Bird Flu Vaccine: కోళ్ల పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ ను ఎదుర్కొనేందుకు భారత్ కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా హెచ్ 5ఎన్1 వైరస్ కు వ్యతిరేకంగా స్వదేశీ టీకాను డెవలప్ చేశారు. భోపాల్ లోని ఐసీఏఆర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసిజెస్ శాస్త్రవేత్తలు ఈ టీకాను రూపొందించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నవంబర్ 2వతేదీన భోపాల్ లో ఈ టీకాను జాతికి అంకితం చేయనున్నారు.
భారత్ లో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న హెచ్ 5ఎన్ 1 వైరస్ లోని క్లేడ్ 2.3.2.1ఏ రకాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ టీకాను డెవలప్ చేశారు. ఇది కోళ్ల కోసం రూపొందించిన ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇప్పటి వరకు ఈ వైరస్ రకానికి ప్రత్యేకంగా వాణిజ్యపరమైన టీకా అందుబాటులో లేదని కేంద్రం వెల్లడించింది. బోపాల్ లోని ICAR-NIHSAD శాస్త్రవేత్తలు స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ వ్యాక్సిన్ దేశంలో బర్డ్ ఫ్లూ కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ ఫ్లూయోంజా గా పిలిచే బర్డ్ ఫ్లూ కోళ్లకు సోకే ప్రమాదకరమైన వైరస్. ఈ వైరస్ బారిన పడిన పక్షుల్లో మరణాల రేటు దాదాపు వందశాతం వరకు ఉండవచ్చు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పెద్ద సంఖ్యలో కోళ్లను చంపాల్సి వస్తుండటంతో పౌల్ట్రీ రైతులు భారీ ఆర్ధిక నష్టాలను ఎదుర్కొవల్సి వస్తుంది. భారత్ లో 2006లో తొలిసారిగా బర్డ్ ఫ్లూ గుర్తించారు. అప్పటి నుంచి హెచ్ 5ఎన్ 1, హెచ్ 5 ఎన్ 8 రకాలకు సంబంధించి 500కు పైగా వ్యాప్తి ఘటనలు నమోదు అయ్యాయి. 2006లో సంభవించిన బర్డ్ ఫ్లూ వ్యాప్తి వల్ల దేశానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ. 2,200కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల వరకు నష్టం వాటిల్లితుందని అంచనా.
బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టకపోతే, అది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని కేంద్రం పేర్కొంది. ఒకవేళ పెద్ద ఎత్తున ఈ వ్యాధి ప్రబలితే, భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం మేర పడిపోవచ్చని అంచనా. దేశంలోని 20 శాతానికి పైగా కోళ్ల పెంపకం ప్రమాదంలో పడొచ్చని కూడా చెప్పింది. ఈ వ్యాధి కోళ్ల పెంపకం, గుడ్లు, మాంసం ఉత్పత్తి, వాటి సరఫరా గొలుసులపై ప్రభావం చూపుతుంది. ఇది కోళ్ల పెంపకందారుల ఆదాయంతో పాటు వినియోగదారుల ఆదాయాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు.
మానవులకు వ్యాపించే ప్రమాదం:
బర్డ్ ఫ్లూ కేవలం పక్షులకే పరిమితం కాదు. కొన్ని సందర్భాల్లో, H5N1 వైరస్ మానవులకు కూడా సోకవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, 2003 నుండి సెప్టెంబర్ 6, 2026 వరకు 25 దేశాలలో మొత్తం 1,003 H5N1 మానవ కేసులు నమోదయ్యాయి. దీని ఫలితంగా 479 మరణాలు సంభవించాయి. క్లేడ్ 2.3.2.1a వైరస్ కోళ్లతో పాటు క్షీరదాలతో సహా ఇతర జంతువులలో కూడా కనుగొన్నది. ఈ వైరస్ కారణంగా మూడు మానవ కేసులు కూడా నమోదయ్యాయని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదించింది. అందువల్ల, కోళ్లలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడం పౌల్ట్రీ రంగానికి మాత్రమే కాకుండా ప్రజారోగ్యానికి కూడా కీలకమని అధికారులు భావిస్తున్నారు.
పౌల్ట్రీ రైతులకు ఉపశమనం కలిగించే ఒక అవకాశం:
ప్రస్తుతం క్లేడ్ 2.3.2.1a వైరస్ కోసం నిర్దిష్ట వాణిజ్య వ్యాక్సిన్ అందుబాటులో లేనందున, దేశీయ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం అవసరమైంది. ఈ నేపథ్యంలో, ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను నవంబర్ 20న దేశానికి అంకితం చేయనున్నారు. ఈ వ్యాక్సిన్ భవిష్యత్తులో బర్డ్ ఫ్లూ నియంత్రణకు కొత్త అవకాశాలను తెరిచే అవకాశం ఉంది. అయితే, ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుంది. పౌల్ట్రీ ఫారాలలో దీనిని ఎలా ఉపయోగిస్తారు. వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అనే విషయాలపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి సమాచారం అందించలేదు.
Also Read: