తొలిసారి చారిత్రక చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న అర్జున్.. అయోధ్యలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం..
Action King Arjun Direction: భారత్‌లో ఏ హీరోకు లేనట్టుగా యాక్షన్ కింగ్ అనే బిరుదున్న ఏకైక హీరో అర్జున్. యాక్షన్ కింగ్‌గా మాస్, క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అంతేకాదు తనదైన నటనతో పాటు దర్శకుడిగా మెప్పించారు. ఇప్పటికే పలు చిత్రాలను డైరెక్ట్ చేసిన ఈయన.. తాజాగా మరో సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అందులో కొత్త ఏమి ఉందన్నారు. కానీ ఈ సారి చారిత్రక నేపథ్యమున్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Arjun Historical Movie Direction: తనదైన నటన, అద్భుతమైన యాక్షన్ పాత్రలతో హీరోగా అలరించారు. కేవలం మాతృ భాష కన్నడలో కాకుండా తమిళం, తెలుగులో టాప్ కథానాయకుడిగా సత్తా చాటారు. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఈయన దర్వకత్వంలో తెరకెక్కి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అనూప్ మోహన్ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో దేశభక్తి సినిమాకు రాబబోతుంది. ప్రెస్టీజియస్ మూవీ రేపు నవంబర్ 27న అంటే శ్రీరామ జన్మభూమి అయోధ్యలో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అదే రోజున టైటిల్ ప్రకటించనున్నారు.
అన్‌కాంప్రమైజ్డ్‌గా భారీ ప్రాజెక్ట్..
అన్‌కాంప్రమైజ్డ్‌గా రూపొందనున్న ఈ దేశభక్తి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో విడుదల చేయటానికి మేకర్స్ అన్ని సన్నాహాలు మొదలు పెట్టారు. శ్రీరామ జన్మభూమి అయోధ్య ఆలయంలో సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా ఈ వేడుక నిలవనుందని టీమ్ వెల్లడించింది. అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో పాటు దర్శకత్వ బాధ్యతలను చేపట్టనున్నారు.
ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్..
బాలీవుడ్‌తో పాటు వివిధ ప్రాంతీయ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగస్వాములగా ఈ చిత్రం రూపొందనుంది. భారతీయ చలనచిత్ర రంగంలోని పలువురు ప్రముఖులతో కూడిన భారీ పాన్ ఇండియా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రానుంది. అనూప్ మోహన్ నిర్మించనున్న ఈ చిత్రానికి జోస్ ఎం. థామస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం.
బలమైన కథాంశం..
బలమైన కథాంశం, ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించనున్నట్టు తెలిపారు. దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగం, భారతదేశ గొప్పతనాన్ని తెలిపేలా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నారు. ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రూపొందనున్న మూడవ ప్రెస్టీజియస్ చిత్రమిది. గతంలో అర్జున్ తెరకెక్కించిన ‘జై హింద్’ మూవీ కూడా ఇదే దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కడం విశేషం. ఆ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీలో మంచి విజయం సాధించిన తెలిసిందే కదా.