SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

US Voting System: అమెరికాలో ఎన్నికలు ఎలా జరుగుతాయంటే..! అగ్రరాజ్యంలో ఓటింగ్ విధానంపై విశ్లేషణ

US Midterm Elections 2026: భారత్‌లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుండగా.. అయితే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లతోనే ఓటింగ్ జరుగుతోంది. అసలు అక్కడ ఓటింగ్ ఎలా ఉంటుంది..? ఎర్లీ ఓటింగ్ అంటే ఏమిటి..? భారత్, అమెరికా ఎన్నికల విధానాల మధ్య తేడాలేంటో ఇక్కడ తెలుసుకోండి.

Written By Ashok Krindinti
Published: Nov 04, 2026, 07:16 PM IST | Updated: Nov 04, 2026, 07:21 PM IST
Image Credit: America Election Process (Source: AI Generated)
Join

US Midterm Elections 2026: భారత్‌లో ఎన్నికలు అనగానే మనకు గుర్తొచ్చేది ఈవీఎంలు.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి బటన్ నొక్కి ఓటు వేయడం మనకు అలవాటు.. కానీ ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలో ఎన్నికల విధానం మాత్రం మన దేశానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఆధునిక సాంకేతికతలో దూసుకెళ్తున్న అమెరికా.. ఓటింగ్ ప్రక్రియలో మాత్రం ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కాగితపు బ్యాలెట్ పద్ధతినే ఉపయోగిస్తోంది. అసలు అమెరికాలో ఓటు ఎలా వేస్తారు..? అక్కడ ఈవీఎంలు లేవా..? భారత్‌‌తో పోలిస్తే ఏయే అంశాల్లో తేడాలున్నాయి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ జరుగుతుంది. ముందుగా ప్రకటించిన నిర్ణీత తేదీల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే అమెరికాలో మాత్రం దీనికి భిన్నమైన విధానం అమల్లో ఉంది. అక్కడ ప్రధాన పోలింగ్ తేదీకి కొన్ని వారాల ముందే ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీనినే ఎర్లీ ఓటింగ్ అంటారు. ఈ విధానంలో ఓటర్లు ముందుగానే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయవచ్చు. అంతేకాకుండా మెయిల్ ఇన్ బ్యాలెట్ ద్వారా పోస్టు సహాయంతో కూడా తమ ఓటును నమోదు చేయవచ్చు. ఉద్యోగాలు, ప్రయాణాలు, ఇతర కారణాలతో పోలింగ్ రోజున ఓటు వేయలేని వారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. భారత్‌లోని పోస్టల్ బ్యాలెట్ విధానంతో దీనికి కొంత పోలిక ఉంటుంది.

నిబంధనలను బట్టి ఓటింగ్..

టెక్నాలజీలో దూసుకుపోతున్న అగ్రరాజ్యంలో ఎన్నికల సమయంలో మాత్రం కాగితపు బ్యాలెట్ల వినియోగం ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన ఓటింగ్ విధానంలో జరగదు. రాష్ట్రాల ఎన్నికల నిబంధనలను బట్టి ఓటింగ్ పద్ధతులు మారుతుంటాయి. కొలరాడో, ఒరెగాన్, వాషింగ్టన్ వంటి రాష్ట్రాల్లో కాగితపు బ్యాలెట్ల ఆధారంగానే ఓటింగ్ నిర్వహిస్తారు. ఓటర్లు బ్యాలెట్ పేపర్‌పై తమకు నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేసి ఓటు వేస్తారు. అనంతరం ఆ బ్యాలెట్లను లెక్కింపు ప్రక్రియకు పంపిస్తారు.

అమెరికాలో పూర్తిగా బ్యాలెట్ పేపర్లే ఉపయోగించరు. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు కూడా వినియోగిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కాగితపు బ్యాలెట్, ఎలక్ట్రానిక్ విధానాలకు సంబంధించిన సౌకర్యాలు రెండూ అందుబాటులో ఉంటాయి. డెలావేర్, జార్జియా వంటి రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానానికి ప్రాధాన్యం ఉంది. అయితే రాష్ట్రాలవారీగా ఎన్నికల నిర్వహణలో మార్పులు ఉండటంతో దేశవ్యాప్తంగా ఒకే విధమైన పద్ధతిని అనుసరించడం లేదు.

సాంకేతిక సమస్యలు తలెత్తినా..

అమెరికాలో కాగితపు బ్యాలెట్ల వినియోగానికి ప్రధాన కారణాల్లో ఎన్నికల పారదర్శకత, ఓట్లను తిరిగి చెక్ చేసే అవకాశం ముఖ్యమైనవి. ఎలక్ట్రానిక్ పరికరాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినా.. ఓట్ల లెక్కింపుపై సందేహాలు వచ్చినా కాగితపు రికార్డుల ద్వారా మరోసారి పరిశీలించవచ్చు. ముఖ్యంగా ఓటు వేసినట్లు భౌతిక ఆధారం ఉంటుంది. దీంతో ఎన్నికల ఫలితాలను ఆడిట్ చేయడం ఈజీ అవుతుంది. సైబర్ దాడులు, సాఫ్ట్‌వేర్ సమస్యలపై ఆందోళనలు ఉన్న నేపథ్యంలో కాగితపు బ్యాలెట్లకు అమెరికా ప్రాధాన్యం ఇస్తోంది.

అప్పుడు కీలక మలుపు

అమెరికా ఎన్నికల చరిత్రలో 2000 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలు కీలక మలుపుగా నిలిచాయి. ఆ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు విషయంలో తీవ్ర వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఫ్లోరిడాలో ఓట్ల లెక్కింపుపై వచ్చిన అభ్యంతరాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల తర్వాత ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు అమెరికా ప్రభుత్వం సుమారు 3 బిలియన్ డాలర్ల నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలు డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కొనుగోలు చేశాయి. ఎన్నికల ప్రక్రియను మరింత ఆధునికంగా, సులభంగా మార్చాలన్నది అప్పటి లక్ష్యం.

అయితే కొత్త యంత్రాల రాకతో అన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంపై కొందరు ఓటర్లలో అనుమానాలు పెరిగాయి. యంత్రాల్లో సాంకేతిక లోపాలు తలెత్తితే లేదా ఓట్ల వివరాల్లో మార్పులు జరిగితే వాటిని ఎలా నిర్ధారించాలనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో భౌతిక ఆధారం ఉండడంతో అనుమానాలకు తావులేకుండా పోయింది. కానీ కేవలం మెషీన్‌లోని సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడితే.. ఏదైనా టెక్నీకల్ ఇష్యూ వచ్చినప్పుడు అసలు ఓట్లను స్వతంత్రంగా ధ్రువీకరించడం కష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అందుకే ఎన్నికల ప్రక్రియలో పేపర్ రికార్డులకు ప్రాధాన్యం పెరిగింది. ఓట్ల లెక్కింపులో తేడాలు వచ్చినప్పుడు వాటిని తిరిగి పరిశీలించేందుకు కాగితపు ఆధారాలు ఉపయోగపడతాయి.

భారత్‌లో ఎన్నికల నిర్వహణను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. దేశవ్యాప్తంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో కూడిన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. అమెరికాలో మాత్రం రాష్ట్రాలవారీగా ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ పద్ధతుల్లో మార్పులు ఉంటాయి. మన దేశంలో నిర్ణీత పోలింగ్ తేదీల్లోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి మాత్రం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం ముందస్తు ఓటింగ్, మెయిల్ బ్యాలెట్ వంటి అవకాశాలు కూడా ఉన్నాయి. భారత్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ప్రాధాన్యం ఉంటే.. అమెరికాలో అనేక ప్రాంతాల్లో కాగితపు బ్యాలెట్ల వినియోగం కొనసాగుతోంది. మొత్తానికి ఆధునిక సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. ఎన్నికల విషయంలో ప్రజల నమ్మకం, పారదర్శకత, ఓట్లను తిరిగి ధ్రువీకరించుకునే అవకాశం అత్యంత కీలకమని అమెరికా ఎన్నికల విధానం తెలియజేస్తోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES