IPL 2027 Updates: ప్రీతి జింటా జట్టుకు ఊహించని షాక్.. ఆ ఇద్దరు టీమ్ నుంచి ఔట్..!
Punjab Kings Coaches Exit: రాబోయే ఐపీఎల్ సీజన్ వేలానికి ముందే పంజాబ్ కింగ్స్ టీమ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ తమ పదవుల నుంచి తప్పుకున్నారు. వీరిద్దరి స్థానాల్లో త్వరలోనే కొత్త వారిని నియమించేందుకు పంజాబ్ యాజమాన్యం ప్లాన్ చేస్తోంది.
Punjab Kings Coaches Exit: వచ్చే ఐపీఎల్ సీజన్‌కు అన్ని జట్లు ఇప్పటికే ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నాయి. మినీ వేలానికి ఎవరిని జట్టు నుంచి రిలీజ్ చేయాలి..? ఎవరిని అట్టిపెట్టుకోవాలి..? అనే విషయాలపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా కోచింగ్ స్టాఫ్‌లో కూడా మార్పులు చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కూడా వచ్చే సీజన్‌కు గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ సమయంలోనే ఆ టీమ్‌కు గట్టి షాక్ తగిలింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సహాయక సిబ్బందిలోని ఇద్దరు సీనియర్ సభ్యులు జట్టు నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు బ్రాడ్ హాడిన్, జేమ్స్ హోప్స్ తమ పదవులకు వీడ్కోలు పలికారు. వేలం సన్నాహాలు, జట్టు పునర్నిర్మాణ పనుల్లో ఫ్రాంచైజీ నిమగ్నమై ఉన్న సమయంలో వీరిద్దరు తప్పుకోవడం జట్టు ప్రణాళికలను ప్రభావితం చేసే అంశంగా మారింది.
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత పంజాబ్ కింగ్స్ 2025 సీజన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో ఒక పాయింట్ తేడాతో ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం కోల్పోయింది. గత సీజన్లలో పంజాబ్ కింగ్స్ జట్టుకు బ్రాడ్ హాడిన్ అసిస్టెంట్ కోచ్‌గా.. జేమ్స్ హోప్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా సేవలు అందించారు. వీరిద్దరు డ్రెస్సింగ్ రూమ్ వ్యూహాలు ఎంతో చక్కగా రచించారు. ఆటగాళ్ల బ్యాటింగ్, కీపింగ్ విభాగాల్లో హాడిన్ మార్గదర్శకత్వం చేయగా.. పేస్ బౌలర్లను తీర్చిదిద్దడంలో జేమ్స్ హోప్స్ కీలక పాత్ర పోషించారు. అయితే రాబోయే సీజన్‌కు ముందు వారు బాధ్యతల నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో జట్టు కొత్త వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలో కోచింగ్ సిబ్బందిలో మార్పులు అనివార్యమైనట్లు తెలుస్తోంది. ఖాళీ అయిన సహాయక కోచ్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ స్థానాల కోసం ప్రీతి జింటా నేతృత్వంలోని యాజమాన్యం కొత్త పేర్లను పరిశీలిస్తోంది. రాబోయే వేలంలోకి దిగడానికి ముందే పూర్తిస్థాయి సపోర్ట్ స్టాఫ్‌ను నియమించాలని ఫ్రాంచైజీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే కూడా నిష్క్రమించిన విషయం తెలసిందే.
ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ (BBL)లో హడిన్, హోప్స్‌లకు పెద్ద అవకాశాలు లభించినట్లు తెలుస్తోంది. పాంటింగ్‌కు హోప్స్ మంచి సన్నిహితుడని పేరుంది. పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు పనిచేసినప్పుడు కూడా కలిసి వర్క్ చేశాడు. ఆ తరువాత పాంటింగ్‌తోపాటే పంజాబ్ ఫ్రాంచైజీకి మారాడు. హడిన్ మాత్రం గత యాజమాన్యం నుంచి కొనసాగుతున్నాడు. ప్రస్తుతం PBKS యాజమాన్యం రికీ పాంటింగ్‌తో సంప్రదింపులు జరుపుతోంది. పాంటింగ్ ఆమోదం తెలిపిన తర్వాత ఆసక్తిగల అభ్యర్థులతో ఇంటర్వ్యూలపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 14 నుంచి 16 తేదీల మధ్య గోవాలో జరగనుంది.