భారతీయ రైల్వే రేపటి నుండి కఠినమైన నిబంధనలను అమలు చేయనుంది. ముఖ్యంగా టికెట్ తనిఖీ సమయంలో ఈ రూల్స్ వర్తిస్తాయి. పండుగ సీజన్ కావడంతో చాలా మంది ఊళ్లకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొత్త రైళ్లను ప్రకటించడంతో పాటు కొన్ని రైళ్ల సర్వీసులను పొడిగించారు. అక్టోబర్ 1 నుంచి 31 వరకు దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కొందరు టికెట్ లేకుండా లేదా మోసపూరిత పద్ధతుల్లో ప్రయాణించే అవకాశం ఉంది. అందుకే, స్పెషల్ కోటాపై ప్రయాణించే వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవాలని భారతీయ రైల్వే సూచించింది.
రైలు ప్రయాణికులు వివిధ రకాలుగా ప్రయాణిస్తుంటారు. ఒక సమూహంగా ప్రయాణించేటప్పుడు కనీసం ఒకరి వద్దనైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉండాలి. ఒకవేళ కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, సభ్యులలో ఎవరికైనా సరైన ఐడెంటిటీ ప్రూఫ్ ఉండేలా చూసుకోవాలి.
పండుగల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తనిఖీలు కూడా కఠినంగా ఉంటాయి. రిజర్వేషన్ కోటా ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి, అర్హత తెలిపే డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలి. రైల్వే పాస్ ద్వారా ప్రయాణించే వారు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
అన్-రిజర్వ్డ్ టికెట్లతో ప్రయాణించే వారిని కూడా టీటీఈ తన యాప్ ద్వారా తనిఖీ చేయవచ్చు. మీరు రిజర్వేషన్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించే అవకాశం ఉంది.
సాధారణంగా టికెట్ రిజర్వేషన్ 60 రోజుల ముందుగానే చేసుకోవచ్చు. వీటితో పాటు తత్కాల్ టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇతరుల సీట్లలో మోసపూరితంగా ప్రయాణించి రైల్వే ఆదాయానికి నష్టం కలిగించకుండా ఉండటానికి ఈ ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. కాబట్టి, అందరూ సరైన టికెట్లతోనే ప్రయాణించాలి. టికెట్ లేకుండా లేదా రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారికి భారీ జరిమానా విధించాలని రైల్వే నిర్ణయించింది.
మీ వద్ద సరైన ఫోటో ఉన్న వ్యాలీడ్ ఐడి కార్డు ఉండటం మంచిది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ లేదా కాలేజీ ఐడి కార్డు, ఫోటో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ లేదా క్రెడిట్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను వెంట ఉంచుకుంటే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గ్రూప్ బుకింగ్స్ ఉన్నప్పుడు కూడా ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల సమస్యలు తలెత్తవు