GSLV F18 Rocket Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన ప్రస్థానంలో మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా సుమారు 2,250 కిలోల బరువు ఉన్న ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగారు. ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ కీలక ప్రసంగం చేశారు.
రాకెట్ అద్భుత విజయానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పారిశ్రామిక సంస్థలు, విద్యాసంస్థలకు ఇస్రో చైర్మన్ అభినందనలు తెలిపారు. ఈ ఏడాది శ్రీహరికోట నుంచి చేపట్టిన ఐదో ప్రయోగం అని.. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో ఇది 20వ ప్రయోగమని తెలిపారు. ఇప్పటివరకు జీఎస్‌ఎల్‌వీ రాకెట్లు సుమారు 34 టన్నుల ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టాయని వెల్లడించారు. రెండు వరుస జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల మధ్య కేవలం 56 రోజుల వ్యవధిలోనే మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం విశేషమని చెప్పారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థలు ముందుగా అంచనా వేసిన విధంగానే సమర్థవంతంగా పనిచేశాయని తెలిపారు.
పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యం కీలకం
ఈ ప్రయోగంలో భారతీయ పారిశ్రామిక సంస్థల సహకారం దాదాపు 80 శాతం వరకు ఉందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. దేశీయ పరిశ్రమల సహకారంతో అంతరిక్ష రంగంలో భారత్ స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. NVS-03 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరడంతో భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ NavIC కనీస కార్యాచరణ స్థాయికి అవసరమైన నాలుగు ఉపగ్రహాల స్థితిని తిరిగి సాధించిందని వెల్లడిచారు. దీంతో దేశంలో పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ (పీఎన్‌టీ) సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. NavIC భారతదేశానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జాతీయ ఆస్తి అని, ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా స్థాన నిర్ధారణ, దిశానిర్దేశం, సమయ సమాచార సేవలను అందించగలదని ఇస్రో చైర్మన్ నారాయణన్ వివరించారు.
ప్రయాణానికి ఉపయోగకరం
NavIC ఉపగ్రహ వ్యవస్థ ద్వారా రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, వాహనాల ట్రాకింగ్, సముద్రంలో ప్రయాణించే నౌకల స్థానాన్ని గుర్తించడం వంటి అనేక పౌర సేవలకు ప్రయోజనం కలుగుతుంది. వన్ నేషన్, వన్ టైమ్ కార్యక్రమంలో కూడా NavIC కీలక పాత్ర పోషించనుంది. భారతదేశం అభివృద్ధి చేసిన స్వదేశీ అణు గడియార సాంకేతికతను కూడా ఈ వ్యవస్థలో వినియోగిస్తుండగా.. NavICతో పాటు GAGAN వ్యవస్థ ద్వారా ప్రపంచ నావిగేషన్ రంగంలో భారత్ తనదైన పాత్ర పోషిస్తోందని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. NVS-03 ప్రయోగ విజయంతో భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు అంతరిక్ష రంగంలో దేశ సాంకేతిక స్వావలంబనకు మరో మైలురాయి చేరినట్లయింది.