SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

విజయ్ వచ్చినా మారని పరిస్థితి.. మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక మహాదీపం ఉత్కంఠ..

Tirupparankundram Deepam: వివాదస్పదంగా మారిన'తిరుప్పరంకుండ్రం'పై దీపం వెలుగుతుందా? మదురైలోని తిరుప్పరం కుండ్రం కొండపై ఇవాళ పవిత్ర కార్తీక దీపం వెలిగించనున్న నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ ప్రకటించారు. ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, సమావేశాలపై నిషేధం విధించారు. మరోవైపు దీపం వెలిగించకుండా ఆదేశాలివ్వాలని విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అడ్డంకులు లేకపోతే సాయంత్రం 6 గంటల తర్వాత దీపం వెలగనుంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 24, 2026, 10:42 IST | Updated: Nov 24, 2026, 10:57 IST
Image Credit: Madhurai Deepam Controversy (Source/ZEE News)
Join

Karthika Deepam: తమిళనాడులోని మదురైలో కార్తీక మహాదీపంపై ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. కొంత మంది కావాలనే కొండపై దీపం వెలిగించడాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే అంశం ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది. ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు పోలీసులు ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించి భారీగా బలగాలను మోహరించారు. అసలు తిరుప్పరంకుండ్రం కొండపై ఏం జరుగుతోంది? ఇవాళ సాయంత్రం మహాదీపం వెలుగుతుందా? లేక వివాదం మరింత ముదురుతుందా? అనేదానిపై టెన్షన్ వాతావరణం నెలకొంది.

తమిళనాడు మదురై జిల్లాలోని సుప్రసిద్ధ తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక మహాదీపం వెలిగించే అంశం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. కొండపై ఉన్న దీపస్తంభం వద్ద పవిత్ర దీపాన్ని వెలిగించేందుకు హిందూ సంఘాలు, భక్తులు సిద్ధమవుతుండగా.. ఈ వ్యవహారం శాంతిభద్రతల సమస్యగా మారింది. సాయంత్రం 6 గంటల తర్వాత మహాదీపం వెలిగించాల్సి ఉండటంతో మదురై వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.విజయ్ సర్కార్.. సుప్రీంకోర్టను ఆశ్రయించడాన్ని హిందూ సంఘాలు తప్పుపడుతున్నాయి. డీఎంకే తరహాలోనే విజయ్ కూడా ఓ వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తుందని చెప్పుకొచ్చారు.

జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలపై నిషేధం..

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తరహా ఆంక్షలు విధిస్తూ.. ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సమావేశాలపై పూర్తిస్థాయి నిషేధం అమలు చేస్తున్నారు. కొండపైకి వెళ్లే ప్రతి మార్గంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, భారీగా పోలీసు బలగాలను మోహరించారు.అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం కొండపై ఉన్న భిన్న మత ప్రార్థనా స్థలాలు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కొండపై శిఖరాగ్రంలో సికందర్ బాదుషా దర్గా ఉంది. దర్గాకు సమీపంలోని రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంఘాలు పట్టుబడుతుండగా.. ఇది మత సామరస్యానికి భంగం కలిగిస్తుందని, అక్కడ దీపం వెలిగించే సంప్రదాయం లేదని మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో ఏటా కార్తీక మాసంలో ఈ అంశం వివాదాస్పదమవుతోంది.

కొండ పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన పోలీసులు..

మరోవైపు ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు గడప తొక్కింది. కొండపై దీపం వెలిగించేందుకు అనుమతి నిరాకరించాలన్నారు.  గతంలో ఉన్న యథాతథ స్థితిని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపైనే అందరి దృష్టి నిలిచింది. కోర్టు ఆదేశాలను బట్టే సాయంత్రం దీపం వెలిగించాలా వద్దా అనే దానిపై స్పష్టత రానుంది.

ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లోనూ కాకరేపుతోంది. భక్తుల మనోభావాలను గౌరవించి దీపం వెలిగించేందుకు ప్రభుత్వం సహకరించాలని ప్రతిపక్షాలు, హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే తమకు ముఖ్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ మత ఘర్షణలకు తావివ్వబోమని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది.

సాయంత్రం 6 గంటల తర్వాత మహాదీపం వెలిగే అవకాశం..

ఉద్రిక్తతల నడుమ కొండ దిగువన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ దర్శనం చేసుకుంటున్నప్పటికీ, కొండపైకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మొత్తానికి మదురై తిరుప్పరంకుండ్రం కొండపై మహాదీపం వెలుగుతుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సాయంత్రం 6 గంటల లోపు సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి అడ్డంకులు రాకపోతే, కట్టుదిట్టమైన భద్రత నడుమ దీపం వెలిగే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు స్టే విధిస్తే మాత్రం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపు చేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారనుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES