Ganesh Chaturthi : దేశ రాజధాని డిల్లీలో ఢిల్లీకా మహారాజ్ గణపతి ప్రత్యేక పూజలు అందుకున్నారు. లక్ష్మీనగర్ లో గణేశ్ మహోత్సవ్ రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణనాథుడి భారీ విగ్రహాన్ని పురవీధుల్లో ప్రదర్శనగా తీసుకొచ్చారు. మహిళలు స్వామివారి శోభయాత్రలో కలశాలతో తరలివచ్చి భక్తి విశ్వాసాలను చాటుకున్నారు.
దశాబ్ధాలుగా సమాజం రుపాంతరం చెందిన తీరూ తెన్నులపై ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. శ్రీగణేశ్ సేవామండల్ ఆధ్వర్యంలో గుడి గోపురాల్లో పూజలు, గోసంరక్షణ, సోలార్ విప్లవం, ఇస్రో రాకెట్లు, చంద్రయాన్, డ్రోన్లు, రోబోటిక్ లతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
ముంబై..
ముంబై మహానగరంలో వినాయక చతుర్థి వేడుకలు సందడిగా మారాయి. ముంబైలో లాల్ భగుచ రాజ మందిరంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోడానికి భక్తులు పోటెత్తారు.
మధ్య ప్రదేశ్..
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని వినాయక చతుర్తి వేడుకల్లో భక్తులు ఆనందపరవశులయ్యారు. ఇక్కడ చింతమాన్ గణేశ్ సన్నిధి వినాయక చవితి వేడుకలు వైభవాన్ని సంతరించుకున్నాయి. ఇక్కడ వినాయకుడికి ఒక లక్షా ఇరవై ఐదువేల లడ్డూలను నైవేద్యంగా సమర్పించారు.
అయోధ్యలో వినాయక చవితి సంబురాలు..
అయోధ్యపురిలో వినాయక చవితి వేడుకలు వైభవాన్ని సంతరించుకున్నాయి. జానకి మహల్ టెంపుల్ లో వినాయక చవితి ఘనంగా జరిగింది. వెండి సింహాసనంపై గణనాఢుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భాగ్యనగరంలో అంబరాన్ని తాకిన సంబురాలు..
తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు వైభవాన్ని సంతరించుకున్నాయి. ముందుగా మనకు ఖైరతాబాద్ గుర్తుకు వస్తుంది. ఇక్కడ పంచముఖ సంకటహర మహాగణపతికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలిపూజ నిర్వహించారు. గవర్నర్ తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోడానికి భక్తులు పోటెత్తారు.
తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు..
తెలంగాణలో వినాయకచవితి పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ థీమ్ తో ప్రతిష్టించిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ మత్స్య కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, వినాయకుడిని మోస్తున్నట్లు ఏర్పాటుచేసిన విగ్రహం ఆకట్టుకుంది.
విజయవాడ..
విజయవాడలో వినాయకచవితి వైభవంగా జరిగింది. వీధివీధినా వినాయకులను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డూండి గణేశ్ సేవాసమితి ఆధ్వర్యంలో 72 అడుగుల ఎత్తులో వినాయక విగ్రహాన్ని ప్రతిషించారు. లక్ష్మీ నరసింహస్వామికి మధ్య పీఠంపై అధిష్టించిన పంచముఖ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు.
పాట్నాలో గణేష్ చతుర్ధి సంబురాలు..
బిహార్ లో వినాయకచవితి వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పాట్నా నగరంలోని మహారాష్ట్ర మండళ్ లో వినాయకుడిని ప్రతిష్టించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ప్రథమ పౌరుడు గవర్నర్ సయ్యద్ అత్తా హుసేన్ విఘ్నాధిపతికి తొలిపూజ నిర్వహించారు. మహారాష్ట్ర మండల్ పరిసరాలు భక్తులతో సందడిగా మారింది.
తమిళనాడులో వినాయక సంబురాలు..
తమిళనాడులోని కొళత్తూరులో కొలువుదీరిన శంఖం గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 12వేల శంఖాలతో గణనాథుడిని ప్రతిష్టించారు. నలభై అడుగుల ఎత్తులో ప్రతిష్టించిన గణనాథుడు భక్తులను ఆశీర్వదిస్తూ విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
చెన్నై..
వినాయకచవితి వేడుకల్లో తమిళనాడు వెట్రి కళగం పార్టీ శ్రేణులు రాజకీయ భక్తిని చాటుకున్నాయి. చెన్నై ఆర్కే నగర్ లో సీఎం విజయ్ కుమార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నట్లు విగ్రహాన్ని ప్రతిష్టించారు. విజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ప్రతిమలను రూపొందించి, వినాయకుడిని ప్రతిష్టించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
మదరాసు స్టీల్ గణేష్..
చెన్నైలో స్టీల్ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హిందూ ఇళుచ్చి ఉద్యమకారు సంఘం ఆధ్వర్యంలో వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యంత్రవిడి భాగాలతో గణనాథుడిని సువర్ణశోభితంగా ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. లోహగణపతి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
వెల్లూరు..
తమిళనాడులోని వేలూరులో వినాయక చవితి ప్రత్యేకతను సంతరించుకుంది. ఓటింగ్ థీమ్ తో వినాయకుడి విగ్రహాన్నిప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామాన్యులు, విద్యావంతులు ఓటింగ్ థీమ్ అవహగాహన చేసుకునే విధంగా వినాయక మండపాన్ని తీర్చిదిద్దారు. ఓటింగ్ థీమ్ గణపతిని సందర్శించి నిర్వాహకులను అభినందించారు.
తిరుచ్చి..
తమిళనాడులోని తిరుచ్చిలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. రాతికొండపై వెలసిన వినాయకుడిని ఇక్కడ ఉచ్చి పిళ్లయార్ గా పిలుస్తారు. వినాయకచవితి సందర్భంగా 150కిలోల మోదకాలను సమర్పించారు. వేలామంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
కుల్లు..
హిమాచల్ ప్రదేశ్ లోని కులూలో వినాయకులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడిని ఒకే చోట విభిన్న రూపాల్లో ప్రతిష్టించారు.
గుజరాత్..
గుజరాత్ లోని వడోదరలో లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లో వినాయకచవితి వేడుకలు సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచాయి. రెండు శతాబ్ధాలుగా రాయల్ సంస్కృతిని ఆచరిస్తున్నారు. రాజ్ పురోహిత్, లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ను రిషీకేష్ స్థావరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ గణనాథుడు కొలువుదీరి భక్తులను ఆశీర్వదించారు. రాజ్ పురోహితులు వినాయకుడికి పల్లకీ సేవ నిర్వహించారు.
వినాయక చవితి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి..
ఢిల్లీలో వినాయక చవితి వేడుకలు కన్నులపండువగా సాగాయి. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ వినాయక విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాలుపంచుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వినాయక విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రాధాకృష్ణన్ కు వేదపండితులు వేద ఆశీర్వచనాలతో సంకల్ప పూజనిర్వహించారు.
భువనేశ్వర్..
వినాయకుడు ప్రకృతితో మమేకమయ్యారని ఒడిశా వాసులు వినాయక చవితి వేడుకలను విభిన్నంగా నిర్వహించారు. ప్రకృతిలోనే దైవం ఉందని బకుల్ పౌండేషన్ నిర్వాహులు నిరూపించారు. చెట్టునే దైవంగా పూజించాలని వినాయకుడిని రూపంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీటితో పాటు దేశ వ్యాప్తంగా గల్లీ గల్లీలో కూడా వినాయకులు కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నాయి.