KCR Wishes: తెలంగాణ ప్రజలకు తొలి సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు
Telangana First CM KCR Dussehra Wishes To Public: అత్యంత వైభవంగా రేపు జరగనున్న దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
KCR Dussehra Wishes: అత్యంత భక్తిశ్రద్ధలతో.. వైభవంగా రేపు దసరా పండుగ తెలంగాణ ప్రజలు చేసుకోబోతుండగా.. ఈ సందర్భంగా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతిలో, సాంప్రదాయ వేడుకల్లో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉన్నదని కేసీఆర్ గుర్తుచేశారు. 'విజయానికి సంకేతంగా నిలిచిన జమ్మి వృక్షానికి పూజ చేయడం, శుభానికి సూచికగా పాలపిట్టను దర్శించుకోవడం, అలయ్ బలయ్‌తో పరస్పరం ప్రేమాభిమానాలను చాటుకోవడం, పవిత్రమైన జమ్మి ఆకును బంగారంగా భావించి పంచుకోవడం, పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకునే మహోన్నత సంస్కృతి సంప్రదాయాన్ని దసరా పండుగ మనకు అందిస్తుంది' అని గులాబీ అధినేత కేసీఆర్ తెలిపారు.
'తెలంగాణ ప్రజా జీవితాల్లో దసరా పండుగకు ఉన్న ప్రత్యేకతను.. విశిష్టతను గౌరవిస్తూ.. జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది' అని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తొలి సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. 'ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మానిదే చివరి విజయమనే విజయ దశమి స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, అనంతర పదేండ్ల ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉంది' తెలిపారు. భవిష్యత్తులోనూ దసరా స్ఫూర్తితో ప్రజలు కొనసాగుతున్న అధర్మం మీద విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
సామాన్య ప్రజలను అన్ని రంగాల్లో విజేతలుగా నిలబెట్టడం ద్వారానే దసరా పండుగ స్ఫూర్తిని అమలుచేసిన వారు అవుతారని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. కొనసాగుతున్న కష్టాలను తొలగించి, తెలంగాణ ప్రజా జీవితాల్లో దసరా పండుగ, శుభాలను, సుఖ సంతోషాలను తీసుకురావాలని కేసీఆర్ ప్రార్థించారు. ఇక బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు.