Sabarimala Gold Crown Theft: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో స్వామివారి ఆభరణాల తనిఖీ సందర్భంగా ఒక వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. ఆలయంలోని ద్వారపాలక దేవతా విగ్రహాలకు బంగారు పూత పూయడం, అలాగే గర్భగుడి ద్వారాలకు స్వర్ణ తాపడం రేకులు అమర్చే ప్రక్రియలో జరిగిన కొన్ని అవకతవకలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగానే హైకోర్టు ఆదేశాల మేరకు తనిఖీ కమిటీ అధికారులు సన్నిధానం, అరన్ములలోని తిరువాభరణాల తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల సమయంలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బంగారు కిరీటానికి సంబంధించి అధికారులు వ్యత్యాసాలను గుర్తించారు. 2012 ఆగస్టు నెలలో తమిళనాడుకు చెందిన ఒక భక్తుడు ఈ స్వర్ణ కిరీటాన్ని స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆ సమయంలో దేవాలయ రికార్డులలో నమోదు చేసిన వివరాల ప్రకారం ఆ కిరీటం మొత్తం బరువు 445.78 గ్రాములు కాగా, అందులో 55.72 సవర్ల బంగారం ఉంది.
అయితే, ఇటీవల నిర్వహించిన తనిఖీలలో స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న కిరీటం బరువు కేవలం 240 గ్రాములు మాత్రమే ఉన్నట్లు తేలింది. అసలు కిరీటం స్థానంలో తక్కువ బరువున్న కిరీటం ఉండటంతో అది మాయమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ నిబంధనల ప్రకారం కేవలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు మాత్రమే స్ట్రాంగ్ రూమ్ తెరిచే అధికారం ఉంటుంది. అంతటి కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశం నుంచి కిరీటం బరువు తగ్గడంపై పలు సందేహాలు రేకెత్తుతున్నాయి.
దేవస్థానం పాలకమండలి వివరణ..
ఈ వ్యవహారంపై ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తక్షణమే స్పందించింది. బంగారు కిరీటం గల్లంతైందంటూ వస్తున్న వార్తలను దేవస్వం బోర్డు పూర్తిగా తోసిపుచ్చింది. స్వామివారి కిరీటం భద్రంగానే ఉందని తిరువాభరణం కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం మరింత లోతైన విచారణ సాగుతోందని, విచారణ పూర్తయిన తర్వాతే పూర్తి సమాచారం బయటకు వస్తుందని భావిస్తున్నారు.