Dasara Special Buses 2026: దసరా పండుగ సందర్భంగా వరుస సెలవుల వేళ స్వస్థలాలకు ప్రయాణమయ్యే విద్యార్థులు, ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసింది. ఈ వివరాలను గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. దీని కోసం ప్రయాణికులు తమ ప్రాంత పరిధిలోని డెప్యూటీ రీజినల్ మేనేజర్ల (DRM) సంప్రదింపు నంబర్లను అధికారులు విడుదల చేశారు.
విద్యార్థులు, కాలనీవాసులకు ప్రత్యేక బస్సులు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు దసరా సెలవులకు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు వీలుగా కాలేజీలు, వసతి గృహాల ప్రాంతాల నుంచే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే వివిధ కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో నివసించే వారి కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. కనీసం 30 మందికి తగ్గకుండా ప్రయాణికులు ఉంటే, వారు ఉన్న చోటకే బస్సును పంపిస్తామని స్పష్టం చేశారు.
ప్రత్యేక బస్సు సౌకర్యం కోసం ప్రయాణికులు తమ ప్రాంతానికి సంబంధించిన డెప్యూటీ రీజినల్ మేనేజర్లను సంప్రదించవచ్చని సూచించారు. వివిధ ప్రాంతాల వారీగా సంప్రదించాల్సిన డీఆర్‌ఎం (DRM) నంబర్లు ఇక్కడ తెలుసుకోవచ్చు.
కూకట్‌పల్లి డివిజన్ డీఆర్‌ఎం (99562 26148)..
పటాన్‌చెరు, దుండిగల్, బీరంగూడ, కూకట్‌పల్లి, లింగంపల్లి, మియాపూర్, మాదాపూర్, బాలానగర్, గచ్చిబౌలి ప్రాంతాల ప్రజలు బస్సు వివరాల కోసం ఈ నంబరును సంప్రదించాలి
సికింద్రాబాద్ డివిజన్ డీఆర్‌ఎం (99592 26142)..
సికింద్రాబాద్, ఏఎస్‌రావు నగర్, మల్కాజిగిరి, రేతిఫైల్, ఉప్పల్, తార్నాక ప్రాంతాల నివాసితులు స్పెషల్ బస్సుల వివరాల కోసం ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
హయత్‌నగర్ డివిజన్ డీఆర్‌ఎం (99892 26136)..
హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్.బి.నగర్, ఆదిభట్ల, బడంగ్‌పేట్, మిధాని, సరూర్‌నగర్ ప్రాంతాల వారు ఈ మొబైల్ నంబరు కాల్ చేసి వివరాలను సంప్రదించవచ్చు.
చార్మినార్ డివిజన్ డీఆర్‌ఎం (99592 26129)..
రాజేంద్రనగర్, మెహదీపట్నం, అత్తాపూర్, కోఠి, చార్మినార్, కాచిగూడ, నారాయణగూడ ప్రాంతాల ప్రజలు ప్రత్యేక బస్సుల వివరాల కోసం ఈ నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ఈ ప్రత్యేక సేవల ద్వారా పండుగ ప్రయాణాన్ని ప్రయాణికులు సులభతరం చేసుకోవచ్చని తెలంగాణ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తెలిపారు.