SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Goa Crime News: దారుణం.. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలోనే బాలికపై ఇన్‌స్పెక్టర్‌ లైంగిక దాడి..!

Goa Crime News: రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారే.. కంచె చేను మేసిన చందంగా ప్రవర్తించాడు. ఉత్తర గోవా క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో 16 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌. అతనితో పాటు సహకరించిన మహిళపై పోక్సో కింద కేసు నమోదైంది. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 31, 2026, 09:15 PM IST | Updated: Oct 31, 2026, 09:17 PM IST
Image Credit: Goa Crime News (Source: AI)
Join

Goa Crime News: చట్టాన్ని కాపాడి.. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీస్ విభాగంలోనే ఘోరం చోటుచేసుకుంది. ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయంలోనే ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి జరగడం గోవాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తర గోవాలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం కేంద్రంగా ఈ దారుణం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు అతనికి సహకరించిన మరో మహిళపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉత్తర గోవా క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో 16 ఏళ్ల బాలికపై పలు దఫాలుగా లైంగిక దాడి జరిగినట్లు ఉన్నతాధికారులు నిర్ధారించారు.

క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ వికాస్ దేయ్కర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఈ దారుణానికి రంజని పాల్యేకర్ అనే మహిళ పూర్తిగా సహకరించినట్లు విచారణలో తేలింది. బాధితురాలిని పోలీస్ ఆవరణకు తీసుకురావడం.. ఇన్‌స్పెక్టర్‌కు అనుకూలంగా పరిస్థితులు సృష్టించడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు.. ఇన్‌స్పెక్టర్ వికాస్ దేయ్కర్, అతనికి సహకరించిన రంజని పాల్యేకర్ ఇద్దరిపై పోక్సో చట్టంలోని పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీస్ వ్యవస్థ పర్యవేక్షణలోనే ఉన్న ఒక కార్యాలయంలోనే మైనర్ బాలికపై ఇలాంటి అఘాయిత్యం జరగడం పోలీసు విభాగంలో భద్రత, బాధ్యతలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

గోవాలోని రిబందర్ ప్రాంతంలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ ప్రధాన కార్యాలయంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రంజని పాల్యేకర్ సహాయంతో పోలీస్ ఇన్‌స్పెక్టర్ వికాస్ దేయ్కర్ బాలికను ఆఫీస్ ఆవరణకు రప్పించాడు. అనంతరం బాలికపై లైంగిక దాష్టీకానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి ఆ మహిళ కూడా పూర్తిగా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ధైర్యంతో జరిగిన విషయాన్ని బయటకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన ఓల్డ్ గోవా పోలీస్ అధికారులు.. పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు సహకరించిన మహిళా సహాయకురాలిపై పోక్సో చట్టం సహా పలు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ దారుణ ఘటనపై గోవాలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన అధికారిక కార్యాలయంలోనే ఇలాంటి దారుణం జరగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై డీజీపీ అలోక్ కుమార్ సహా ఉన్నత పోలీస్ అధికారులు సీరియస్ అయ్యారు. డీజీపీ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుడైన పోలీసు అధికారి, అతనికి సహరించిన మహిళపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు జరిపించి బాధిత బాలికకు తగిన న్యాయం చేస్తామన్నాఉరు. ప్రస్తుతం నిందితులపై చట్టపరమైన చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES