Sripal Reddy on PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలపై ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి జీ తెలుగు బిగ్ డిబేట్ విత్ భరత్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమ కార్యవర్గంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్బంగా పీఆర్సీ, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు వంటి అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఆర్సీ అమలు సాధ్యం కాదని.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం హామీ ఇచ్చిన శ్రీపాల్ రెడ్డి తెలిపారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ముందే జీవో ఇవ్వాలి:
ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ.. దానికి సంబంధించిన జీవోను ఇప్పుడే విడుదల చేయాలని తాము కోరినట్లు శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, పెన్షనర్ల ఓట్లు అత్యంత కీలకమనే విషయాన్ని శ్రీపాల్ రెడ్డి గుర్తు చేశారు. 6ఏండ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఉద్యోగుల ప్రభావంతో ఫలితాలు ఎలా మారిపోయాయో అందరూ చూశారని.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ది చేకూరాలంటే గతంలో డీఏ విషయంలో ముందుగా జీవో ఇచ్చినట్లుగానే.. పీఆర్సీ పై కూడా తక్షణమే జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.
హెల్త్ కార్డుల కోసం నెలకు రూ. 90 కోట్లు కట్ అవుతున్నా ఫలితం శూన్యం:
ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావాల్సింది పోయి.. విమర్శలు వస్తున్నాయని శ్రీపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాల నుంచి నెలకు దాదాపు రూ. 88 నుంచి రూ. 90 కోట్లు జమ అవుతున్నాయని.. ఆరు నెలలకు రూ. 540 కోట్లు నిధులు ఉన్నప్పటికీ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడం లేదని విమర్శించారు. ఆసుపత్రులకు వెళ్తే సదరు వ్యాధి లిస్టులో లేదనో, ప్యాకేజీ సరిపోదనో ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత కొంత మార్పు వచ్చినా.. వ్యవస్థ పూర్తిస్థాయిలో మెరుగుపడలేదని.. వైద్యం అందడంలో జరిగే చిన్న జాప్యం కూడా ఉద్యోగుల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బకాయిల చెల్లింపుల్లో లెక్కలు తప్పు.. గ్రాడ్యుయేటీ ఊసే లేదు:
ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ. 10 వేల కోట్లు విడుదల చేశామని సీఎం చెబుతున్నారని, కానీ ఆ లెక్కలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నిజంగా రూ. 10 వేల కోట్లు విడుదలై ఉంటే ఈపాటికి 80 శాతం బకాయిలు తీరిపోయేవన్నారు. గత రెండేళ్లుగా ఒక్క ఉద్యోగికి కూడా గ్రాడ్యుయేటీ డబ్బులు రాలేదని, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని ఆయన ఆరోపించారు.
సీపీఎస్ ఉద్యోగుల నిరసన న్యాయమైనదే:
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చిందని శ్రీపాల్ రెడ్డి గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు కనీసం ఒక కమిటీ కూడా వేయకుండా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబించడం సరికాదని అన్నారు. ఈ విషయంలో సీపీఎస్ ఉద్యోగులు చేస్తున్న నిరసనలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, వారి పోరాటం న్యాయమైనదేనని ఆయన స్పష్టం చేశారు.
Also Read: