Iran Consulate Shares Baahubali Video: అంతర్జాతీయ వేదికలపై అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఒక ఆసక్తికరమైన దౌత్య మార్గాన్ని ఎంచుకుంది. ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA) సమావేశంలో ఇరాన్ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆంక్షలు, తీవ్రమైన ఒత్తిళ్లు, బెదిరింపు ధోరణులకు తమ దేశం ఎప్పటికీ లొంగదని, ఎవరి ముందూ మోకరిల్లదని ఆయన తేల్చి చెప్పారు.
ఈ ప్రసంగం తర్వాత హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓ పవర్‌ఫుల్ వీడియోను షేర్ చేసింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 2015లో విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాలోని అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కాలకేయ సైన్యంతో వీరోచితంగా పోరాడే దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియోతో పాటు ఓ క్యాప్షన్ ఈ విధంగా రాసుకొచ్చారు.
"మా అధ్యక్షుడు పెజెష్కియన్ స్పష్టం చేసినట్లుగా మేము ఎవరికీ తలవంచము. బాహుబలి కాలకేయులను ఎదిరించి పోరాడినట్లే, మా మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగానికైనా లేదా రక్తం చిందించడానికైనా సిద్ధంగా ఉన్నాం" అని హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ ఈ ఆసక్తికర పోస్టును షేర్ చేసింది.
Dr. Pezeshkian, President of I.R #Iran at UNGA: "Will never bow our head or bend the knee" Like Baahubali standing against the Kalakeyas, we also shed our own blood in sacrifice for the homeland. https://t.co/xc1S9H346Q
— Iran In Hyderabad (@IraninHyderabad) September 27, 2026
అయితే ఇరాన్ దౌత్యకార్యాలయాలు తెలుగు చిత్రాలను ఇలా హెచ్చరికల కోసం ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' చిత్రంలోని ఒక యాక్షన్ సన్నివేశాన్ని షేర్ చేస్తూ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నట్లు వీడియో పోస్ట్ చేసింది.
కొద్దిరోజుల క్రితం ఈ పోస్టు సోషల్ మీడియాలో ఇరాన్ దౌత్యకార్యాలయం పోస్ట్ చేసిన నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి' తెగ వైరల్ కాగా.. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియా నెటిజన్ల నుండి విభిన్న రీతుల్లో స్పందనలు వ్యక్తమయ్యాయి. ఇరాన్‌కు భారతీయ చిత్రాలపై ఉన్న అభిమానాన్ని కొందరు ప్రశంసించగా.. మరికొందరు అసలు తెలుగు ఆడియోను ఉపయోగించాల్సిందని లేదా సినిమా కథాంశాలను ఉటంకిస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వేదికపై తమ రక్షణ వైఖరిని తెలియజేయడానికి తెలుగు సినిమాలలోని యాక్షన్ ఘట్టాలను సాధనంగా ఇరాన్ దౌత్యకార్యాలయాలు మార్చుకోవడం అంతర్జాతీయంగా విశేష దృష్టిని ఆకర్షించింది.