Apple Pay: భారత్‌లో యాపిల్ పే సేవలు ప్రారంభమయ్యాయి. అమెరికాలో 2014లో ప్రారంభమైన ఈ డిజిటల్ పేమెంట్ సర్వీస్ కోసం భారతీయ Apple వినియోగదారులు దాదాపు 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు యాపిల్ పే భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. మొదటి భాగస్వామిగా యాక్సిస్ బ్యాంక్తో కలిసి Apple ఈ సేవలను ప్రారంభించింది.
ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన Visa, Mastercard క్రెడిట్ కార్డులను మాత్రమే యాపిల్ పేలో యాడ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులు తమ కార్డును Apple Walletలో యాడ్ చేసి, దుకాణాల్లో సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ సేవ ప్రస్తుతం ఎంపిక చేసిన Apple డివైజ్‌లలో అందుబాటులో ఉంది. iPhone, iPad, Apple Watch ద్వారా యాపిల్ పేని ఉపయోగించవచ్చు. త్వరలో Macలో కూడా ఈ సేవ అందుబాటులోకి రానుందని Apple తెలిపింది.
యాపిల్ పేలో NFC టెక్నాలజీని ఉపయోగిస్తారు. NFC సపోర్ట్ ఉన్న PoS మెషీన్ దగ్గర Apple డివైజ్‌ను ట్యాప్ చేయడం ద్వారా పేమెంట్ చేయవచ్చు. ప్రత్యేకంగా కార్డును చేతిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే పేమెంట్ సమయంలో ప్రతి సారి PIN లేదా OTP నమోదు చేయాల్సిన అవసరం లేదని సమాచారం. డివైజ్‌ను PoS మెషీన్ దగ్గర ట్యాప్ చేసిన తర్వాత చెల్లింపు పూర్తవుతుంది.
యాపిల్ పేలో సెక్యూరిటీ, ప్రైవసీకి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు Apple తెలిపింది. వినియోగదారుల అసలు కార్డు నంబర్లు Apple సర్వర్లలో లేదా డివైజ్‌లో సాధారణ రూపంలో స్టోర్ చేయబడవు. వాటి స్థానంలో ప్రత్యేకమైన Device Account Numberను ఉపయోగిస్తారు. ఇది ఎన్‌క్రిప్ట్ చేసి డివైజ్‌లోని Secure Elementలో భద్రపరుస్తారు. అలాగే యాపిల్ పే ద్వారా జరిగే లావాదేవీల సమాచారాన్ని Apple తన వద్ద నిల్వ చేయదని కంపెనీ తెలిపింది. కార్డు వివరాలను వ్యాపారులకు కూడా నేరుగా షేర్ చేయరు. దీంతో వినియోగదారుల ఆర్థిక సమాచారానికి అదనపు భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
యాపిల్ పేను ఉపయోగించడం కూడా చాలా సులభం. ముందుగా తాజా యాక్సిస్ బ్యాంక్ యాప్ ద్వారా అర్హత ఉన్న క్రెడిట్ కార్డును Apple Walletలో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే iPhoneలో Wallet యాప్ ఓపెన్ చేసి, ప్లస్ గుర్తుపై క్లిక్ చేసి, స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవుతూ కార్డును యాడ్ చేయవచ్చు.
భారత్‌లో యాపిల్ పే ఎంట్రీతో Apple వినియోగదారులకు మరో డిజిటల్ పేమెంట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ప్రారంభమైన ఈ సేవ భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు, కార్డులకు విస్తరించే అవకాశం ఉంది.
Also Read: Madhya Pradesh: ఇదెక్కడి విడ్డూరం.. గాడిదకు నర్సింగ్ సర్టిఫికేట్ జారీ.. అసలు విషయం ఏమిటంటే.?..
Also Read: నామినీ ఉంటే సులువు.. లేకపోతే ఏంటి పరిస్థితి? బ్యాంక్ ఖాతా డెత్ క్లెయిమ్ ప్రాసెస్, అవసరమైన పత్రాల వివరాలు!