ధనవంతులు కావడానికి చాణక్యుడు చెప్పిన 5 ముఖ్య సూత్రాలు..
Chanakya niti For Wealthy: ఆచార్య చాణక్యుడు అపుడెపుడో చెప్పిన విషయాలు నాటికీ నేటికి ముమ్మాటికి ఆచరించదగినవే. ఆచార్య చాణక్యుడు డబ్బు కేవలం లావాదేవీల సాధనం మాత్రమే కాదు. మన శక్తి సామర్ధ్యాలకు గౌరవానికి చిహ్నం అని కూడా చెప్పాడు. అయితే ఆర్ధిక లావాదేవీల గురించి ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని నీతి సూత్రాలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సదా ఆచరణీయం.
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం, జీవితంలో ధనవంతులు కావాలంటే కేవలం సంకల్పం ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టు కార్యాచరణ ఉండాలి. అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. ముందుగా కష్టపడటం, ఆ తర్వాత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం.. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం.. కొత్త ఆదాయ మార్గాలను కనుగొనడం.. భవిష్యత్తు కోసం పొదుపు చేసి పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్రణాళిక విజయానికి మార్గం సుగమం చేస్తాయని ఆచార్య చాణక్యుడు చెప్పుకొచ్చారు.
ధనవంతులు ఎలా అవ్వాలి: దాదాపు ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించి, ఆర్థికంగా బలమైన జీవితాన్ని గడపాలనే ఆశ కోరిక బలంగా ఉంటుంది. లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేయాలనేది ప్రతి ఒక్కరి కల. దీని కోసం చాలామంది రేయింబవళ్లు కష్టపడతారు. కానీ కేవలం కష్టపడటం ద్వారా మాత్రమే ధనవంతులు అవుతారా అంటే అది చెప్పలేము. మనం సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగిస్తాము. మన సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నాము. మన జీవితంలో ఎలాంటి అలవాట్లను అలవర్చుకుంటాము అనేవి కూడా ఆర్థిక పురోగతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆచార్య చాణక్యుని సూత్రాలపై ఆధారపడిన ఈ వ్యాసం, ధనవంతులు కావడానికి పాటించాల్సిన కొన్ని ఉత్తమ అలవాట్ల గురించి చెబుతుంది.
కష్టపడటానికి ఎప్పుడూ వెనుకాడవద్దు..
విజయం, సంపదను సాధించడానికి కష్టపడటం అత్యవసరం అనేది చాణక్య నీతి యొక్క ప్రధాన సందేశం. ఏ పనిలోనైనా విజయం సాధించడానికి ఆసక్తి మాత్రమే కాకుండా, నిరంతర కృషి, క్రమశిక్షణ కూడా అవసరం. పని చేయడానికి బద్ధకించడం, సవాళ్లను ఎదుర్కోవడానికి సంకోచించడం, ప్రయత్నాలను మధ్యలోనే వదిలివేయడం వంటివి మీ పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ప్రతిరోజూ దానిని సాధించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. విజయానికి ఏదైనా సులభమైన మార్గం కోసం వెతకకూడదు. మీలో నైపుణ్యాలను పెంపొందించుకుని, పట్టుదలతో ముందుకు సాగడం వల్లే మీకు విజయాలు ప్రాప్తిస్తాయి.
సమయాన్ని వృధా చేయవద్దు..
జీవితంలో సమయం అత్యంత విలువైన వనరులలో ఒకటి. గడిచిపోయిన సమయాన్ని కోట్లు పెట్టినా తిరిగి పొందలేము. అందువల్ల, సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకునే వారు తమ లక్ష్యాలను చేరుకునే అవకాశాలను పెంచుకోగలరు. నేటి పనిని రేపటికి వాయిదా వేయడం, అనవసరమైన పనులపై ఎక్కువ సమయం గడపడం వంటివి మీకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. అందువల్ల, రోజువారీ పనులకు ప్రాధాన్యతనివ్వడం అత్యంత ముఖ్యమైన అంశం. వాటిని సమయానికి పూర్తి చేసే అలవాటును పెంపొందించుకోవాలి.
అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి..
డబ్బు సంపాదించడమే కాకుండా.. దానిని పొదుపు చేయడం కూడా ముఖ్యం. డబ్బు రాగానే అనవసరమైన వస్తువులు కొనడం లేదా ఇతరులను ఆకట్టుకోవడానికి ఖరీదైన వస్తువులపై ఖర్చు చేయడం వంటివి మీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. మీ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు కోసం పక్కన పెట్టడం మంచి అలవాటు. మీ నెలవారీ ఆదాయం, ఖర్చులను నమోదు చేసుకోండి. ఏ ఖర్చులను ఎలా తగ్గించవచ్చో చూడండి. అనుకోని పరిస్థితుల కోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం కూడా ఆర్థిక భద్రతకు సహాయపడుతుంది.
ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను సృష్టించుకోండి..
ఒకే ఆదాయ వనరుపై ఆధారపడిన వారు ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా ఆదాయం తగ్గినప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోనే అవకాశాలున్నాయి. అందువల్ల, వారి సామర్ధ్యం, సమయాన్ని బట్టి అదనపు ఆదాయ అవకాశాలను ఏర్పరుచుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం, సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా ప్రధాన ఉద్యోగానికి ఆటంకం కలగకుండా అదనపు గంటలు పనిచేయడం వంటివి ఉన్నాయి. అయితే, అదనపు ఆదాయం సంపాదించాలనే ఉద్దేశ్యంతో డబ్బును గుడ్డిగా పెట్టుబడి పెట్టడం లేదా త్వరిత లాభాలను వస్తాయనే పథకాలను నమ్మడం మిమ్మల్ని ఆర్ధికంగా ఇబ్బందుల పాలు చేస్తుంది. ఏదైనా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించే ముందు, మీరు దాని లాభ నష్టాలను బేరీజు వేసుకవాలి.
కేవలం డబ్బు ఖర్చు పెట్టడానికే కాకుండా, భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి..
మీరు సంపాదించిన డబ్బును పూర్తిగా ఖర్చు పెట్టే బదులు, భవిష్యత్ అవసరాల కోసం పొదుపు , సరైన పెట్టుబడుల గురించి ఆలోచించాలి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అత్యంత కీలకమైనది. వాటికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. పెట్టుబడి పెట్టే ముందు, మీరు దాని నష్టాలు, వ్యవధి, రుసుములు, మీ డబ్బును తిరిగి పొందే నియమాల గురించి తెలుసుకోవాలి. అన్ని పెట్టుబడులు అందరికీ సరిపోవు. అందువల్ల, మీరు మీ ఆదాయం, బాధ్యతలు మీ శక్తి సామర్థ్యానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.
సంపదకు క్రమశిక్షణ, సహనం కీలకం..
మొత్తం మీద, ఆచార్య చాణక్యుని సూత్రాల ఆధారంగా రూపొందించిన ఈ సలహాల్లో కష్టపడటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, పొదుపు, కొత్త ఆదాయ అవకాశాలను విస్తరించుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. సంపద అనేది ఒక్క రోజులో సాధించగలిగేది కాదు. నిరంతర కృషి, బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్ణయాలు,దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు.
Disclaimer (గమనిక): ఇవి చాణక్య నీతికి సంబంధించిన వ్యాసంలో ఇవ్వబడిన జీవిత మార్గదర్శకాలు. వీటిని పాటించినంత మాత్రాన ప్రతి ఒక్కరూ తప్పకుండా ధనవంతులు అవుతారని ఎటువంటి హామీ లేదు. దీనికి మీ వంతు ప్రయత్నాలు చేయాలి. చాణక్య నీతి చెబుతున్న పుస్తకాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. ZEE NEWS ఈ వార్తను ధృవీకరించడం లేదు.