Tomorrow Wine Shops Close: మద్యం ప్రియులకు ఇది చేదు వార్త. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. వైన్ షాపులు రేపు, ఎల్లుండి మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పండుగలు వస్తున్న వేళ మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించడం మద్యం ప్రియులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఈ మద్యం దుకాణాలు అనేవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాదు. దేశ రాజధాని ఢిల్లీలో వైన్ షాపులు మూసివేయనున్నారు. ఇంతకీ ఎందుకు మూసివేస్తున్నారో తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతోపాటు ఇండి కూటమి నాయకులు ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. వరుస ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది.
అక్టోబర్ 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో శాంతి భద్రతల కారణంగా మద్యం దుకాణాలు మూసివేస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. శాంతి భద్రతలను కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో బీఎన్‌ఎస్ సెక్షన్ 163 అమల్లోకి రానుంది. ఈ సెక్షన్ అమల్లోకి రానుండడంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌తోపాటు అన్ని చోట్లా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 10వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనకు కూడా అనుమతి లేదని ఢిల్లీ డీసీపీ సృష్టి పాండే ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు
సర్‌లో అనేక అవకతవకలు జరిగాయన తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో దేశవ్యాప్తంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. మూడు రోజులుగా చేపట్టిన ఉద్యమ తీవ్ర రూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా జనతా కాక్రోచ్ పార్టీ (సీజేపీ) భారీ నిరసనలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తోంది. దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆందోళన బాట పట్టాయి.
కాంగ్రెస్, ఇండి కూటమి నిరసన
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నాయి. సర్ ప్రక్రియలో ఓట్ల చోరీ జరిగిందంటూ దీనికి బాధ్యతగా రాజీనామా చేయాలని కోరుతూ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో ఢిల్లీలో ఎక్కడికక్కడ నిషేదాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ఓటు బచావో.. దేశ్ బచావో ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండంతో ఢిల్లీలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మొహరించాయి. 20 వేలకు పైగా పోలీసులు, పారామిలటరీ సిబ్బంది భద్రతా చర్యల్లో మునిగాయి.