Mother Dairy Milk Price Hike: మదర్ డెయిరీ పాల ధరల పెంపు.. లీటర్‌పై రూ.4 వరకు భారం.. కొత్త ధరలు ఇవే..!
Mother Dairy Milk Price Hike: పాల ధరలను పెంచుతున్నట్లు మదర్ డెయిరీ తెలిపింది. కొత్త ధరలు నవంబర్ 12 నుంచి అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. ఫుల్ క్రీమ్, టోన్డ్, డబుల్ టోన్డ్, ఆవు పాల ధరలు ఎంత పెరిగాయి..? కొత్త రేట్లు ఎలా ఉన్నాయి..? వివరాలు ఇలా..
Mother Dairy Milk Price Hike: దేశంలో పాల ధరలు మరోసారి పెరిగాయి. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వివిధ రకాల పాల ధరలను లీటర్‌కు రూ.2 నుంచి రూ.4 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు నవంబర్ 12వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ ధరల పెంపు ప్రభావం కనిపించనుంది.
మదర్ డెయిరీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఫుల్ క్రీమ్, టోన్డ్, డబుల్ టోన్డ్, ఆవు పాలు సహా వివిధ రకాల పాల ధరలు మారనున్నాయి. కొత్త ధరల వివరాలు ఇలా..
ఫుల్ క్రీమ్ మిల్క్: గతంలో లీటర్ రూ.72 ఉండగా.. రూ.4 పెంపుతో రూ.76 చెల్లించాలి.
టోన్డ్ పాలు (పౌచ్): రూ.60 నుంచి రూ.62కు చేరింది. లీటర్‌పై రూ.2 పెరిగింది.
టోన్డ్ పాలు (బల్క్): రూ.58 నుంచి రూ.60కు పెరిగింది.
డబుల్ టోన్డ్ పాలు: రూ.54 నుంచి రూ.56కు చేరింది.
ఆవు పాలు: రూ.62 నుంచి రూ.65కు పెరిగాయి. అంటే రూ.3 అధికంగా చెల్లించాలి.
ధరల పెంపునకు కారణం ఇదే..
పాల సేకరణ కోసం రైతులకు చెల్లించాల్సిన ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయాలు అధికమయ్యాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. పెరిగిన ఖర్చుల్లో కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సి వస్తోందని వెల్లడించాయి. మదర్ డెయిరీ తన పాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు 75 నుంచి 80 శాతం వరకు పాలు సరఫరా చేసే రైతులకే చెల్లిస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో మదర్ డెయిరీకి భారీ మార్కెట్ ఉంది. ఈ ప్రాంతంలోనే రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. కంపెనీ మొత్తం విక్రయాలు రోజుకు 50 లక్షల లీటర్లకు పైగా ఉంటున్నాయి. సొంత ఔట్‌లెట్లు, సాధారణ రిటైల్ మార్కెట్, ఆన్‌లైన్ వేదికల ద్వారా వినియోగదారులకు పాలను అందిస్తోంది.
కాగా.. ఈ ఏడాది మే 14న మదర్ డెయిరీ చివరిసారిగా పాల ధరలను సవరించింది. ఇప్పుడు మరోసారి ధరలు పెంచడంతో వినియోగదారుల నెలవారీ ఖర్చులు పెరగనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ 17 శాతం వృద్ధితో రూ.20,300 కోట్లకు చేరినట్లు నివేదికలు వెల్లడించాయి.