ఢిల్లీలో హైఅలర్ట్.. CJP అధినేత అభిజిత్ దీప్కే స్టేషన్‌కు తరలింపు..!
CJP Leadeer Abhijeet Dipke Arrest: బొద్దింకల జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్‌కే ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో నిరసన తెలిపేందుకు ముంబై నుంచి ఢిల్లీ వెళ్లిన అతన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. ఈయనతో పాటు నిరసనల్లో పాల్గొనేందుకు దేశ రాజధానికి చేరుకుంటోన్న ఒక్కో నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Dipke Arrest in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గంట గంటకు టెన్షన్ పెరుగుతోంది. నిరసనల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు బొద్దింకల పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసి, నగరంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సీజేపీ మద్దతుదారుల్ని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు అభిజిత్ దీప్కేతో పాటు సౌరబ్ దాస్, అశుతోష్ రాంకాను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
పోలీసుల పహారాలో దేశ రాజధాని..
అంతేకాదు గత అనుభవాల దృష్ట్యా పోలీసులు రాజధాని అష్ట దిగ్భంధనం చేశారు. సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ )వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ‘ఎమర్జెన్సీ’ తరహా పరిస్థితులతో భయపెట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తోందన్నారు. నిరసనలకు అనుమతి లేకపోయినా వెనక్కి తగ్గబోమని ఆయన ప్రకటించారు. మరోవైపు, నిరసనలో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చిన యూట్యూబర్ ధృవ్ రాఠీ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. గురుగ్రామ్‌లో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. ఈ నిరసనలకు మద్దతు తెలుపుతున్న ప్రకాశ్ రాజ్‌ను సైతం పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది. మరోవైపు దీప్కేను కూడా అరెస్ట్ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. నిరసనకారుల వరుస అరెస్టుల నేపథ్యంలో సీజేపీ శ్రేణులు అప్రమత్తం అయ్యాయి.
ఢిల్లీలో 35 వేల మంది పోలీసుల పహారా..
నిరసన నేపథ్యంలో ఢిల్లీ అంతటా సుమారు 35 వేల మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని మోహరించారు. జంతర్ మంతర్‌తోపాటు ఎన్నికల సంఘం కార్యాలయం పరిసరాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, నగర సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా వ్యవస్థల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిరసన ప్రభావంతో పలు మెట్రో స్టేషన్లలో రాకపోకలపై ఆంక్షలు విధించగా, రైళ్లను కూడా రద్దు చేశారు.