Sonia Gandhi : 1999లో శరద్ పవార్, పి.ఎ. సంగ్మా, ఉమాభారతి, సుష్మాస్వరాజ్ వంటి నేతలు సోనియా గాంధీ విదేశీ మూలాలను తెరపైకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటలీ పౌరసత్త్వం భారతదేశంలో ఉన్నత పదవులను చేపట్టకూడదన్న నిబంధనతో మనసు తీవ్రంగా కలచివేసిందని సోనియా బాధపడ్డారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని భావించినప్పటికీ, పార్టీ శ్రేణుల కోసమే బాధ్యత తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలని ఆకాంక్షించారని సోనియా గాంధీ తన ఆత్మ కథలో వెల్లడించారు.
ప్రణబ్ నాయకత్వ మార్పు..
2010 సమయంలో ప్రణబ్ తనతో ప్రత్యేకంగా నాయకత్వ మార్పు గురించి మాట్లాడిన సందర్భాలను ఆమె గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు వెనకుండి రిమోట్ కంట్రోల్ అధికారం చెలాయించారనే ఆరోపణలను సోనియా గాంధీ పూర్తిగా ఖండించారు. మన్మోహన్ సింగ్ పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపారని, కేవలం పార్టీ బాధ్యతలను మాత్రమే తాను చూసుకున్నానని సోనియాగాంధీ ఆత్మకథలో చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఫైళ్లను తాను పరిశీలించాననేది అవాస్తవమని సోనియాగాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కడా జోక్యం చేసుకోలేదని అభిప్రాయం వ్యక్తంచేశారు.
అనూహ్యంగా రాజకీయాలకు సోనియా గాంధీ..
ప్రజా జీవితానికి దూరంగా ఉన్న తాను అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చినట్టు సోనియా ఈ ఆత్మకథలో తెలిపారన్నారు. కొన్ని సంఘటనలు, నష్టాలు, కుటుంబ పరిస్థితులు తనను రాజకీయాల్లోకి లాగాయని సోనియా ఈ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని తన వ్యక్తిగత విషయాలు, మనో వేదనలను సోనియా ఈ పుస్తకంలో పంచుకున్నారు. సోనియా గాంధీ తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాలను ఆత్మకథలో వెల్లడించారు. రెండు సమయాల్లో క్యాన్సర్ ను జయించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
రెండు సార్లు క్యాన్సర్ ను జయించిన సోనియా గాంధీ..
ప్రజా జీవితంలో ఎంత ఉన్నప్పటికీ, అనారోగ్యం, చికిత్స వంటి వ్యక్తిగత విషయాలలో స్వేచ్ఛ, గోప్యత చాలా అవసరమని, అందుకే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు సోనియా స్పష్టం చేశారు. ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లే ముందు కొడుకు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా తనకు మానసికంగా ఎంతో ధైర్యం చెప్పారన్నారు. , ఆ క్లిష్ట సమయంలో వారే కొండంత అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. 2010లో తనకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు సోనియా వెల్లడించారు. మీడియా దృష్టి నుంచి తప్పించుకుని వ్యక్తిగత గోప్యతను కాపాడుకునేందుకు ఇటలీలోని మిలాన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నానని వెల్లడించారు. మొదటి శస్త్రచికిత్స జరిగిన ఏడాదికే ప్యాంక్రియాస్‌లో మరో గడ్డను గుర్తించడంతో, నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో రెండో ఆపరేషన్ చేయించుకున్నట్లు సోనియా గాంధీ ఆత్మకథలో రాసుకొచ్చారు.