Smallest People In Iran: కథల్లో, సినిమాల్లో మాత్రమే చూసే మరుగుజ్జుల గ్రామం నిజంగానే ఈ భూమిపై ఉందా? అవుననే అంటున్నాయి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు.. ఇళ్లలోకి వెళ్లాలంటే తల దించి.. మోకాళ్లపై పాకుతూ వెళ్లాల్సిన విచిత్రమైన గ్రామం ఇరాన్‌లో ఉంది.. అక్కడ నివసించే మనుషుల ఎత్తు 3 అడుగులే.. వారి ఇళ్ల గుమ్మాలు కూడా అంతే పరిమాణంలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే, ఈ గ్రామానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భారతదేశానికి సంబంధించిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఆశిష్ ఇటీవల ఇరాన్‌లోని మాఖూనిక్ అనే పురాతన గ్రామాన్ని సందర్శించారు.. ఆయన అక్కడ రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.. వీడియోలో ఆశిష్.. అతని ఫ్రెండ్.. ఆ మట్టి ఇళ్లలోకి వెళ్లేందుకు నడుము వంచి.. మోకాళ్లపై లోపలికి వెళ్లడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. సాధారణ ఎత్తు ఉన్న వ్యక్తులు లోపల నిలబడటం కూడా అక్కడ కష్టమే..
దక్షిణ ఖొరాసన్ ప్రాంతంలో.. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ మాఖూనిక్ గ్రామానికి సుమారు 1,500 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఇక్కడి ప్రజలు ఇంత తక్కువ ఎత్తుతో ఉండటానికి ప్రధానంగా చారిత్రక, భౌగోళిక కారణాలు ఉన్నాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
దశాబ్దాల తరబడి ఈ ప్రాంతం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటంతో ప్రజలు పోషకాహార లోపంతో బాధడపడుతున్నారట.. వీరి ప్రధాన ఆహారం ముల్లంగి వంటి దుంపలతో పాటు బార్లీ, ఖర్జూరాలు మాత్రమేనట.. గ్రామం బయటి వారితో సంబంధాలు లేకపోవడంతో తరతరాలుగా తమలోనే పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల జన్యుపరమైన మార్పులు జరిగి ప్రజల ఎత్తు పెరగలేకుండా.. అలాగే ఉండిపోయారని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు.
అలాగే అక్కడ విపరీతమైన చలితో సాటే వేడి నుంచి రక్షణ పొందడానికి.. ఇళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి పూర్వీకులు 3 నుంచి 3.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉండే తలుపులు, చిన్న గదులతో కూడిన మట్టి ఇళ్లను నిర్మించారట..ప్రస్తుతం ఈ గ్రామంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. రవాణా మార్గాలతో పాటు మంచి ఆహారం, వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ఇప్పటి తరం సాధారణ ఎత్తుతోనే పెరుగుతోందని సమాచారం..