Srisailam Temple Karthika Masothsavalu Begins: కార్తీక మాసంలో రూ.5,000 విలువైన గర్భాలయ అభిషేకాలు, రూ.1,500 విలువైన సామూహిక అభిషేకాలను రద్దు చేశారు. శని, ఆది, సోమవారాల్లో స్వామివారికి అలంకార దర్శనం ఉంటుంది. ప్రతి శని, ఆది, సోమవారాలతో పాటు పర్వదినాల్లో స్వామివారి స్పర్శ దర్శనం ఉండదు. అంతేకాకుండా, మంగళవారం నుంచి శుక్రవారం వరకు విడతలవారీగా స్పర్శ దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే అర్జిత హోమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఈవో సూచించారు. ఈ నెల 24న ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
కార్తీక మాసంలో శ్రీశైలం మల్లన్న ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.
నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగే కార్తీక మాసోత్సవాల్లో పంచమఠాలలో అర్జిత అభిషేకాలు నిర్వహించనున్నారు. ఇందుకు సేవా టికెట్ రుసుము కేవలం రూ.216. ఒక సేవా టికెట్‌పై దంపతులు లేదా ఒకరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. భక్తులు ఈ సేవా టికెట్‌తో గంటా మఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠం వంటి ఏదైనా ఒక మఠంలో అభిషేకం జరిపించుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో శివాభిషేకం సర్వాభీష్టాలను ప్రసాదించేదిగా భక్తులు భావిస్తారు. అర్జిత సేవా టికెట్లను మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
అలంపూర్ జోగులాంబ..
జోగులాంబ అమ్మవారితో పాటు బాలబ్రహ్మేశ్వరాలయంలో ప్రతిరోజూ కార్తీక దీపాల కాంతులతో అమ్మవారు దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటారు. భక్తులు కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ స్థానంలో పవిత్ర స్నానమాచరించి, అమ్మవారి సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఈరోజు నుండి ప్రారంభమైన కార్తీక దీపోత్సవాలతో ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది. ఈ నెలరోజుల పాటు సాగే కార్తీక మాస పూజల్లో, ముఖ్యంగా పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, నదిలో కార్తీక దీపాలను వదులుతూ, అమ్మవారి సమక్షంలో దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరులో వెలసిన అష్టాదశ శక్తిపీఠాలలో జోగులాంబ అమ్మవారి పీఠం ఒకటి.