Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?
Zayn Marie Khan CJP Protest Injury: ముంబైలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖ నటులు ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్, ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది గంటల కస్టడీ అనంతరం వాళ్లను విడుదల చేసినా.. జైన్ మేరీ తన శరీరంపై ఉన్న గాయాల గుర్తులను సోషల్ మీడియాలో చూపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Zayn Marie Khan CJP Protest Injury: శనివారం ఉదయం ముంబైలో జరిగిన సీజేపీ నిరసనల సందర్భంగా పోలీసులు జైన్ మేరీ, ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వ్యాన్ లోపలి నుంచి జైన్ ఒక ఫోటోను పంచుకోగా, అందులో ఇమ్రాన్ ఖాన్ చిరునవ్వుతో శాంతి చిహ్నాన్ని చూపిస్తూ కనిపించారు. ఆ ఫోటోకు "ఇంక్విలాబ్ జిందాబాద్" అని ఆమె రాశారు.
అంతేకాకుండా, వ్యాన్ లోపల జైన్ ఒక సరదా వీడియోను కూడా రికార్డ్ చేశారు. అందులో ఇమ్రాన్ ఖాన్‌ను 'ఎప్పుడైనా జైలుకు వెళ్లారా?' అని అడగ్గా, 'ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వెళ్లే అవకాశం కనిపిస్తోంది' అని ఇమ్రాన్ సరదాగా సమాధానమిచ్చారు.
గాయాలను చూపిస్తూ సోషల్ మీడియాలో ఆగ్రహం..
పోలీసుల కస్టడీ నుంచి విడుదలైన కొద్ది గంటలకే జైన్ మేరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో తన చేతులు, వేళ్లు, కాళ్లపై ఏర్పడిన గాయాల మచ్చలను కెమెరాకు చూపిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. "మాలోని భయం పోయేంత వరకు మమ్మల్ని ఇంకెంతగా భయపెట్టడానికి ప్రయత్నిస్తారు?" అని ఆమె పోలీసులను, అధికారులను ప్రశ్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది
మరోవైపు నటి లేఖా వాషింగ్టన్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పంచుకున్నారు. పోలీసులు తమను కార్లలో లేదా ఇతర వాహనాల్లో ఇంటికి వెళ్లనివ్వకుండా వీధుల్లో తిప్పుతున్నారని ఆమె మొదట ఆరోపించారు. అయితే, తదుపరి వీడియోలో తామందరం సురక్షితంగా ఉన్నామని, ఇళ్లకు బయలుదేరుతున్నామని ఆమె స్పష్టం చేశారు.
నిరసన చేపట్టడానికి కారణం ఏమిటి?
ఈ ఆందోళనా కార్యక్రమానికి సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) నాయకత్వం వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని సీజేపీ ఆరోపించింది.
అర్హులైన అనేకమంది ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని, ఇది ఎన్నికల నిష్పక్షపాతాన్ని దెబ్బతీస్తుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. పొరపాటున పేర్లు తొలగిస్తే ఉంటే అర్హులైన ఓటర్లు మళ్లీ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.