అతని షాట్లు కళ్లు చెదిరేలా ఉన్నాయి.. మేం నేర్చుకోవాల్సిందే.. ప్రత్యర్థి బ్యాటర్‌పై శ్రేయస్ ప్రశంసలు..!
IND vs NZ 4th T20I Highlights: నాలుగో టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు. అతడి అసాధారణ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసిందని.. ప్రత్యర్థి అయినా తమ జట్టు ఆటగాళ్లు అతని నుంచి నేర్చుకోవాల్సి ఉందన్నాడు.
IND vs NZ 4th T20I Highlights: వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ గట్టి షాక్ ఇచ్చింది. నాలుగో టీ20 మ్యాచ్‌లో ఏకంగా 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో తొలి గెలుపు రుచి చూసింది. ఇప్పటికే సిరీస్ భారత్ సొంతం చేసుకోవడంతో నామామత్రమైన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ (107) శతక్కొట్టుడు కొట్టాడు. బ్రాస్‌వెల్ (65) కూడా బౌండరీల వర్షం కురిపించడంతో న్యూజిలాండ్ 259 పరుగుల భారీ స్కోరు చేసింది. చిన్న గ్రౌండ్ కావడంతో భారత బౌలర్లు తేలిపోయారు. లక్ష్యం పెద్దది కావడంతో ఆరంభం నుంచే భారత్ బ్యాట్స్‌మెన్లు భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. చివరికి 172 పరుగులకే టీమిండియా పరిమితం అయింది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. గ్రౌండ్‌లో అనుకున్న వ్యూహాలు పక్కాగా అమలు కాకపోతే ఎంతటి మ్యాచ్ అయినా చేజారిపోతుందనడానికి ఈ రోజే నిదర్శనమని అన్నాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే తమ బౌలింగ్ విభాగం పూర్తిగా లయ తప్పిందని.. మూడో ఓవర్ నుంచే ప్రత్యర్థి జట్టు దూకుడు పెంచి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుందన్నాడు. మధ్యలో ఒకరిద్దరు బౌలర్లు పరుగుల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించినా.. అప్పటికే మ్యాచ్ తమ చేతుల్లోంచి జారిపోయిందన్నాడు.
అన్నింటికీ మించి గ్లెన్ ఫిలిప్స్ ఆడిన ఇన్నింగ్స్ అసలు సిసలైన హైలైట్ అని.. క్లాసిక్ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడని మెచ్చుకున్నాడు. ఈ సిరీస్ మొత్తం అతడు చూపిస్తున్న నిలకడ నిజంగా ప్రశంసనీయమన్నాడు.. ప్రత్యర్థి అయినా.. అతడి ఆటతీరు నుంచి తమ ఆటగాళ్లు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు. న్యూజిలాండ్ పిచ్‌లు, ఇక్కడి గ్రౌండ్ కొలతలు ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయనని.. తమ జట్టులోని యువ ఆటగాళ్లకు ఇలాంటి ప్రత్యేకమైన మైదానాల్లో ఆడటం ఇదే తొలిసారి అని చెప్పాడు. పరిస్థితికి అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుందనేది వాస్తవమన్నాడు.
"నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో మా బౌలింగ్ ఆరంభం నుంచే గాడి తప్పింది. గ్లెన్ ఫిలిప్స్ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసింది. అతడు ఆడిన కొన్ని షాట్లు కళ్లు చెదిరేలా, అసలైన క్రికెట్ విందులా సాగాయి. ఈ సిరీస్ ఆరంభం నుంచీ అతడు నిలకడగా రాణిస్తూ వస్తున్న తీరు నిజంగా మెచ్చుకోదగినది. అతడి ఆటతీరు నుంచి మా బౌలర్లు, ఆటగాళ్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఓటమి అనేది ఎప్పుడూ ఒక హెచ్చరిక లాంటిదే. లోపాలను సమీక్షించుకోవడానికి, మా తప్పులను సరిదిద్దుకోవడానికి ఇది సరైన సమయం. చేతిలో ఒక్క రోజు మాత్రమే విరామం ఉంది. వెంటనే హామిల్టన్ మ్యాచ్‌కు సిద్ధం కావాలి. జట్టు సభ్యులందరం కూర్చుని ఎక్కడ పొరపాట్లు జరిగాయో కూలంకషంగా విశ్లేషించుకుంటాం. వచ్చే మ్యాచ్‌లో ఎలాంటి తప్పిదాలు లేకుండా శాయశక్తులా మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.. " అని శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ముగిసిన అనంతరం చెప్పుకొచ్చాడు.