ప్రధాని మోడీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు.. దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు..
AICC President Kharge: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi)ని ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikharjuna Kharge)చేసిన అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలకు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
Congress Vs BJP: ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపాయి. బిహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ 139వ జయంతిని పురస్కరించుకుని బిహార్ రాష్ట్ర రాజధాని పట్నాలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో అక్రమాలకు పాల్పడిన వారందరినీ కాంగ్రెస్ జైలుకు పంపిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెంటనే సభలో ఉన్న ఓ వ్యక్తి స్పందిస్తూ.. తిరుగుబాటు లేనంత కాలం ప్రధాని మోడీ ఎక్కడికీ వెళ్లరు అని గట్టిగా అరిచారు. అందుకు ఖర్గే.. మోదీ తండ్రి కూడా పోతారు అని గట్టిగా బదులిచ్చారు. ఆయన వ్యాఖ్యపై బీజేపీతో పాటు ఎన్డీయే కూటమిలోని జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ ఆవామ్ మోర్చా వంటి పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్య కాంగ్రెస్ సైద్ధాంతిక దివాలా కోరుతనానికి అద్దం పడుతోందని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. దివంగతులైన కుటుంబ సభ్యులను బహిరంగ వేదికలపై ప్రసంగాల్లోకి లాగడం రాహుల్‌తో పాటు యావత్ ప్రతిపక్ష నేతల సంస్కృతిలా మారిపోయిందన్నారు. ఒకప్పుడు గూండాలు మాట్లాడిన భాషను నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. వారు పూర్తిగా మాఫియా తరహాలో పని చేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకెంత మాత్రమూ రాజకీయ పార్టీ కాదు.. అదొక మాఫియా ముఠాలా కనిపిస్తోంది అని నబీన్ తన ఎక్స్‌లో ఖాతాలో విరుచుకుపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తండ్రి గురించి అనుచిత వ్యాఖ్య చేయడం ద్వారా.. మర్యాదకు సంబంధించిన అన్ని ప్రమాణాలను ఖర్గే తుంగలోకి తొక్కారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. మోడీపై , ఆయన కుటుంబంపై కాంగ్రెస్ అసభ్యకర భాష ఉపయోగించడం ఇదే ఫష్ట్ టైమ్ కాదు. ప్రధాని తల్లిని అవమానించేలా గతంలో ఆ పార్టీ నేతలు మాట్లాడారు. మోడీ పేదరికాన్ని ఎగతాళి చేసేలా చాయ్‌వాలా అని పిలిచారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రతిరోజూ అసభ్యత పరిమితులను దాటి ప్రవర్తిస్తోంది అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
గత 12 ఏళ్లుగా వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం నెలకొందన్నారు. అందుకే ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని ఆరోపించారు. మోడీతోపాటు ఆయన కుటుంబంపై పదేపదే అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తున్నారని తప్పుపట్టారు జేడీయూ నేతలు.