SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ind vs NZ Highlights: న్యూజిలాండ్‌పై భారత్‌ ఉత్కంఠ విజయం.. గెలుపు బాట పట్టించిన తెలుగు ఆటగాళ్లు

Tilak Varma And Nitish Kumar Stunning Performance India Won By 4 Wickets: తెలుగు ఆటగాళ్లు అదరగొట్టారు. ఓడిపోయే మ్యాచ్‌ను గెలుపు బాట పట్టించారు. తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌పై రెండో టీ20లో భారత్‌ ఉత్కంఠ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుని న్యూజిలాండ్‌పై భారత్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

Written By Ravi Kumar Sargam
Published: Oct 24, 2026, 04:27 PM IST | Updated: Oct 24, 2026, 04:52 PM IST
Image Credit: Source: BCCI X (Twitter)
Join

Ind vs NZ 2nd T20I Highlights: విదేశీ గడ్డపై మరోసారి భారత జట్టు అద్భుత విజయం సాధించి న్యూజిల్యాండ్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. మోస్తరు లక్ష్యాన్ని చెమటోడ్చి సాధించి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో న్యూజిల్యాండ్‌పై పైచేయి సాధించింది. రెండో మ్యాచ్‌లో తెలుగు క్రీడాకారులు తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్‌ ఉత్కంఠ విజయం సాధించింది. ఒక బంతి మిగిలిండగా మ్యాచ్‌ను పూర్తి చేసి 4 వికెట్ల తేడాతో భారత్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

క్రిస్ట్‌చర్చ్‌ మైదానంలో శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుని న్యూజిల్యాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిల్యాండ్‌ నిర్ణీ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్‌ 43 బంతుల్లో 70 పరుగులతో భారీ ఇన్సింగ్‌ నెలకొల్పగా.. నాలుగేసి చొప్పున ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఫిలిప్స్‌తో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పిన బెవాన్‌ జాకోబ్స్‌ 46 బంతుల్లో 58 స్కోర్‌ చేసి అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌ (7), ఫిన్‌ అలెన్‌ (16)తోపాటు డేరిల్‌ మిచెల్‌ (6), శాంట్నర్‌ (4), మిచెల్‌ బ్రాస్‌వెల్‌ (10) స్కోర్‌ సాధించడంలో విఫలమయ్యారు. కివీస్‌ ఆటగాళ్లపై భారత బౌలర్లు ప్రతాపం చూపించారు. పరుగులకు కళ్లెం వేస్తూనే వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌ కుమార్‌, ప్రిన్స్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలా ఒక్కో వికెట్‌ తీశారు.

కివీస్‌ బౌలింగ్‌కు ఎదురొడ్డి పోరాడిన బ్యాటర్లు
కివీస్‌ విధించిన లక్ష్య ఛేదనలో భారత్‌ తడబడి ఆఖరకు నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 19.5 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి భారత్‌ 181 పరుగులతో విజయం సాధించింది. ఓపెనర్లు, మిడిలార్డర్‌ పరుగులు రాబట్టడంలో విఫలమవడంతో ఆఖర్లో తెలుగు ఆటగాళ్లు తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డికి తోడు నమన్‌ ధీర్‌ బ్యాట్‌తో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో ఓటమి నుంచి భారత్‌ తప్పించుకుంది. గత మ్యాచ్‌ హీరో సంజూ శామ్‌సన్‌ 14 పరుగులకే పరిమితమవగా.. స్టార్‌ ఓపెనర్ అభిషేక్‌ శర్మ 27 పరుగులు జోడించాడు. చాలాకాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని వైభవ్‌ సూర్యవంశీ సద్వినియోగం చేసుకోలేక 4 పరుగులకే ఔటయ్యాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (7), అక్షర్‌ పటేల్‌ (11) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. 

తిలక్, నమన్, నితీశ్ కలిసి
హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మ 26 బంతుల్లో 51 పరుగులు చేసి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 196 స్ట్రైక్‌ రేట్‌తో ఆడి 6 ఫోర్లతో విరుచుకుపడగా.. ఒక సిక్సర్‌ బాదాడు. గత మ్యాచ్‌లో మాదిరి ఈసారి కూడా నమన్‌ ధీర్‌ గొప్ప ప్రదర్శన చేశాడు. 17 బంతుల్లో 31 పరుగులు చేసి విజయానికి బాటలు వేశాడు. ఒక ఫోర్‌, మూడు సిక్సర్లు బాది నమన్‌ ధీర్‌ జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి 13 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. చెరొక ఫోర్‌, సిక్సర్‌ బాది తిలక్‌ వర్మతో కలిసి మ్యాచ్‌ను ముగించాడు.

న్యూజిల్యాండ్‌పై ఆధిపత్యం
తక్కువ స్కోర్‌ను కాపాడుకునేందుకు న్యూజిలాండ్‌ బౌలర్లు గట్టిగా పోరాడారు. స్కోర్‌ రాబట్టకుండా బంతులు వేస్తూనే భారత బ్యాటింగ్‌ దళాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఆఖరువరకు కివీస్‌ బౌలర్లు పైచేయి సాధించినా తిలక్‌, నమన్‌, నితీశ్‌ను దెబ్బతీయకపోవడంతో మ్యాచ్‌ చేజారింది. కెప్టెన మిచెల్‌ శాంట్నర్‌ నాలుగు వికెట్లతో విజృంభించగా.. నథన్‌ స్మిత్‌, జాకబ్‌ డఫీ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ విజయంతో భారత జట్టు 2-0తో న్యూజిల్యాండ్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌ 27వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుని హ్యాట్రిక్‌ విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరి ఏం జరుగుతుందనేది రెండు రోజులు ఎదురుచూడాలి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES