Sonia Gandhi Rajiv Gandhi Love Story: తన ఆత్మకథ విడుదల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కీలక విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలను అందులో ప్రస్తావించారు. త్వరలో విడుదల కానున్న ఆత్మకథకు సంబంధించి వరుసగా వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన భర్త రాజీవ్ గాంధీతో తొలి పరిచయం, ప్రేమ, పెళ్లి వరకు దారి తీసిన పరిస్థితులను సోనియా గాంధీ వెల్లడించారు. తాను రాజీవ్‌తో తొలిచూపులోనే ప్రేమలో పడ్డట్లు.. అతడే తనకు సరైనోడు అని నిర్ణయించుకున్నట్లు సోనియా చెప్పుకొచ్చారు.
సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం నవంబర్ 10వ తేదీన ఆవిష్కరణ కానుంది. ఈ సందర్భంగా ఆ పుస్తకంలో కీలక విషయాన్ని వీడియో రూపంలో సోనియా పంచుకున్నారు. 'ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాజీవ్ గాంధీ చదువుకున్నాం. ఆ వర్సిటీలో ఉన్న గ్రీక్ రెస్టారెంట్‌లో రాజీవ్ గాంధీతో నా ప్రేమ ప్రయాణం ప్రారంభమైంది' అని తెలిపారు. గ్రీక్ రెస్టారెంట్‌లో కొందరి మిత్రుల ద్వారా రాజీవ్ గాంధీతో పరిచయం జరిగిందని చెప్పారు.
In a small Greek restaurant in Cambridge my journey of love began. Rajiv and I created a world filled with love, laughter and memories. On 10th November, I share that world with you. https://t.co/zvN5Rqqstf
— Sonia Gandhi (@SoniaGandhi) October 24, 2026
'ఆ రోజుల్లో ఇంగ్లండ్‌లో ఆహారం బాగుండేది కాదు. అందుకే తాను ఇటాలియన్ ఫుడ్ కోసం గ్రీకు రెస్టారెంట్‌కు వెళ్లా. అక్కడ యురోపియన్ స్టూడెంట్స్‌తో పాటు ఇండియన్ విద్యార్థులు కూడా ఆ రెస్టారెంట్‌కు వచ్చేవారు. ఆ రెస్టారెంట్‌లోనే రాజీవ్ గాంధీతో పరిచయమైంది. రాజీవ్‌ను చూడగానే నా జీవిత భాగస్వామి దొరికినట్లు భావించా. రాజీవ్ గాంధీ కూడా నాపై అదే అభిప్రాయం కలిగి ఉన్నారు' అని సోనియా గాంధీ వివరించారు.
'మొదటిసారి ఓ స్నేహితుడి ద్వారా రాజీవ్ పరిచయం కాగా.. తర్వాత మేం స్నేహితులమయ్యాం. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళ్లేవాళ్లం. స్టూడెంట్స్‌తో కలిసి ఓసారి వాలెంటైన్ పార్టీకి కూడా వెళ్లాం. రాజీవ్ గాంధీ సున్నిత మనస్తత్వం నన్ను ఆకర్షించేది' అని సోనియా తెలిపారు. ఆ పరిచయం, ప్రేమ కాస్తా 1968 ఫిబ్రవరి 25వ తేదీన పెళ్లిగా మారింది. సోనియా, రాజీవ్ గాంధీ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రేమ కథ చెప్పడమే కాకుండా రాజీవ్‌తో తాను తీసుకున్న ఫొటోలను కూడా సోనియా గాంధీ తన ఆత్మకథలో పంచుకున్నారు. కాగా తన ఆత్మకథ కోసం సోనియా గాంధీ సోషల్ మీడియాలోకి ప్రవేశించారు. ఇన్‌స్టాగ్రామ్‌ను ఇటీవల ప్రారంభించగా.. కాంగ్రెస్ నాయకుల నుంచి పెద్ద ఎత్తున ఆమెకు స్వాగత పలుకుతూ ఫాలోవర్లు పెరిగారు.