Vande Bharat Sleeper From Secbad: రైల్వేశాఖలో లేటెస్ట్ సెప్సెషన్ వందే భారత్ స్లీపర్. ప్రస్తుతం ఈ రైళ్ళకు ప్రయాణీకుల నుంచి డిమాండ్ ఎక్కువగా వుంది. ప్రారంభమైన తొలి రూట్‌లోనే 114శాతం పైగా ఆక్యుపెన్సీ రికార్డు నమోదు అయింది. ఈ ఏడాదిలో దేశంలోని మూడు కీలక మార్గాలలో వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను విజయవంతంగా ప్రారంభించింది. అవి కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఫుల్ బుకింగ్స్‌తో నడుస్తున్నాయి. దీంతో రైల్వే శాఖ నూతనోత్సాహం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మరిన్ని స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
జనవరిలో తొలి వందే భారత్ స్లీపర్ రైల్..
దేశంలో తొలిసారి వందేభారత్ స్లీపర్. ఎక్స్‌ప్రెస్‌ను ఈ ఏడాది జనవరిలో ప్రారంభించింది రైల్వేశాఖ. హౌరా – గువహతి కామాఖ్య ప్రారంభమైన తొలి సర్వీసుకు రికార్డు స్థాయిలో ప్రయాణికుల ఆదరణను పొందింది. దీంతో ముంబై – బెంగళూరు నగరాల మధ్య నవంబర్ 1 న మరో సర్వీసును, దక్షిణ భారతంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను ప్రారంభించారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంతకల్ మీదుగా ప్రయాణిస్తోంది. ఇక మరో స్లీపర్ రైలును న్యూఢిల్లీ – వారణాసి నగరాలను కలుపుతూ పట్టాలెక్కింది. ఈ రైళ్లు సైతం ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ పొందుతూ సూపర్ సక్సెస్ అయ్యాయి.
విమానం తరహాలో వందే భారత్ స్లీపర్‌లో సౌకర్యాలు ..
వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అందుబాటులో ఉన్న సౌకర్యాలే వీటి సక్సెస్‌కు కారణమని చెప్పక తప్పడం లేదు. ఇందులో రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే మెరుగైన సౌకర్యాలు, వేగం ఉండటంతో ప్రయాణికులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రైళ్ల అత్యధిక వేగం, గంటకు 180 కిలోమీటర్లు. అంత వేగంతో ట్రయల్ రన్ నిర్వహించగా అదీ సక్సెస్ అయ్యింది. అంత స్పీడ్‌గా నడుస్తున్న రైలులో ఉంచిన గ్లాసులోని నీరు కూడా కనీసం తొణకలేదు. ఈ విధంగా ఈ రైలు తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. దీనికి తోడు ఈ రైలులో విమాన స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతీ రైలులో 16 పూర్తి ఏసీ కోచ్‌లు, ఆటోమేటిక్ డోర్లు, ఫస్ట్ ఏసీ ప్రయాణికులకు వేడి నీటి షవర్లు, వై-ఫై, ఆధునిక బయో-వాక్యూమ్ టాయిలెట్లు ఇందులో ఉన్నాయి.
ప్రస్తుతం 3 రూట్లలో నడుస్తున్న వందే భారత్ స్లీపర్..
ఇక ప్రయాణీకుల భద్రత కోసం ప్రమాదాలను నివారించే 'కవచ్' టెక్నాలజీ, అగ్నిమాపక అలారాలు, ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక టికెట్ల విషయానికి వస్తే ఈ రైళ్లలో తత్కాల్, ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్ ఉండవు. కేవలం కన్ఫర్మ్ టికెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది, అలాగే టికెట్ ధరలు స్థిరంగా ఉంటాయి . వీటిలో అన్ని కోచ్‌లు పడక సౌకర్యంతో కూడిన స్లీపర్ బోగీలుగా ఉంటాయి. పై బెర్త్‌లను చేరుకోవడానికి మెట్ల సదుపాయం కూడా ఉంటుంది. పూర్తిస్థాయి ఏసీ సదుపాయాలతో రాత్రి ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలుంటుంది. కొత్త రైళ్ల తయారీ. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా మరిన్ని కొత్త రూట్‌లలో రైళ్లను అందుబాటులోకి తీసుకురావలన్న ఆలోచనలో వుంది. భవిష్యత్తులో 250కి పైగా స్లీపర్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది.
వందే భారత్ స్లీపర్ రైళ్ళ కు పెరుగుతున్న ఆదరణ, అందుతున్న సౌకర్యాలను చూస్తున్న హైదరాబాద్ వాసులు సైతం ఈ సర్వీసు మనకి ఎప్పుడన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఇప్పటికే కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి వివిధ నగరాలకు నడుస్తున్న వందే భారత్ చైర్‌కార్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పూర్తిస్థాయి ఏసీ కోచ్‌లు, వేగవంతమైన ప్రయాణం ఈ రైళ్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే ఇవి ప్రధానంగా పగటిపూట ప్రయాణాలకు అనుకూలంగా ఉండటంతో, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువసేపు కూర్చొని ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సమస్యకు వందే భారత్ స్లీపర్ రైళ్లు పరిష్కారంగా మారనున్నాయి. రాత్రివేళల్లో పడుకొని సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉండటంతో హైదరాబాద్ నుంచి ఇతర ప్రధాన నగరాలకు వెళ్లేవారికి ఇవి ప్రయోజనకరంగా ఉండనున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, ముంబయి, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలకు రాత్రిపూట ప్రయాణించే వారికి ఈ రైళ్లు ఉపయోగపడే అవకాశం ఉంది.
వందే భారత్ చైర్ కార్లు..
హైదరాబాద్ నుంచి ప్రస్తుతం కాచిగూడ– యశ్వంత్‌పూర్, సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి మార్గాల్లో వందే భారత్ చైర్‌కార్ రైళ్లు నడుస్తున్నాయి. వీటితోపాటు విశాఖపట్నం–సికింద్రాబాద్, నాగ్‌పూర్–సికింద్రాబాద్ మార్గాల్లోనూ వందే భారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లు వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుండటంతో ప్రయాణికులకు సమయం ఆదా అవుతోంది. అయితే రాత్రిపూట ప్రయాణించే వారికి పడక సౌకర్యం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. స్లీపర్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బంది తొలగడంతోపాటు దూర ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి.
హైదరాబాద్ నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపితే బెంగళూరు, ముంబయి, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని రైల్వే వర్గాలు, ప్రయాణికులు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు రాత్రిపూట ప్రయాణించి మరుసటి రోజు గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు కలుగుతుందని అంటుున్నారు. అయితే హైదరాబాద్ నుంచి ఏయే మార్గాల్లో ఈ ట్రైన్లను ప్రవేశపెడతారు. ఎప్పటి నుంచి సేవలు ప్రారంభిస్తారనే అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొత్త ట్రైన్ల కేటాయింపు, మార్గాల సామర్థ్యం, ప్రయాణికుల రద్దీ, నిర్వహణ సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని రైల్వే శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది.
హైదరాబాద్ నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎదురు చూపులు..
వందే భారత్ స్లీపర్ రైలు ఎప్పుడు వస్తుందా అని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ఛైర్‌కార్ రైళ్లకు ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ లభిస్తోంది. అయితే వందే భారత్ ఛైర్‌కార్ రైళ్లో పగటి వేళల్లో దూర ప్రాంతాలకు కూర్చొని వెళ్లడం వృద్ధులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు వస్తే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయని అంటున్నారు. మరి రైల్వే శాఖ ప్రజల కోరికకు ఎప్పుడు ఓకే చెబుతుందో వేచి చూడాలి.