Jagtial News: ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ప్రశాంతంగా ఉందమనే.. పేద ప్రజలకు సమీపంలోని డంపింగ్ యార్డ్ శాపంగా మారుతూ వస్తోంది.. నిరంతరం వస్తున్న దట్టమైన పొగతో పాటు దర్వాసన ఊపిరాడక నరకయాతన అనుభవిస్తున్న జగిత్యాల జిల్లా నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీవాసులు శనివారం రోడ్డెక్కారు.. తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే అక్కడినుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ.. మున్సిపల్ చెత్త తరలింపు వాహనాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు..
కాలనీకి అతి సమీపంలో ఉన్న ఈ డంపింగ్ యార్డ్‌లో రాత్రింబవళ్లు చెత్తను తగులబెడుతుండటంతో దట్టమైన విషపు పొగ కాలనీ మొత్తాన్ని కమ్మేస్తూ వస్తున్నాయి.. ఈ కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల సమస్యలతో పాటు శ్వాసకోశ ఇబ్బందులతో ఇప్పటికే ముగ్గురు కాలనీవాసులు అనారోగ్య సమస్యలకు గురై ఆసుపత్రి పాలయ్యారట.. మరికొందరు చిన్నారులతో పాటు వృద్ధులు తీవ్రమైన దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. కంటి మంటలతో ప్రతి రోజు ఆసుపత్రుల చుట్టూ.. తిరగాల్సి వస్తోందని అక్కడ నివసించేవారు కన్నీటిపర్యంతమయ్యారు.. నిరంతరం వ్యాపిస్తున్న దుర్వాసనతో ఇళ్లలో కనీసం భోజనం కూడా చేయలేని దుర్భర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
ఈ సమస్యపై పలుసార్లు మున్సిపల్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు లిఖితపూర్వకంగా వినతిపత్రాలు సమర్పించినప్పటికీ.. ఫలితం లేదని కాలనీవాసులు మండిపడ్డారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పట్టించుకోని అధికార యంత్రాంగం వైఖరిని నిరసిస్తూ.. శనివారం ఉదయం కాలనీ ప్రధాన రహదారిపై బైఠాయించారు. నగర పరిశుభ్రత పేరిట తమ ప్రాంతంలో చెత్తను కుప్పలుగా పోసి.. తగలబెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.. చెత్త తరలిస్తున్న మున్సిపల్ ట్రాక్టర్లతో పాటు ఆటోలను అడ్డుకుని రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు..
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మంచి గూడు కల్పించినా.. స్థానిక మున్సిపాలిటీ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ జీవించడమే ప్రశ్నార్థకంగా మారిందని వారు అంటున్నారు. ఇప్పటికైనా.. ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, డంపింగ్ యార్డ్‌ను జనావాసాలకు దూరంగా తరలించాలని.. కాలనీ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వెంటనే హామీ ఇవ్వకపోతే రాబోయే.. రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేసి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.