IPL 2027 Mini Auction: ఐపీఎల్ మినీ వేలానికి అన్ని జట్లు తెర వెనుక ప్రణాళికలు రచిస్తున్నాయి. నవంబర్ 15వ తేదీ వరకు రిటెన్షన్ జాబితాను విడుదల చేసేందుకు గడువు ఉండగా.. ఈలోపు ఫ్రాంచైజీలు లిస్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాయి. ట్రేడింగ్ విండో ద్వారా ఫ్రాంచైజీలు వేస్తున్న ఎత్తులు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇప్పటివరకు నలుగురు స్టార్ ఆటగాళ్లు జట్లు మారి పోయారు. ఇందులో అందరి దృష్టిని ఆకర్షించిన ప్లేయర్లు మాత్రం.. రిషభ్ పంత్, టి.నటరాజన్ అని చెప్పవచ్చు. ఇద్దరు కూడా భారీగా రెమ్యూనరేషన్ తగ్గించుకుని మరీ తమ పాత జట్లలోకి రీఎంట్రీ ఇచ్చారు.
ఈసారి భారీ డీల్ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్యే జరిగింది. లక్నో జట్టుకు రెండేళ్లపాటు ఆడిన రిషభ్ పంత్.. మళ్లీ తన పాత టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరాడు. గతంలో లక్నో నుంచి ఏకంగా రూ.27 కోట్ల భారీ ధర దక్కించుకున్న పంత్.. ఢిల్లీలోకి రీఎంట్రీ కోసం తన ఫీజును ఏకంగా రూ.15 కోట్లకు తగ్గించుకున్నాడు. పంత్‌ను ఢిల్లీకి అప్పగించిన లక్నో.. అందుకు బదులుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తమ జట్టులోకి తీసుకుంది. గతంలో ఢిల్లీ నుంచి రూ.13.25 కోట్లు అందుకున్న కుల్దీప్కు లక్నో రూ.13.50 కోట్లు ఇవ్వనుంది.
ఈ ట్రేడ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు కూడా ఓ గుడ్ న్యూస్ అందింది. యార్కర్ల స్పెషలిస్ట్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టి.నటరాజన్ మళ్లీ రెండేళ్ల తర్వాత ఆరెంజ్ ఆర్మీలోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. సన్‌రైజర్స్ కోసం నటరాజన్ కూడా తన రెమ్యూనరేషన్‌ను రూ.10.75 కోట్ల నుంచి సగానికి పైగా తగ్గించుకుని రూ.5 కోట్లకే సైన్ చేయడం గమనార్హం. నటరాజన్‌ను తీసుకున్న సన్‌రైజర్స్.. బదులుగా లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీని ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంపించింది. అన్సారీకి గత సీజన్లో లభించిన రూ.40 లక్షల మొత్తమే ఢిల్లీ కూడా చెల్లించనుంది.
ఇప్పటివరకు పూర్తయిన ఈ రెండు కీలక డీల్స్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మొత్తం రూ.15.40 కోట్లకు రిషబ్ పంత్, అన్సారీలను తమ జట్టులో చేర్చుకుంది. ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్ల ట్రేడ్ పూర్తయింది. మినీ వేలానికి ఇంకా సమయం ఉండడంతో మున్ముందు ఇంకెన్ని సంచలన మార్పులు చోటుచేసుకుంటాయనే విషయం క్రీడా వర్గాల్లో చర్చగా మారింది. అయితే అందరూ మాత్రం హర్దిక్ పాండ్యా డీల్ ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌లో ఏదో ఓ టీమ్‌కు వెళతాడని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా రోహిత్ శర్మ మరోసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈ ప్రచారంపై త్వరలోనే క్లారిటీ రానుంది.