సీఎం విజయ్ ఈరోజు 'తైమామన్ తంగ మోతిరం తిట్టం' అంటే మేనమామ బంగారు ఉంగరం పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆయన స్వయంగా 25 మంది పిల్లలకు గోల్డ్ రింగ్స్ తొడిగారు. మధురైలోని ప్రభుత్వ రాజాజీ హాస్పిటల్‌ను సందర్శించిన సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించి, స్వయంగా ఉంగరాలు అందించారు. నిబంధనల ప్రకారం ఈ గోల్డ్ రింగులను పంపిణీ చేస్తున్నారు. త్వరలో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో పుట్టిన పిల్లలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
విజయ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జన్మించిన శిశువులకు ప్రభుత్వం ఈ బంగారు ఉంగరాన్ని అందిస్తుంది. ఈ పథకాన్ని అధికారికంగా 'తైమామన్ తంగ మోతిరం తిట్టం' అని పిలుస్తున్నారు. ఇది జూన్ 22, 2026 తర్వాత జన్మించిన పిల్లలకు వర్తిస్తుంది.
ఎంత బంగారం అందుతుంది?
ఈ 'తైమామన్ తంగ మోతిరం తిట్టం' పథకం కింద, సీఎం విజయ్ ప్రభుత్వం కొత్తగా జన్మించిన శిశువులకు 22 క్యారెట్ల బంగారు ఉంగరాన్ని అందిస్తోంది. అంతేకాకుండా, దీనిపై ఒక యూనిక్ సీరియల్ నంబర్ ఉంటుంది. ఇది టెంపర్-ప్రూఫ్ ప్యాకేజింగ్‌తో వస్తుంది. దీని బరువు ఒక్క గ్రాము. ప్రతి ఏడాది ఈ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం రూ.755.83 కోట్లు వెచ్చించనుంది. తొలి విడతలో అర్హులైన 1.28 లక్షల మంది నవజాత శిశువులకు ఉంగరాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఉంగరాలను సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం అక్టోబర్ 6న ఉప ఎన్నిక జరగనున్న మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాలను మినహాయించి, మిగిలిన ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఈ పథకానికి ఎవరు అర్హులు?
తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న ఈ గోల్డ్ రింగ్ పథకానికి తల్లి, బిడ్డ సరైన అర్హత కలిగి ఉండాలి. ప్రధానంగా తమిళనాడు నివాసితులై ఉండాలి. అలాగే శిశువు తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించి ఉండాలి. జూన్ 22, 2026 తర్వాత పుట్టిన పిల్లలు మాత్రమే దీనికి అర్హులు. అంతేకాకుండా, ప్రెగ్నెన్సీ అండ్ ఇన్ఫాంట్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ పద్ధతి ద్వారా రిజిస్టర్ అయి ఉండాలి. లబ్ధిదారులకు చెల్లుబాటు అయ్యే 'రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ ఐడి కార్డు' ఉండటం తప్పనిసరి.
ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీల సంఖ్యను పెంచడానికి, తల్లి-బిడ్డ ఆరోగ్యంపై మరింత దృష్టి సారించి, ప్రభుత్వ వైద్య సదుపాయాల పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
బంగారు ఉంగరాలు ఎలా అందిస్తారు?
ఈ పథకం ప్రారంభమైన తర్వాత, సెప్టెంబర్ 28 నుండి జన్మించిన పిల్లలకు, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని అందిస్తారు. జూన్ 22, ఆ తర్వాత పుట్టిన వారికి రాష్ట్రవ్యాప్తంగా 107 హబ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో హబ్‌లో ప్రతిరోజూ 100 మంది శిశువులకు ఉంగరాలు అందిస్తారు. ఈ పంపిణీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేలా చూడటానికి, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
సీఎం విజయ్ లండన్ పర్యటన కారణంగా ఈ పథకం సెప్టెంబర్ 15న ప్రారంభించాల్సి ఉన్నా, కొంచెం ఆలస్యమైంది. ఈ పథకం కింద వన్ గ్రామ్ బంగారు ఉంగరాలను సప్లై చేయడానికి తమిళనాడు ప్రభుత్వం 'జాయలుకాస్, కళ్యాణ్ జువెలర్స్' కి ఆర్డర్లు జారీ చేసింది. ప్రస్తుతం వారు ఉంగరాలను అందిస్తున్నారు.
ఆరోగ్య అధికారులు తల్లిదండ్రులకు ముందుగానే గుర్తింపు కార్డులను అందజేశారు, తద్వారా వారు చూపిస్తే వెంటనే వన్ గ్రామ్ గోల్డ్ రింగ్‌ను పొందవచ్చు. ఈ బంగారు ఉంగరం బి.ఐ.ఎస్ హాల్‌మార్క్ కలిగి ఉంటుంది. ప్రతి ఉంగరం బరువు ఒక గ్రాము ఉంటుంది. ఇది 22 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడింది.