SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

SIR Election Controversy: ఓటర్ల జాబితా సవరణపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రచ్చ..అసలేం జరుగుతోంది?

SIR Election Controversy 2026: దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపడుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఓటర్ల జాబితా సవరణ ముసుగులో అర్హులైన ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగిస్తున్నారని కాంగ్రెస్, మజ్లిస్ వంటి ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆందోళనల మధ్య మన ఓటు సేఫ్‌గా ఉందా? లేదా అని చాలామంది ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతమా? లేదా అధికార పక్షం పన్నిన కుట్రనా అని గందరగోళంలో ఉన్నారు.

Written By Harish Darla
Published: Oct 07, 2026, 03:29 PM IST | Updated: Oct 07, 2026, 03:32 PM IST
Join

SIR Election Controversy 2026: పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సవరణ పేరుతో ఉన్న ఓటర్లను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీలు, నేతలు ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సిఫారసులు, ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విపక్ష నేతలు ఆరోపించారు.

కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫార్మ్ - 6లో అదనంగా ఆన్‌లైన్ డిక్లరేషన్ చేర్చడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రకారం కొత్త ఓటర్లు తమ తల్లిదండ్రులు లేదా పూర్వీకుల పాత ఓటర్ల జాబితా వివరాలను సమర్పించాల్సి రావడంతో లక్షలాది మంది అర్హులు, ముఖ్యంగా మైనారిటీలు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్ విమర్శించారు. 

ఈ క్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వారు రాజీనామాకు డిమాండ్ చేశారు. మరోవైపు, దురుద్దేశంతో ఫార్మ్ - 7ను ఉపయోగించి మైనారిటీల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.

ఎలక్షన్ కమిషన్, బీజేపీ వివరణ..
ఈ వివాదంపై స్పందించిన ఎన్నికల సంఘం, అంతర్గతంగా భిన్నభిప్రాయాలు వ్యక్తమవ్వడం సాధారణమని, తుది నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగానే జరుగుతున్నాయని స్పష్టం చేసింది. మరణించిన వారు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, నకిలీ ఓట్లతో పాటు విదేశీ అక్రమ వలసదారులు జాబితాలోకి రాకుండా అడ్డుకోవడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది.

కేవలం ఫార్మ్ - 7 దాఖలు చేసినంత మాత్రాన ఓట్లను తొలగించరని, క్షేత్రస్థాయి పరిశీలనలు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి నిర్ధారించుకున్న తర్వాతే చర్యలు ఉంటాయని తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, భారతీయ జతా నాయకుడు రామచంద్రరావు వివరించారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ స్వతంత్రంగా, నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES