Basar Saraswati Temple: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నుంచి భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ప్రారంభమవగా.. తెలంగాణలోని ప్రసిద్ధి సరస్వతీ క్షేత్రం బాసర ఆలయంలోనూ దేవీ నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. బాసర జ్ఞాన సరస్వతీ ఆలయంలో మొదటి రోజైన నేడు శైలపుత్రి అలంకరణలో సరస్వతి అమ్మవారు భక్తుల కు దర్శనమిచ్చారు. ఆలయ అర్చక బృందం బాలాలయంలో వేకువజామున అభిషేకం అనంతరం కట్టె పొంగలిని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
శైలపుత్రి అంటే: శైలము అంటే పర్వతం (హిమవంతుడు). పుత్రి అంటే కుమార్తె. పర్వతరాజైన హిమవంతుడి ఇంట పుత్రికగా జన్మించడంతో ఈమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. ఈమె పూర్వజన్మలో దక్షప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి. దక్షయజ్ఞంలో జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిలో ఆత్మహుతి చేసుకుంది. ఆ తర్వాత జన్మలో పార్వతీదేవిగా శైలపుత్రిగా జన్మించి కఠిన తపస్సు చేసి మళ్లీ శివుడినే పతిగా పొందింది. అమ్మవారు వృషభం (ఎద్దు)పై ఆసీనురాలై ఉంటుంది. అందుకే ఈమెను వృషారూఢా అని కూడా పిలుస్తారు.
శైలపుత్రి దేవి ద్విభుజ రెండు చేతులు కలిగి ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో పద్మం తామరపువ్వు ధరించి ప్రసన్న వదనంతో దర్శనమిస్తుంది. యోగ సాధనలో శైలపుత్రి అవతారం మూలాధార చక్రానికి అధిపతి. నవరాత్రి మొదటిరోజు సాధకులు తమ మనస్సును మూలాధార చక్రంపై కేంద్రీకరించి ధ్యానం చేస్తారు. దీనివల్ల ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాది పడుతుంది. శైలపుత్రి దేవిని ఆరాధించడం వల్ల జాతకంలో చంద్ర దోషాలు తొలగిపోతాయి. మనోధైర్యం, స్థిరత్వం లభిస్తాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజు వందలాది మంది భక్తులు నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి వస్తుంటారు కాబట్టి ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.