Tea: ఉదయం నిద్రలేవగానే పరగడుపున టీ తాగే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త! ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కొందరిలో ఎసిడిటీ, గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టీ తాగే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అలవాట్లు పాటించాలో తెలుసుకోండి.
1/5
టీ తాగే ముందు జాగ్రత్తలు
ఉదయం నిద్రలేవగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఒక కప్పు వేడి వేడి టీ. టీ తాగితేనే రోజంతా ఉత్సాహంగా ఉండగలమని చాలామంది భావిస్తారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు కొందరిలో జీర్ణ సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఎసిడిటీ, గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. మరి పరగడుపున టీ తాగడం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ఈ అలవాటును ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.
2/5
టీతో ఎసిడిటీ
టీలో కెఫీన్‌తో పాటు పాలీఫినాల్స్ వంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి. కెఫీన్ మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే కొంతమందిలో ఇది కడుపులో అసౌకర్యాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట సమస్యలతో బాధపడేవారికి టీ తాగిన తర్వాత ఇబ్బంది కలగవచ్చు. కొందరిలో వికారం, కడుపులో మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే టీ తాగిన ప్రతి ఒక్కరికీ ఈ సమస్యలు వస్తాయని చెప్పలేం.
3/5
జీర్ణక్రియపై ప్రభావం
టీలో ఉండే కెఫీన్ కొందరిలో పేగుల కదలికలను ప్రేరేపించవచ్చు. అందుకే ఉదయం టీ తాగిన వెంటనే మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని కొందరు చెబుతుంటారు. మరికొందరిలో టీ తాగిన తర్వాత కడుపులో అసౌకర్యం లేదా గ్యాస్ సమస్యలు కనిపించవచ్చు. టీ ఎంత చిక్కగా తయారు చేస్తున్నారు, ఎంత పరిమాణంలో తాగుతున్నారు, వ్యక్తి శరీర తత్వం ఎలా ఉంది అనే అంశాలను బట్టి ప్రభావాలు మారుతుంటాయి.
4/5
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిద్రలేవగానే ముందుగా ఒక గ్లాసు నీరు తాగడం మంచిది. పరగడుపున టీ తాగినప్పుడు కడుపులో మంట లేదా వికారం కలుగుతుంటే, తేలికపాటి అల్పాహారం తీసుకున్న తర్వాత టీ తాగి చూడవచ్చు. టీని మరీ చిక్కగా తయారు చేసుకోవడం, ఎక్కువ చక్కెర కలపడం తగ్గించాలి. రోజంతా పదేపదే టీ తాగే అలవాటు ఉన్నవారు కెఫీన్ తీసుకునే పరిమాణంపై కూడా శ్రద్ధ పెట్టాలి.
5/5
టీ మానేయాలా?
ఉదయం టీ తాగే అలవాటు ఉన్నవారంతా దానిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి అసౌకర్యం కలగకపోతే మితంగా టీ తీసుకోవచ్చు. అయితే సాయంత్రం లేదా రాత్రి టీ తాగడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంటే ఆ సమయంలో టీని తగ్గించడం మంచిది. తరచూ గుండెల్లో మంట, కడుపునొప్పి లేదా వికారం వంటి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలి. మొత్తానికి, టీ తాగే సమయం, పరిమాణం విషయంలో శ్రద్ధ పెట్టడంతో పాటు సమతుల్య ఆహారం, తగినంత నీరు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.