DA Hike July 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ గిఫ్ట్.. 64 శాతానికి డీఏ..? జీతాల పెంపు లెక్కలు ఇవే..!
Central Government Employees DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కార్ త్వరలోనే తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) తాజా గణాంకాల ప్రకారం జూలై డీఏ ఈసారి 4 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డీఏ 64 శాతానికి చేరుకోనుంది. వివరాలు ఇలా..
Central Government Employees DA Hike: కొత్త పే కమిషన్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో మోదీ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. జూలై 2026 విడతకు సంబంధించిన కరవు భత్యం (DA) పెంపుపై తాజా అంచనాలు వెలువడుతున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) గణాంకాల ఆధారంగా ఈసారి డీఏను 60 శాతం నుంచి 64 శాతానికి పెంచే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కేంద్రం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. దసరా, దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను పెంచుతుంది. ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి జీతాల పెంపు వర్తించనుంది.
పండుగల సీజన్ సమీపిస్తుండటం.. ఖర్చులు పెరుగుతుండటంతో డీఏ/డీఆర్ పెంపు ఫైలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని 'కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్' డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్‌ను కోరింది. తాము ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేదా అదనపు ప్రయోజనాలను డిమాండ్ చేయడం లేదని.. సాధారణ ప్రక్రియ ప్రకారం ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు, సవరించిన వేతనాలను ఆలస్యం లేకుండా విడుదల చేయాలని కాన్ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఎం.ఎస్.వెంకటేశన్ లేఖలో రాశారు.
గతంలో డీఏ పెంపు ఇలా..
- జూలై 2023: 46 శాతం
- జనవరి 2024: 50 శాతం
- జూలై 2024: 53 శాతం
- జనవరి 2025: 55 శాతం
- జూలై 2025: 58 శాతం
- జనవరి 2026: 60 శాతం
జీతాల పెంపు ఎలా అంటే..?
ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే రూ.18 వేలు అయితే.. ప్రస్తుత 60 శాతం ప్రకారం డీఏగా రూ.10,800 లభిస్తుంది. 64 శాతానికి పెంచితే.. ఇది రూ.11,520 అవుతుంది. అంటే నెలకు రూ.720 శాలరీ పెరుగుతుంది. రూ.44,900 బేసిక్ శాలరీకి డీఏ రూ.26,940 నుంచి రూ.28,736 వరకు పెరుగుతుంది. అంటే నెలకు రూ.1,796 జీతం పెరుగుతుంది. రూ.56,100 మూల వేతన ఉంటే.. నెలకు రూ.2,244 జీతం పెరుగుదల ఉంటుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే కొత్త డీఏ పెంపు, జూలై నుంచి రావాల్సిన బకాయిలపై అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.