SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Advocate Dating App: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో వల..రూ.5 కోట్లు మోసం చేసిన యువతి! చివరికి ఏం జరిగిందంటే?

Hyderabad Advocate Dating App: ఆన్‌లైన్ డేటింగ్ వేదికగా మహిళ రూపంలో పరిచయమై, వ్యక్తిగత సంభాషణలను బయటపెడతానని బెదిరిస్తూ ఓ న్యాయవాది నుంచి రూ. 5 కోట్లకు పైగా వసూలు చేసిన తీవ్ర సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తొలుత సానుభూతి మాటలతో లొంగదీసుకుని, ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి బాధితుడి జీవిత కష్టార్జితాన్ని గుంజాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.

Written By Harish Darla
Published: Sep 24, 2026, 12:01 PM IST | Updated: Sep 24, 2026, 12:14 PM IST
Image Credit: Source: AI Generated Image
Join

Hyderabad Advocate Dating App: హైదరాబాద్‌లోని ఇజ్జత్‌నగర్ ప్రాంతానికి చెందిన 27 సంవత్సరాల యంగ్ అడ్వకేట్‌కు ఆగస్టు 2025లో ఒక ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా 'దిశ' అనే ప్రొఫైల్‌తో పరిచయం ఏర్పడింది. తాను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని పరిచయం చేసుకున్న సదరు వ్యక్తితో బాధితుడు చాటింగ్ చేస్తూ, నమ్మకంతో తన వ్యక్తిగత వివరాలను పంచుకున్నాడు. ఆ తర్వాత నిందితుడు తన తండ్రి మరణించాడని, దహన సంస్కారాల ఖర్చులకు డబ్బులు కావాలని కోరడంతో బాధితుడు సానుభూతితో యూపీఐ (UPI) ద్వారా రూ. 4.3 లక్షలు బదిలీ చేశాడు. అయితే, ఆ సొమ్మును తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు తదనంతరం డబ్బులు ఇవ్వడం నిలిపివేశాడు.

అసలు రూపం, తీవ్ర బెదిరింపులు..
డబ్బుల రాక ఆగిపోవడంతో నిందితుడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తాను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తినని, తన అసలు పేరు 'అలీనా' అని వెల్లడిస్తూ బాధితుడిని మానసికంగా కుంగదీశాడు. పర్సనల్ చాటింగ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, కుటుంబ సభ్యులకు పంపుతానని, ఇంటికి మనుషులను పంపి పరువు తీస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు మొదట్లో ఆ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసినప్పటికీ, జూలై 2026లో నిందితుడు మళ్లీ సంప్రదించి తన తల్లికి మెదడులో బ్లడ్ క్లాట్ అయిందని చెబుతూ తీవ్ర ఒత్తిడి తెచ్చాడు.

భారీ దోపిడీ, ఆర్థిక నష్టం..
బాధితుడి భయాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు జూలై నుంచి సెప్టెంబర్ 15 మధ్యకాలంలో విడతల వారీగా కోట్ల రూపాయలు కాజేశాడు. సెప్టెంబర్ నెలలో గచ్చిబౌలి ప్రాంతంలో నిందితుడు పంపిన వ్యక్తులకు బాధితుడు నాలుగు దఫాలుగా రూ. 77 లక్షల నగదు అందించగా, మిగిలిన మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ భారాన్ని తట్టుకోవడానికి బాధితుడు తన సొంత పొదుపు, కుటుంబ దాచుకున్న సొమ్ముతో పాటు ఒక ఫ్లాట్ అమ్మగా వచ్చిన డబ్బును కూడా ఇచ్చి మొత్తంగా రూ.5 కోట్లకు పైగా పోగొట్టుకున్నాడు.

పోలీసుల దర్యాప్తు..
ఎంత ఇస్తున్నా బెదిరింపులు ఆగకపోవడంతో బాధితుడు ధైర్యం చేసి కుటుంబ సభ్యులకు విషయం వెల్లడించి, సెప్టెంబర్ 19న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేశాడు. దీని ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రతినిధులు బిఎన్ఎస్ (BNS) సెక్షన్లు 318(4), 319(2), 308, ఐటీ చట్టం సెక్షన్ 66-D కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆన్‌లైన్ లావాదేవీలు ఒకే బ్యాంక్ ఖాతాకు వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES