Diwali Firecrackers: కుటుంబాల్లో చీకట్లు నింపిన దీపావళి.. 23 మంది మృతి
23 Lives End In Diwali Celebrations: వెలుగులు నింపే దీపావళి పండుగ కొన్ని కుటుంబాల్లో మాత్రం చీకట్లు నింపింది. సరదాగా.. ఆనందంగా చేసుకోవాల్సిన దీపావళి పండుగ తీవ్ర విషాదంలో ముంచింది. దేశంలో జరిగిన వేర్వేరు చోట్ల ప్రమాదాలు సంభవించి దాదాపు 23 మందికి పైగా చనిపోయారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Diwali Fire Accidents: వెలుగులు విరిజిమ్మే దీపావళి పండగ తీవ్ర విషాదాన్ని నింపింది. దీపావళి పండుగ కొన్ని కుటుంబాల్లో చీకట్లోకి నెట్టింది. దీపావళి పండుగను ఆనందంగా చేసుకుంటుండగా దేశంలో పలు చోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదాల్లో దాదాపు 23 మందికి పైగా చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో రెండు ఇళ్లల్లో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించి 12 మంది చనిపోయారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఓ కారు మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఇక తెలంగాణ, ఏపీలో కూడా పలుచోట్ల ప్రమాదాలు సంభవించాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. కానీ పెద్ద ఎత్తున తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని సివానీ జిల్లాలో నగల వ్యాపారి కుందన్‌లాల్ సోనికి చెందిన భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగగా కుటుంబసభ్యులు అందరూ అందులో చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను నియంత్రించే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత పరిశీలించగా ఆరుగురు మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఇంట్లో 10 మంది ఉండగా కుందన్‌లాల్, ఆయన భార్యతోపాటు పిల్లలు సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం సంభవించడానికి కారణాలు ఏమిటనేది తెలియరాలేదు.
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో మరో సంఘటన ఇలాంటిదే చోటుచేసుకుంది. దుకాణం నిర్వహిస్తున్న భవంతిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించగా నిద్రలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించడంతో ఆ కుటుంబం దుఃఖసంద్రంలో మునిగింది. అగ్నిప్రమాదంలో జరిగిన భవనంలో ఒక అంతస్తులో పూరన్ అగర్వాల్ బాణసంచా దుకాణం నిర్వహిస్తుండగా అగ్నిప్రమాదంలో ఆ దుకాణంలో మంటలు తీవ్రస్థాయిలో పెరిగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదంలో రెండు నెలల పసిబాలుడు కూడా సజీవదహనం కావడం కలచివేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఓ కుటుంబం దుర్మరణం పాలయ్యింది. హరియాణాలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం హరిద్వార్‌కు బయల్దేరగా తెల్లవారుజామున మార్గమధ్యలో శామ్లీ హైవే వద్ద వీరి కారు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు కారు మొత్తం వ్యాపించడంతో ఆరుగురు కుటుంబసభ్యులు ఆ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.
కంటికి గాయాలు
దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడంతో పెద్ద ఎత్తున గాయపడ్డారు. కంటికి గాయాలైన బాధితులు ఒక్కొక్కరిగా హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి భారీగా తరలివచ్చారు. ఇప్పటివరకు దాదాపు 100 మందికి ఔట్ పేషెంట్లు రాగా.. 12 మందిని ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్ చేశారు. గతేడాది దీపావళి సందర్భంగా వారం రోజుల్లో 116 మంది బాధితులు రాగా.. ఈసారి ఇప్పటికే వంద మంది వచ్చారు. వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉంటే మరి కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.