SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ishan Kishan: మూడో టీ20 మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్ సూర్యవంశీకి మరో బంపర్ ఛాన్స్..!

IND vs NZ 3rd T20 Updates: న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌కు కూడా ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించకపోవడంతో మూడో మ్యాచ్‌కు దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో మరో అవకాశం లభించనుంది.

Written By Ashok Krindinti
Published: Oct 26, 2026, 12:39 PM IST | Updated: Oct 26, 2026, 12:41 PM IST
Image Credit: IND vs NZ 3rd T20 Updates (Source: BCCI)
Join


IND vs NZ 3rd T20 Updates: కివీస్‌ గడ్డపై టీమిండియా చెలరేగి ఆడుతోంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా రెండో మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఓటమి అంచుల నుంచి గెలుపుబాట పట్టింది. తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డికి తోడు నమన్ ధీర్ న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొట్టారు. రేపు (మంగళవారం) వెల్లింగ్టన్‌లోని హెన్రీ స్టేడియం వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ భారత్ సొంతం అవుతుంది. అయితే ఈ మ్యాచ్‌ కూడా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దూరమయ్యాడు.

తొలి మ్యాచ్ సందర్భంగా ఇషాన్ కుడి తొడ కండరాల గాయం తిరగబెట్టడంతో రెండో మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మూడో టీ20 మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతానికి ఇషాన్ కిషన్ వేగంగా కోలుకుంటున్నాడని.. ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడని తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా తరువాత మ్యాచ్‌లో ఆడించట్లేదని పేర్కొంది. "ఇషాన్ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నా.. ఇంకా పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదు. అందుకే వెల్లింగ్టన్‌లో జరిగే మూడో టీ20కి అతడిని తప్పించాం. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది" అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.

ఇషాన్ కిషన్ స్థానంలో రెండో టీ20 కోసం తుది జట్టులో వైభవ్ సూర్యవంశీ ఆడాడు. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఫిక్స్ అయిపోవడంతో వైభవ్‌ను మూడో స్థానంలో ఆడించారు. తనకు అలవాటులేని స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్.. బాగా ఇబ్బంది పడ్డాడు. కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. ఓ లైఫ్‌ కూడా లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడో మ్యాచ్‌లో కూడా వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇషాన్ కిషన్‌కు బ్యాకప్‌గా జట్టులోకి ఎంపికైన కుమార్ కుశాగ్ర.. మూడో టీ20కి కూడా  జట్టులోనే కొనసాగుతాడని బీసీసీఐ తెలిపింది.

 

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించిన భారత్.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 2-0తో తిరుగులేని లీడ్‌లో ఉంది. వెల్లింగ్టన్‌లో జరిగే మూడో టీ20లోనూ గెలిచి.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని శ్రేయాస్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES