‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. కొత్త ప్రయోగం ఎలా ఉందంటే..!!
Chandrayan Movie Review: తెలుగులో గత కొన్నేళ్లుగా రొటీన్ సినిమాలతో పాటు డిఫరెంట్ నేపథ్యంలో పలువురు ఔత్సాహిక దర్శకులు పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన భిన్న చిత్రమే ‘చంద్రయాన్’. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు అందుకుందో చూద్దాం.
Chandrayan Review: తెలుగులో ‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా వేణు ఊడుగుల తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ కోవలో ఆయన సమర్పకుడిగా తెరకెక్కిన చిత్రం ‘చంద్రయాన్’. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం.
కథ విషయానికొస్తే..
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన నలుగురు పోరలు చంద్రుడిపై వెళ్లాలనే ఎవరికీ సాధ్యం కానీ కల కంటారు. గ్రామీణ నేపథ్యంలో పెద్దగా సైన్స్ , సాంకేతిక నైపుణ్యం పై అవగాహన లేని ఈ నలుగురు దోస్తులు కలిసి సొంతంగా ఒక రాకెట్ తయారు చేయాలనుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో వాడే కుక్కర్లు, పాడైపోయిన బైక్ టైర్లు వంటి వాటితో ప్రయోగానికి రెడీ అవుతారు. ఈ క్రమంలో చంద్రయాన్ అంటూ చంద్రుడిపై ప్రయాణం చేయాలనుకునే వారి కల ఫలించిందా.. ? ఈ క్రమంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో గ్రామంలో చోటు చేసుకునే పరిణామాలేమిటనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
శ్రీనాథ్ చంద్రశేఖర్ అనే దర్శకుడు చెప్పిన పాయింట్ వేణు ఊడుగుల ఎక్కడ నచ్చిందో తెలియదు కాదు.. గ్రామీణ యువకులు చంద్రుడిపై వెళ్లాలనుకోవడం.. ఈ క్రమంలో సైన్స్, భౌతిక శాస్త్రాలపై పెద్దగా అవగాహన లేని నలుగురు యువకులు చంద్రుడిపై రాకెట్ ప్రయోగానికి సిద్ధపడటం వంటి సీన్స్ బాగానే ఉన్న లాజిక్‌కు అందవు. అసలు చంద్రుడిపై అమెరికా, చైనా, భారత్ మాత్రమే వెళ్లాయి. అమెరికా మనుషులో వెళితే.. మన వాళ్లు శాటిలైట్స్ పంపించి అక్కడ పరిశోధనలు చేశారు. ఒక రాకెట్ పంపించాలంటే ఎన్నో ఏళ్ల శ్రమ, శాస్త్రవేత్తల మేథో మథనంతో పాటు దానికి తగ్గ ఎక్విప్‌మెంట్ లాంటివి ప్రభుత్వ సహకారం ఉంటే కానీ సాధ్యం కావు. అలాంటి వాటిని నలుగురు యువకులు, మన రోజు వారి ఇంట్లో ఉపయోగించే టైర్లు, ట్యూబ్లు, కుక్కర్ల వంటి వాటితో రాకెట్ ప్రయోగానికి సిద్ద పడటం వంటివి సిల్లీగా అనిపిస్తాయి.
చంద్రయాన్ కథలో చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా.. దాన్ని తెరకెక్కించే విధానంలో తడబడ్డాడు దర్శకుడు. కామెడీతో సాగాల్సిన సినిమా సెకండాఫ్‌లో తేలిపోయింది. ఈ సినిమాను మరింత ఇంపాక్ట్‌గా చెబితే బాగుండేది. ఈ సినిమా కోసం ఎంచుకున్న గ్రామీణ నేపథ్యం, నటీనటుల సెలెక్షన్ , గ్రామాల్లో ప్రజల అమాయకత్వం సహజ సిద్ధంగా ఉన్నాయి. విజువల్ పరంగా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మొత్తంగా వేణు ఊడుగుల సహా ఇతరులు ఈ సినిమాపై ఎఫర్ట్ పెట్టినా.. అది పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. స్క్రీన్ ప్లే ఇంకాస్త బలంగా రాసుకుంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
నటీనటుల విషయానికొస్తే..
శివకుమార్ ధీకొండ అతని స్నేహితులుగా నటించే వాళ్లు ఫస్టాఫ్‌లో రాకెట్ ప్రయోగం కోసం చేసే పనులు నవ్వులు తెప్పిస్తాయి. వాళ్లు సహజ సిద్దంగా అమాయకులైన గ్రామీణ యువకుల పాత్రల్లో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. లాంఛ్ పాడ్ లేని ‘చంద్రయాన్’..
రేటింగ్: 2.5/5