RanaBaali Trailer: తన ఎదుగుదలను ఓర్వలేని వారికి.. తన ఆత్మ విశ్వాసం చూసి బలుపు అనుకుంటే తాను ఏం చేయలేనని సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రకటించారు. తాను మారనని.. వాళ్లే మారాలని సూచించారు. ఓ బ్యాచ్ రీల్స్ చేసి నెగటివిటీ చేస్తూ ఉంటారని.. ఎవరో డబ్బులు ఇచ్చి అవన్నీ చేయిస్తున్నారని రౌడీ హీరో విజయ్ తెలిపారు. తన జీవిత ప్రయాణం వారికి అరగకపోతే ఇంట్లో కూర్చోవాలా? అని ప్రశ్నించారు.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రణబాలి' సినిమా ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లో నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నా కలలు, నా శ్రమ వాడికి అనవసరం అనిపిస్తే నేనాగాలా? నా నిజాయతీ వాడికి అహంకారంలా అనిపిస్తే నేను నటించాలా? నా ఆత్మ విశ్వాసం వాళ్లకి బలుపులా అనిపిస్తే నేను తగ్గాలా? నా ప్రయాణం వారికి అర్థం కాకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా?' అని విజయ్ దేవరకొండ ప్రశ్నించారు. 'నేను మారను. వాళ్లు మారాలి' అని స్పష్టం చేశారు.
'ఎవరో ఒక వ్యవస్థగా ఏర్పడి ట్రోల్ చేయిస్తున్నారు. ఓ బ్యాచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 50 రీల్స్ వస్తూ ఉంటాయి. కావాలని కూర్చుని నెగటివిటీ (తప్పుడు ప్రచారం) చేస్తూ ఉంటారు. కొందరు తయారు చేసిన గ్రూపులు ఉంటాయి. 50 మందిని కలిపి ఒక 20 అకౌంట్లు క్రియేట్ చేస్కోని నెగటివిటీ చేస్తున్నారు. ఎవరో డబ్బులు పెట్టి ఇవన్ని చేయిస్తున్నారు' అని విజయ్ ఆరోపించారు. ఇదే విషయమై మొన్న నాని, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం కూడా మాట్లాడాడని గుర్తుచేశారు. 'ఖాళీ చేతులతో సినీ పరిశ్రమకు వచ్చి నచ్చిన సినిమాలు చేసుకుంటూ వచ్చా. అప్పుడు వచ్చినప్పుడు నాకు తెలీదు. ఏడేళ్లు పట్టింది ఇవన్నీ అర్ధం చేసుకోవడానికి. గత ఏడాది ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. నాకు ఏం జరుగుతుందో అర్థమైంది. అప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటున్నా' అని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌లో 90 శాతం కావాలని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నవేనని విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తం చేశారు.
'రణబాలి సినిమా ట్రైలర్ విడుదల కాకముందే ఇది బ్రిటీష్ సినిమా అంటూ కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమీ తెలియకుండానే ఇలా తప్పుడు అభిప్రాయాలను ప్రచారం చేయడం వెనుక ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తోంది. తెలుగు సినిమా రణబాలి కాకుండా మనం జైలర్-2కు పోదాం అని సడెన్‌గా 50 అకౌంట్స్ నుంచి ఒకే రీల్ షేర్ అవుతుంది. అందరూ ఒకే అభిప్రాయాన్ని రీల్‌గా షేర్ చేస్తున్నారంటే ఎవరో కూర్చొని డబ్బులు పెట్టి మరీ చేయిస్తున్నారని అర్థం. వ్యవస్థ అలా తయారైంది. దీన్ని మనం ఆపలేం' అని విజయ్ దేవరకొండ వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు.
'ఇవన్నీ డబ్బులు ఇచ్చి చేయిస్తున్న వాడు రేపు ఏఐతో కూడా చేయిస్తారు. అప్పుడు ఈ పనిచేసే వాళ్లు ఏం చేస్తారు?' అని విజయ్ దేవరకొండ ప్రశ్‌నించారు. సినిమాను ప్రచారం చేయడానికి తాను ఎప్పుడూ మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. సినిమా వలన ఎవరో ఒకరు బాగుపడతారని.. కానీ ఒకరిని కిందకు లాగడానికి ఇలా చేస్తే ఎందుకురా ఈ పనులు అనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు.