పేదలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆయుష్మాన్ భారత్‌లో ఇకపై 112 వ్యాధులకు చికిత్స..
Modi government on Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రత్యేకంగా కేటాయించిన చికిత్సల పరిధిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆరోగ్య ప్రయోజన ప్యాకేజీల సంఖ్యను ప్రస్తుతమున్న 23 నుంచి 112కు పెంచాలని ప్రతిపాదించినట్లు నేషనల్ హెల్త్ అథారిటీ వర్గాలు తెలిపాయి.
PM Modi On Ayushman Bharat: ఈ ప్రతిపాదిత విస్తరణ ప్రధానంగా సాధారణ అనారోగ్య సమస్యలు, సర్జరీలపై దృష్టి సారించనుందని వెల్లడించాయి. ఈ అనారోగ్య సమస్యలకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, సబ్ డివిజనల్ ఆస్పత్రుల్లో సమర్థవంతంగా చికిత్స అందించవచ్చని తెలిపాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందించే రోగాల సంఖ్య గణనీయంగా పెరగనుంది.
23 రకాల వ్యాధుల నుంచి 112 వ్యాధులకు పెంచాలని నిర్ణయం..
ప్రస్తుతం 23 రకాల వ్యాధులకు ఈ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలు అందిస్తుండగా, వాటి సంఖ్యను 112కు పెంచనున్నట్టు జాతీయ ఆరోగ్య సంస్థ వర్గాలు తెలిపాయి.తీవ్ర అనీమియా, తీవ్ర రక్తపోటు, తీవ్ర బ్రాంకైటిస్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటెరైటిస్, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు, మధుమేహం సంబంధిత కొన్ని సమస్యలు, హెమరాయిడ్స్, డయాబెటిక్, రెటినోపతి, గ్లకోమా తదితర వ్యాధులను తాజా జాబితాలో చేర్చారు.
డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ప్రతిపాదనలు..?
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాబితాను పరిశీలించి ఈనెల 25వ తేదీలోగా తమ సూచనలు అందజేయాలంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య సంస్థలకు NHA (National Health Authority) సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రాల నుంచి అందే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని సవరించిన మార్గదర్శకాలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయని NHA వర్గాలు తెలిపాయి. తమ వద్ద అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య నిపుణులు, ఇతర సౌకర్యాల ఆధారంగా ఈ ప్యాకేజీల సంఖ్యను తగ్గించుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని జాతీయ ఆరోగ్య సంస్థ వర్గాలు తెలిపాయి.