Women Lead food sector in Bihar: బీహార్ లో మహిళా సాధికారత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు.. ఇప్పుడు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఫుడ్ అండ్ బెరేజెస్ రంగంలో తమ ప్రతిభతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. తోపుడు బళ్లు, చాట్ పకోడా స్టాళ్లు, చిన్న చిన్న దాబాలు వంటి స్ట్రీట్ ఫుడ్ లో చురుగ్గా పాల్గొంటూ స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. తమ కష్టంతో సొంతంగా ఆదాయాన్ని గడిస్తూ కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలుస్తున్నారు. ఆహారాన్ని వ్యాపార రంగానికి సంబంధించి మహిళల ప్రాతినిధ్యంలో బీహార్ ఏకంగా జాతీయ సగటు కంటే ముందు వరుసలో నిలవడం విశేషమని చెప్పాలి.
రాష్ట్రవ్యాప్తంగా ఈ రంగంలోని మొత్తం కార్మికులలో మహిళలు 52 శాతం ఉండగా.. జాతీయ సగటు మహిళల వాటా 41 శాతంగా ఉంది. ఈ విషయంలో బీహార్ రెండో స్థానంలో ఉంది. 2021 నుండి అసంఘటిత రంగ కార్మికులు ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఆహార రంగంలో 18.60 లక్షలకు పైగా కార్మికులు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. వీరిలో, అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో 3.82 లక్షల మంది ఉండగా.. ఆ తర్వాత బీహార్‌లో 1.90 లక్షల మంది కార్మికులు నమోదయ్యారు.
బీహార్ ఆహార రంగంలో యువత భాగస్వామ్యం అత్యధికంగా ఉంది. ఈ రంగంలోని కార్మికులలో 69 శాతం మంది 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల కార్మికులు 18 శాతం ఉన్నారు. 50 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ వ్యాపారంలోనే జీవనోపాధి పొందుతున్నారు, వీరి వాటా 12 శాతానికి పైగా ఉంది.
కాగా బీహార్ లో స్ట్రీ ఫుడ్ బిజినెస్ అనేది ఒక ప్రధాన ఉపాధి వనరుగా ఉంది. ఆహార రంగంలో వీధి ఆహార దుకాణాలు, ధాబాలు, చాట్-పకోరాలు, ఇతర వీధి ఆహార వ్యాపారాలు ఉపాధిలో అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయి. ఈ రంగంలో 4.36 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. బేకరీలలో సుమారు 40,000 మంది, ఆహార ధాన్యాలు, మిల్లింగ్‌లో 16,000 మంది, హోమ్ డెలివరీలో 15,000 మంది ఉపాధి పొందుతున్నారు. 10,000 మందికి పైగా పాల అమ్మకాలు, టీ తయారీలో కూడా నిమగ్నమై ఉన్నారు. సుమారు 10,000 మంది వంట పనిలో నిమగ్నమై ఉండగా, 6,500 మందికి పైగా పండ్ల బండి వ్యాపారంలో ఉపాధి పొందుతున్నారు.
నర్సింగ్ చాయ్‌వాలా ప్రీతి ఝా:
పాట్నాలోని మహేంద్రు ప్రాంతంలో ఒక చిన్న టీ స్టాల్ నడుపుతున్న ప్రీతి ఝా.. ఇప్పుడు సోషల్ మీడియాలో నర్సింగ్ చాయ్‌వాలీగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆమె గుర్తింపు కేవలం టీ అమ్మడానికే పరిమితం కాలేదు.. అది తన కూతురి మంచి భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలనే ఆమె పోరాటానికి, ధైర్యానికి, అభిరుచికి నిదర్శనంగా నిలిచింది. ప్రీతి నర్సింగ్ చదివింది. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలకు తన భర్తతో దూరంగా ఉంటుంది. తన కూతురి బాధ్యత తీసుకుని.. ఆమెకు మంచి భవిష్యత్తును అందించడం కోసం.. ప్రీతి సొంతంగా టీ స్టాల్ ప్రారంభించింది. నేడు.. ఆమె తన కష్టంతో నెలకు రూ. 30,000 వరకు సంపాదిస్తోంది.
ఇద్దరు అక్కాచెల్లెళ్ల స్టార్టప్:
పాట్నాలోని ఎస్.కె. పూరి పార్క్ సమీపంలో 'కుచు-పుచు' పేరుతో సొంతంగా స్టాల్ నడుపుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు యూత్ ను ఆకర్షించారు. ఒక సోదరికి వివాహమైంది.. మరొకరు తన తల్లి అనారోగ్యం కారణంగా కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పాట్నాకు వచ్చారు. రషిక వరుణ్ తివారీ, సప్నా తివారీ అనే ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒక స్టాల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తమ కష్టానికి తగినట్లుగా బాగా సంపాదిస్తున్నారు. కానీ వారి ప్రయాణం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. రోడ్డు పక్కన స్థలం ఏర్పాటు చేసుకోవడం నుండి ఇంటిని చూసుకోవడం వరకు వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఉద్యోగం వదిలి సొంత వ్యాపారం ప్రారంభించడం అంత సులభం కాదని సప్నా చెబుతున్నారు. సొంత వ్యాపారం ప్రారంభించడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని.. కానీ చివరికి మంచి సంపాదనతో వ్యాపారంలో నిలదొక్కుకున్నట్లు చెబుతున్నారు.