలిపి సుమారు 3 బిలియన్ డాలర్లుగా ఉంటుందని క్లార్క్ వివరించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.25 వేల కోట్లకు పైగా ఉంటుంది. అంటే ఐడీబీఐ కొనుగోలుకు అవసరమైన మొత్తం రూ.52,878 కోట్లతో పోలిస్తే, ఈ మూడు వ్యాపారాల బదిలీ విలువే గణనీయమైన స్థాయిలో ఉంది. అంతేకాదు, ఈ బదిలీలను కేవలం వ్యాపార విస్తరణ కోణంలోనే కాకుండా, ఐడీబీఐ కొనుగోలుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా కూడా ఫెయిర్‌ఫ్యాక్స్ లెక్కల్లో చూపించడం గమనార్హం.

అయితే ఒక ముఖ్యమైన తేడా ఉంది. ప్రేమ్ వత్స ఐడీబీఐ మిగులు మూలధనం నుంచి నగదు చెల్లింపును ప్రత్యేకంగా గో డిజిట్ వాటాల కొనుగోలు ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. గో డిజిట్, దాని లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారం, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ కలిపి సుమారు 3 బిలియన్ డాలర్ల విరాళం లేదా బదిలీ విలువను క్లార్క్ కొనుగోలు నిధుల లెక్కలో పేర్కొన్నారు. మొత్తం మూడు విభాగాలకు చెల్లింపు విధానం ఒకేలా ఉంటుందని మాత్రం ఆ సమాధానంలో విడిగా వివరించలేదు.

మరిన్ని వివరాలు..

ఐడీబీఐ కొనుగోలుకు అవసరమైన నిధులపై క్లార్క్ మరికొన్ని ముఖ్యమైన వివరాలు చెప్పారు. 2026 జూన్ 30 నాటికి ఫెయిర్‌ఫ్యాక్స్ హోల్డింగ్ కంపెనీ వద్ద 2.3 బిలియన్ డాలర్ల నగదు, మార్కెట్‌లో సులభంగా విక్రయించగల సెక్యూరిటీలు ఉన్నట్లు వెల్లడించారు. వీటితో పాటు మరో 2.3 బిలియన్ డాలర్ల విలువైన అసోసియేట్ సంస్థలు, కన్సాలిడేటెడ్ నాన్-ఇన్సూరెన్స్ కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయన్నారు.

2026 ప్రథమార్ధంలో పోసైడన్ సంస్థలో తమ వాటాలో సగాన్ని విక్రయించడం ద్వారా సుమారు 1.9 బిలియన్ డాలర్లు సమకూరినట్లు తెలిపారు. గతంలో ప్రకటించిన యూరోలైఫ్ విక్రయం ద్వారా మరో 900 మిలియన్ డాలర్లు లభిస్తాయని, ఆ ఒప్పందం 2026 ద్వితీయార్ధంలో పూర్తవుతుందని అప్పట్లో అంచనా వేశారు. అలాగే గత మూడేళ్లలో ఫెయిర్‌ఫ్యాక్స్ సగటున 4.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందని, బీమా వ్యాపారాల నుంచి అదనపు మూలధనం ఏర్పడుతున్నందున వాటి నుంచి మరిన్ని డివిడెండ్లు పొందే అవకాశముందని క్లార్క్ వివరించారు. ఈ మొత్తం లెక్కలను పరిశీలిస్తే, ఐడీబీఐ కొనుగోలుకు దీర్ఘకాలిక రుణాలను కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఈ లావాదేవీకి అవసరమైన నిధులను అందుబాటులో ఉన్న వనరుల నుంచి సమకూర్చుకోగలమని ఫెయిర్‌ఫ్యాక్స్ భావిస్తోంది.

ఐడీబీఐకి బదిలీ..

ఇక్కడే ఈ డీల్‌పై ప్రధాన ప్రశ్న ఎదురవుతోంది. ముందుగా ఫెయిర్‌ఫ్యాక్స్ తన కంపెనీల వాటాలను ఐడీబీఐకి బదిలీ చేస్తుంది. గో డిజిట్ వాటాల కొనుగోలుకు ఐడీబీఐ బ్యాంక్ తన మిగులు మూలధనం నుంచి నగదు చెల్లిస్తుందని ప్రేమ్ వత్స చెప్పారు. ఆ చెల్లింపు ద్వారా నగదు ఫెయిర్‌ఫ్యాక్స్ గ్రూప్‌కు చేరుతుంది. ఇదే సమయంలో ఫెయిర్‌ఫ్యాక్స్ సీఓఓ పీటర్ క్లార్క్ గో డిజిట్, దాని లైఫ్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలు, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ బదిలీలను ఐడీబీఐ కొనుగోలుకు అవసరమైన నిధుల వనరుల్లో భాగంగా లెక్కించారు.

దీంతో ఆర్థికంగా చూస్తే ఒక ఆసక్తికరమైన నిర్మాణం కనిపిస్తోంది. ఫెయిర్‌ఫ్యాక్స్ తన ఆస్తులను ఐడీబీఐకి బదిలీ చేయడం ద్వారా బ్యాంకు నుంచి నగదు పొందుతుంది. ఆ నగదు, ఇతర నిధులతో కలిపి ఫెయిర్‌ఫ్యాక్స్ తన కొనుగోలు వ్యయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే తాను కొనుగోలు చేయబోయే బ్యాంకులోని మిగులు మూలధనం, ఆ కొనుగోలుకు అవసరమైన నిధుల సమీకరణలో పరోక్షంగా పాత్ర పోషించే పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే దీనిని ఫెయిర్‌ఫ్యాక్స్ నేరుగా ఐడీబీఐ ఖాతా నుంచి ప్రభుత్వానికి డబ్బు బదిలీ చేస్తోందని అర్థం చేసుకోకూడదు. ప్రభుత్వ, ఎల్ఐసీ షేర్ల కొనుగోలు ఒక లావాదేవీ. ఫెయిర్‌ఫ్యాక్స్ కంపెనీలను ఐడీబీఐ కొనుగోలు చేయడం మరో లావాదేవీ. వాటి నుంచి వచ్చే నగదు, ఫెయిర్‌ఫ్యాక్స్ సమకూర్చే ఇతర నిధులతో కలిసే మొత్తం కొనుగోలు ధర చెల్లింపునకు ఉపయోగపడవచ్చు. ఖచ్చితంగా ఏ నగదు ఏ చెల్లింపుకు వినియోగించబడుతుందనే వివరాలు మాత్రం ఇంకా బహిరంగం కాలేదు.

ఇది డిపాజిటర్ల సొమ్మును నేరుగా ప్రభుత్వ వాటా కొనుగోలుకు మళ్లిస్తున్నారనే నిర్ధారణకు సమానం కాదు. ప్రేమ్ వత్స ఉపయోగించిన పదం ఐడీబీఐ వద్ద ఉన్న మిగులు మూలధనం. అయినప్పటికీ, ఒక బ్యాంకును కొనుగోలు చేస్తున్న సంస్థకు అదే బ్యాంకు తన ఆస్తుల కొనుగోలుకు నగదు చెల్లించడం, ఆ నగదు మళ్లీ కొనుగోలు నిధులలో భాగం కావడం అనే నిర్మాణం ఆర్థికపరంగా పారదర్శకంగా వివరించాల్సిన అంశమే.

డిపాజిట్ల వాటా 43.6 శాతం

ప్రేమ్ వత్స తన సమావేశంలో ఐడీబీఐ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి బలంగా ఉందని వివరించారు. బ్యాంకు మూలధన సమృద్ధి నిష్పత్తి 27 శాతంగా ఉందని.. నికర విలువ సుమారు 7.5 బిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు. CASA డిపాజిట్ల వాటా 43.6 శాతమని, నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి కేవలం 0.2 శాతంగా ఉందని పేర్కొన్నారు. 2026 జూన్‌తో ముగిసిన గత 12 నెలల్లో ఐడీబీఐ సుమారు రూ.9,320 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్లు కూడా వత్స వెల్లడించారు.

ఒకప్పుడు భారీ నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ బ్యాంకు పరిస్థితి పూర్తిగా మారింది. 2016 నుంచి 2020 మధ్య కాలంలో సుమారు 6.4 బిలియన్ డాలర్ల మేర నష్టాలు నమోదయ్యాయని, వాటిని ప్రభుత్వం, ఎల్ఐసీ అందించిన మూలధన సాయంతో ఎదుర్కొన్నామని వత్స చెప్పారు. 2017లో ఆర్‌బీఐ ఐడీబీఐని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (PCA) పరిధిలోకి తీసుకెళ్లింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత 2021 మార్చిలో ఆ పరిమితులను తొలగించింది. 2021 నుంచి బ్యాంకు లాభాల్లో కొనసాగుతోందని ఆయన వివరించారు. అంటే గతంలో ప్రభుత్వ, ఎల్ఐసీ మద్దతుతో కోలుకున్న బ్యాంకు ఇప్పుడు బలమైన మూలధన స్థితిలో ఉండటంతో, దాని మిగులు మూలధనాన్ని వ్యాపార విస్తరణకు ఉపయోగించాలన్నది ఫెయిర్‌ఫ్యాక్స్ ప్రణాళికలో భాగంగా కనిపిస్తోంది.

రూ.81 ధరపై ప్రభుత్వ వాదన ఏమిటి..?

ఈ ఒప్పందంలో మరో చర్చనీయాంశం ఒక్కో షేరుకు రూ.81 ధర నిర్ణయించడం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు స్వతంత్ర మదింపు సంస్థలు ఐడీబీఐ షేరు విలువను అంచనా వేశాయి. వాటి లెక్కల సగటు రూ.75.99గా నిర్ణయించారు. ఫెయిర్‌ఫ్యాక్స్ ఇచ్చిన రూ.81 బిడ్ ఈ బెంచ్‌మార్క్ కంటే ఎక్కువగా ఉందని కేంద్రం చెబుతోంది. అంతేకాకుండా 2026 జూన్ 30 నాటి పుస్తక విలువతో పోలిస్తే ఫెయిర్‌ఫ్యాక్స్ ఆఫర్ సుమారు 23 శాతం ప్రీమియంతో ఉందని సంస్థ ప్రకటించింది.

మరోవైపు, మార్కెట్లో ఐడీబీఐ షేరు ధరలు మదింపు కాలంలో రూ.61.01 నుంచి రూ.118.38 వరకు మారాయని, తక్కువ ట్రేడింగ్ కారణంగా మార్కెట్ ధరను సంస్థ అంతర్గత విలువకు సరైన సూచికగా పరిగణించలేదని కేంద్రం వివరణ ఇచ్చింది. అందుకే మార్కెట్ మల్టిపుల్, ఆస్తుల విలువ ఆధారంగా ధరను నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే గతంలో నిర్ణయించిన రిజర్వ్ ధర రూ.94.42కు మొదటి విడత బిడ్లు చేరకపోవడంతో అవి ఆమోదం పొందలేదు. ఆ తర్వాత కొత్తగా ఉత్తమ బిడ్లను ఆహ్వానించిన ప్రక్రియలో రూ.81 ధరను ఆమోదించారు. ఈ మార్పులపై మార్కెట్ వర్గాలు, బ్యాంకింగ్ రంగంలో చర్చ కొనసాగుతోంది.

CSB బ్యాంక్ విషయంలోనూ..

ఫెయిర్‌ఫ్యాక్స్‌కు ఇప్పటికే భారత్‌లో మరో బ్యాంకు అయిన CSB బ్యాంక్‌లో సుమారు 40 శాతం వాటా ఉంది. ఒకే సంస్థ రెండు బ్యాంకింగ్ లైసెన్సులను నిర్వహించే విషయంలో నియంత్రణ పరిమితులు ఉండటంతో, ఐడీబీఐ కొనుగోలు పూర్తయిన తర్వాత CSB బ్యాంక్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 15 సమావేశంలో ఈ అంశంపై ప్రశ్న ఎదురుకాగా, CSB బ్యాంక్‌ను ఐడీబీఐతో విలీనం చేయాలా..? లేక అందులోని వాటాను విక్రయించాలా..? అనే రెండు మార్గాలు పరిశీలనలో ఉన్నాయని ప్రేమ్ వత్స తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు రెండు సంవత్సరాల సమయం ఉన్నట్లు చెప్పారు.

ఇక ఐడీబీఐలో ఫెయిర్‌ఫ్యాక్స్ వాటా విషయంలోనూ భవిష్యత్తులో వాటాను తగ్గించాల్సిన నియంత్రణ నిబంధనలున్నాయని వత్స వెల్లడించారు. ప్రస్తుత నిబంధనలు మారకపోతే పది సంవత్సరాల తర్వాత 40 శాతానికి, పదిహేనేళ్ల ముగింపునాటికి 26 శాతానికి వాటాను తగ్గించాల్సి ఉంటుందని చెప్పారు.

అనుమతులు వచ్చిన తర్వాతే..

గో డిజిట్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ వాటాల బదిలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అవసరం. ఈ రెండు లావాదేవీలకు సెబీ పరిశీలన, ఆమోదం కూడా తప్పనిసరి. గో డిజిట్ బీమా వ్యాపార బదిలీకి ఐఆర్‌డీఏఐ అనుమతి తీసుకోవాలి. ఫెయిర్‌ఫ్యాక్స్ ప్రకటించిన ప్రణాళిక ప్రకారం ఐడీబీఐ ప్రస్తుత ఎండీ, సీఈఓ రాకేశ్ శర్మ బాధ్యతల్లో కొనసాగనున్నారు. మాజీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ అధిపతి ఎన్.ఎస్. కన్నన్‌ను బ్యాంక్ చైర్మన్‌గా నియమించాలని ప్రతిపాదించారు. మాజీ CSB బ్యాంక్ సీఈఓ సి.వి. రాజేంద్రన్ కూడా నాయకత్వ బృందంలో భాగం కానున్నారు. ఈ నియామకాలు ఆర్‌బీఐ ఆమోదానికి లోబడి ఉంటాయి.

అదే సమయంలో గో డిజిట్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సంస్థల ప్రస్తుత నిర్వహణ, నాయకత్వ వ్యవస్థలో మార్పులు చేయబోమని ఫెయిర్‌ఫ్యాక్స్ ప్రకటించింది. గో డిజిట్‌ను కామేశ్ గోయల్ బృందం, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్‌ను దాని ప్రస్తుత మేనేజ్‌మెంట్ కొనసాగిస్తాయని తెలిపింది. అక్టోబర్ 15 సమావేశంలో ఈ మొత్తం ప్రక్రియ 2027 తొలి త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశం ఉందని వత్స అంచనా వేశారు. అయితే అక్టోబర్ 14న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కొనుగోలు, కంపెనీల బదిలీకి సంబంధించి తుది బైండింగ్ ఒప్పందాలు ఇంకా కుదరలేదని ఫెయిర్‌ఫ్యాక్స్ స్పష్టం చేసింది. అవసరమైన అనుమతులు రాకపోతే గో డిజిట్ లేదా ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ బదిలీలు లేకుండానే ఐడీబీఐ కొనుగోలు ముందుకు సాగే అవకాశాన్ని కూడా సంస్థ ప్రస్తావించింది.

ఇదే కీలక వ్యూహం..

మొత్తం వ్యవహారాన్ని చూస్తే ఫెయిర్‌ఫ్యాక్స్ లక్ష్యం కేవలం ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా సాధించడం మాత్రమే కాదు. బ్యాంకింగ్, బీమా, క్యాపిటల్ మార్కెట్ సేవలను కలిపి భారీ ఆర్థిక సేవల సంస్థను నిర్మించాలన్నది దాని వ్యూహం. అయితే ఈ వ్యాపార సమీకరణలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న నిధుల ప్రవాహం గురించే. ఫెయిర్‌ఫ్యాక్స్ తన కంపెనీలను ఐడీబీఐకి బదిలీ చేస్తోంది. వాటిలో కనీసం గో డిజిట్ వాటాల కొనుగోలుకు ఐడీబీఐ మిగులు మూలధనం నుంచి నగదు చెల్లించనున్నట్లు ప్రేమ్ వత్స స్వయంగా చెప్పారు. మరోవైపు, ఆ కంపెనీల బదిలీలను ఐడీబీఐ కొనుగోలు నిధుల సమీకరణలో భాగంగా పీటర్ క్లార్క్ వివరించారు.

అందువల్ల ఈ డీల్‌లో మొత్తం నగదు ఎక్కడి నుంచి వస్తోంది? ఐడీబీఐ తన మూలధనాన్ని ఎంత మేరకు వినియోగిస్తుంది..? ఆ చెల్లింపుల తర్వాత బ్యాంకు మూలధన నిష్పత్తిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..? ఫెయిర్‌ఫ్యాక్స్‌కు లభించే నగదు కొనుగోలు మొత్తంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది..? అనే అంశాలపై పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

ఐడీబీఐని కొనుగోలు చేస్తున్న ఫెయిర్‌ఫ్యాక్స్.. అదే ఐడీబీఐ మిగులు మూలధనాన్ని తన కంపెనీల కొనుగోలుకు వినియోగించుకునే ప్రతిపాదనను ముందుకు తెచ్చిందన్నదే ఈ డీల్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం. చివరకు ఈ ఆర్థిక లావాదేవీలన్నీ ఏ రూపంలో పూర్తవుతాయో, బ్యాంకు ప్రయోజనాలు ఎలా పరిరక్షించబడతాయో తుది ఒప్పందాలు, నియంత్రణ సంస్థల అనుమతుల తర్వాతే స్పష్టమవుతుంది.

Article Souce: BusinessWorld


 

🚨IS FAIRFAX BUYING IDBI WITH IDBI'S OWN MONEY? Buyer is buying the bank. Bank is expected to buy the buyer's businesses. And money from 2nd deal is part of funding plan for the first. Remarkable way to finance bank takeover. Full Stry @BWBusinessworld https://t.co/A0WUi3Nnzn

— Palak Shah (@palakshahjourno) November 2, 2026                    

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News