Telangana Government Employees DA Hike: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (డీఏ) చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పెండింగ్‌లో ఉన్న రెండు విడతల డీఏలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేరిట ప్రభుత్వం వేర్వేరుగా రెండు అధికారిక ఉత్తర్వులను (G.O.Ms.No.128, G.O.Ms.No.130) విడుదల చేసింది. ఈ నిర్ణయంతో 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఒక డీఏ, 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా మరో డీఏను ఖరారు చేస్తూ ఉద్యోగులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేలా స్పష్టమైన మార్గదర్శకాలను వెలువరించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న 6 డీఏల్లో రెండు ఇచ్చేందుకు ఇటీవల అంగీకరించిన సర్కార్.. తాజాగా రెండు డీఏల విడుదలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేరిట ప్రభుత్వం వేర్వేరుగా రెండు కీలక ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. మంజూరైన రెండు డీఏలకు సంబంధించిన పాత బకాయిలను విడతలవారీగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే.. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చెల్లింపుల విధానాన్ని ఖరారు చేశారు. ప్రస్తుత నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో పెరుగుదల కనిపించనుంది.
మొదటి డీఏ..
2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా.. 2020 రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం ఉద్యోగుల డీఏను మూలవేతనంలో 33.67% నుంచి 37.31 శాతానికి (3.64% పెంపు) పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. 2015 పే స్కేల్ ఉద్యోగులకు 73.344 శాతం నుంచి 78.06 శాతానికి పెంచారు.
రెండో డీఏ..
2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా.. 2020 పే స్కేల్ ఉద్యోగుల డీఏను మూలవేతనంలో 37.31% నుంచి 40.04 శాతానికి (2.73% పెంపు) పెంచారు. అలాగే 2015 పే స్కేల్ వారికి 78.06 శాతం నుంచి 81.728 శాతానికి సవరించారు. ఇక 2016 పే స్కేల్ వర్తించే అధ్యాపకులకు 2024 జనవరి 1 నుంచి 46 శాతం నుంచి 50 శాతానికి.. జూలై 1 నుంచి 50 శాతం నుంచి 53 శాతానికి డీఏను పెంచారు.
డీఏ పెంపు వివరాలు ఇలా..
పెరిగిన డీఏలను అక్టోబర్ నెల జీతంతో కలిపి నవంబర్ 1న ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులకు సంబంధించిన పాత బకాయిల మొత్తాన్ని వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ఖాతాల్లో జమ చేయనున్నారు. డీఏ బకాయిల్లో 10 శాతం మొత్తాన్ని ప్రభుత్వ వాటాతో కలిపి ప్రాన్ (PRAN) ఖాతాకు జమ చేస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను విడతలవారీగా నవంబర్ 1 నుంచి చెల్లించనున్నారు. 2027 జనవరి 31 నాటికి లేదా అంతకంటే ముందు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు, జీపీఎఫ్ మినహాయింపు నిబంధనల ప్రకారం బకాయిలను సమాన వాయిదాల రూపంలో నేరుగా చెల్లిస్తారు. ఈ ఉత్తర్వులు వెలువడకముందే మరణించిన ఉద్యోగుల చట్టబద్ధమైన వారసులకు బకాయిల మొత్తాన్ని ఒకేసారి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ డీఏ పెంపు సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, వర్సిటీల బోధన/బోధనేతర సిబ్బందికి వర్తిస్తుంది. అలాగే పార్ట్‌టైమ్ అసిస్టెంట్లు, వీఆర్‌ఏలకు నెలకు రూ.100 చొప్పున అడ్‌హాక్ పెంపును మంజూరు చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి TGEJAC కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు తదితర వర్గాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రెండు కరువు భత్యం (DA)లను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న డీఏల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు, ఉన్నతాధికారులకు TGEJAC తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం వారికి కొంత ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఇదేవిధంగా మిగిలి ఉన్న పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు.