SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ind vs WI Highlights: గురుశిష్యులు కోహ్లీ, గిల్‌ శతకాల మోత.. విండీస్‌పై భారత్‌ రికార్డు విజయం

Kohli And Gill Slammed Centuries India Won By 8 Wickets Against West Indies: ఊహించినట్టుగానే వెస్టిండీస్‌పై భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీతోపాటు కెప్టెన్‌ గిల్‌ అద్భుత సెంచరీలతో విండీస్‌ను చిత్తు చేశారు. అత్యంత సునాయాసంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 28, 2026, 01:15 AM IST | Updated: Sep 28, 2026, 08:42 AM IST
Image Credit: Source: BCCI Twitter
Join

India vs West Indies Highlights: భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్‌ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. విండీస్‌తో సిరీస్‌ అంటే విజృంభించే స్టార్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి సెంచరీతో చెలరేగి ఆడగా.. అంతకుముందు కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ కూడా శతకం మోత మోగించాడు. ఫలితంగా తొలి వన్డేలో భారత్‌ అద్భుత విజయం సాధించి వెస్టిండీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. 8 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్న భారత్‌ ఫుల్‌ జోష్‌లో మునిగింది.

తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ విధించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఛేదించింది.  మాజీ కెప్టెన్‌ రోహిత్ శర్మ 32 పరుగులతో మంచి ఆరంభాన్నిచ్చాడు. ఇక అనంతరం గురు శిష్యులు కోహ్లీ, గిల్‌ చెలరేగి ఆడారు. విరాట్ కోహ్లి (88 బంతుల్లో 139 నాటౌట్‌, 10 ఫోర్లు, 9 సిక్సర్లు), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (108 బంతుల్లో 110 పరుగులు, 13 ఫోర్లు, ఒక సిక్సర్‌) శతకాలతో విధ్వంసం సృష్టించారు.

రోహిత్ ఔటయ్యాక గిల్‌కు చక్కగా సహకరిస్తూ విరాట్ కోహ్లీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అల్జారీ ఓవర్లో సిక్సర్‌తో కోహ్లీ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు గిల్‌, కోహ్లీ కలిసి 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారీ శతకంతో వన్డేల్లో 55వ సెంచరీని కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు. బౌలింగ్‌లో విండీస్‌ బౌలర్లు తేలిపోయారు. భారత బ్యాటర్లను ఏమాత్రం పడగొట్టలేకపోగా.. పరుగుల వరద పారించారు. అల్జారీ జోసెఫ్‌, రోస్టన్ చేజ్ ఇద్దరూ చెరొక వికెట్ పడగొట్టగా.. మిగతా బౌలర్లు భారత జట్టుకు సహకరించినట్లు బౌలింగ్‌ చేశారు.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 295 ప‌రుగులు సాధించింది. ఓపెన‌ర్ జ‌స్టిన్ గ్రీవ్స్‌ (101) సెంచ‌రీతో చెలరేగి ఆడగా.. జాన్ క్యాంప్‌బెల్‌ (62), అమీర్ జాంగో (58) అర్ధ శ‌త‌కాల‌తో  భారీ స్కోర్‌ దిశగా ఆడారు. విండీస్‌పై సీనియర్‌ బౌలర్‌ కుల్దీప్ యాద‌వ్ విజృంభించాడు. నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి విండీస్‌ నడ్డి విడిచాడు. ప్ర‌సిద్ద్ కృష్ణ రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. విండీస్‌పై విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా జరగనుంది.

వన్డేల్లో రికార్డుల రారాజుగా నిలుస్తున్న కోహ్లీ ఈ మ్యాచ్‌లో భారీ ప్రదర్శనతో పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీతో రికార్డు నెలకొల్పిన విరాట్ ఈసారి 15 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. అంతర్జాతీయంగా వన్డేల్లో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. వన్డే ఫార్మాట్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత 15 వేల పరుగులు బాదిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. తనకెంతో ఇష్టమైన ఈ ఫార్మాట్లో అతడు 15వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆదివారం తిరువనంతపురం వన్డేలో అర్జారీ జోసెఫ్‌ ఓవర్లో బౌండరీ బాదిన కోహ్లీ.. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలురాయిని అందుకున్నాడు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES