Success Story: సాధించాలన్న తపన ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ముఖ్యంగా ఆడవాళ్లు తలచుకుంటే.. కొండలైనా పిండి కావాల్సిందే. సాధించాలన్న తపనకు శాస్త్రీయ పరిజ్నానం తోడైతే అద్భుతాలు చేయవచ్చని నిరూపిస్తున్నారు దక్షిణ అండమాన్ లోని వాండూర్ గ్రామానికి చెందిన 38 ఏండ్ల రాజేశ్వరి. కేవలం 5 పెరట్లో పెరిగే కోళ్లతో ప్రారంభమైన ఆమె విజయ ప్రస్థానం.. ఇప్పుడు నెలకు సుమారు రూ.1.91లక్షల నికర లాభాన్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. ఆమె సక్సెస్ స్టోరీ ఇప్పుడు స్థానిక యువతకు.. ఎంతో మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారింది.
వృక్షశాస్త్రంలో ఎం.ఎస్.సి పూర్తి చేసిన రాజేశ్వరి... ఉద్యోగంపై ఆధారపడకుండా స్వయం ఉపాధిని ఎంచుకున్నారు. ఈ క్రమంలో, ఆమె 2023లో శ్రీ విజయపురంలోని ఐసీఏఆర్-సెంట్రల్ ఐలాండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐసీఏఆర్-సీఐఏఆర్ఐ)ని సంప్రదించారు. అక్కడ, ఆమె కోళ్ల పెంపకం, సరైన నివాసం, ఆరోగ్య సంరక్షణ, టీకాలు వేయడం, దాణా తయారీ వంటి అంశాలపై శాస్త్రీయ శిక్షణ పొందారు. ఆ సంస్థ నుండి నిరంతర సాంకేతిక సహాయంతో, ఆమె క్రమంగా తన యూనిట్ను విస్తరించి, కోళ్ల పెంపకాన్ని ఒక పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చారు.
ప్రస్తుతం, ఆమె తన ఫారంలో 2,500 గుడ్ల సామర్థ్యం గల ఒక మినీ-ఇంక్యుబేటర్ను ఏర్పాటు చేశారు. మాంసం కోసం సుమారు 550 తల్లి కోళ్లను (పేరెంటల్ స్టాక్) 1,200 కోడిపిల్లలను పెంచుతున్నారు. ఈ తల్లి కోళ్లు ప్రతి నెలా 3,600 గుడ్లు పెడతాయి. వాటిలో 2,500 గుడ్లను పొదుగుతారు. దీని ఫలితంగా నెలకు 2,000 కోడిపిల్లలు ఉత్పత్తి అవుతాయి, వీటిలో సుమారు 80శాతం పొదుగుతాయి.
ఐసీఏఆర్ (ICAR) నివేదిక ప్రకారం, రాజేశ్వరి ప్రతి నెలా మార్కెట్లో సుమారు 600 కిలోల కోడి మాంసం, 600 కోడిపిల్లలు, 1,100 తినే గుడ్లను అమ్ముతుంది. ఈ సమీకృత విధానం ద్వారా, ఆమె నెలకు రూ. 1.91 లక్షల నికర లాభాన్ని ఆర్జిస్తుంది. ముఖ్యంగా, ఈ వ్యాపారంలో ఆమె పెట్టుబడిపై రాబడి (ప్రయోజన-వ్యయ నిష్పత్తి) 2.02గా ఉంది. ఒకప్పుడు ఇంటి అవసరాల కోసం ఐదు కోళ్లను పెంచిన రాజేశ్వరి, ఇప్పుడు ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.